ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు

ABN , First Publish Date - 2020-06-02T08:40:42+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానానికి చెందిన భూముల్లో అనధికార నిర్మాణాలు వాస్తవమేనని ప్రభుత్వం నియమించిన దేవదాయ శాఖ

ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు

ప్రభుత్వానికి దేవదాయ శాఖ

జాయింట్‌ కమిషనర్‌ ఆజాద్‌ నివేదిక

ఈమధ్యకాలంలో చేపట్టినవిగా గుర్తింపు

తొలిపావంచా వద్ద నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల నిర్మాణం, కేటాయింపు

ఎస్డీసీని మాతృశాఖకు సరండర్‌ చేయాలని సిఫారసు

ఈవో నుంచి వివరణ తీసుకోవాలి


విశాఖపట్నం/సింహాచలం, మే 1:

వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానానికి చెందిన భూముల్లో అనధికార నిర్మాణాలు వాస్తవమేనని ప్రభుత్వం నియమించిన దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ (ఎస్టేట్స్‌) చంద్రశేఖర ఆజాద్‌ నివేదిక సమర్పించారు. అనధికార నిర్మాణాలపై కథనాలు రావడంతో మే 18, 19 తేదీల్లో ఆజాద్‌తో పాటు శాఖ రాజమండ్రి ప్రాంతీయ జాయింట్‌ కమిషనర్‌ డి.భ్రమరాంబ, విశాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ సుజాత, సర్వేయర్‌ సాయికృష్ణ, సింహాచలం దేవస్థానం భూ పరిరక్షణ విభాగపు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి.శేషశైలజ తదితరులు అడివివరం, వేపగుంట తదితర ప్రాంతాల్లోని 11 నిర్మాణాలు పరిశీలించారు. ఆ నిర్మాణాలన్నీ ఇటీవల కాలంలో జరిగినవిగా గుర్తించారు. దేవస్థానం భూ పరిరక్షణ విభాగం, ఎస్డీసీ, ఇతర అధికారుల వైఫల్యమే ఇందుకు కారణంగా ఆజార్‌ పేర్కొన్నారు. రెవెన్యూ విభాగం నుంచి దేవస్థానానికి డిప్యుటేషన్‌పై వచ్చిన ఎస్డీసీని ఉన్నతాధికారులు కోవిడ్‌-19 పనులకు వినియోగించుకోవడంతో దేవుడు భూముల పరిరక్షణ విధులు సక్రమంగా నిర్వహించలేక పోయినట్టు నివేదికలో అభిప్రాయపడ్డారు.


ఇంకా భూ పరిరక్షణ విభాగపు సిబ్బంది అలసత్వం, వారిపై ఈఓకు సరైన పట్టు లేకపోవడం వల్లనే అనధికార నిర్మాణాలు జరిగినట్టు నివేదికలో పొందుపరిచారు. అలాగే సింహాచలం కొండదిగువన తొలిపావంచా వద్ద చేపట్టిన 12 దుకాణాలు నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు తేల్చారు. దేవదాయ శాఖ చట్టం ప్రకారం దుకాణాలను వేలం వేయడం ద్వారా మాత్రమే కేటాయించాల్సి వుండగా నెలకు రూ.1500 నామమాత్రపు అద్దెను చెల్లించు పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించడంతో ఆలయ ఖజానాకు నష్టం వాటిల్లిందన్నారు. మొత్తం మీద క్షేత్ర పరిశీలన అనంతరం ఎస్డీసి పి.శేషశైలజను తమ మాతృసంస్థ రెవెన్యూకు సరండర్‌ చేయాలని, తొలిపావంచా వద్ద దుకాణాలను వేలం వేయాలని, ఇంతవరకు కలిగిన నష్టాన్ని దుకాణదారుల నుంచి వసూలు చేయాలని, పంచగ్రామాల భూ వివాదం పరిష్కారం అయ్యేంత వరకూ ఎటువంటి కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని సూచించారు. అదేవిధంగా అక్రమ నిర్మాణల విషయమై దేవస్థానం కార్యనిర్వాహణాధికారి నుంచి వివరణ కోరాలని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆజాద్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నుంచి సింహాచల దేవస్థానానికి తదుపరి ఉత్తర్వులు రావలసి ఉంది. 

Updated Date - 2020-06-02T08:40:42+05:30 IST