అక్రమంగా మట్టి తవ్వకాలు

ABN , First Publish Date - 2021-04-19T06:07:41+05:30 IST

అధికారముంటే కొండలైన బద్దలవ్వాల్సిందంటే ఇదే నేమో... మండలంలో ఇప్పుడు అదే జరుగుతోంది.

అక్రమంగా మట్టి తవ్వకాలు
ఎర్రమట్టి కోసం సలకం చెరువు కొండను తవ్వేసిన దృశ్యం


అడ్డుకోలేని స్థితిలో అధికారులు

శింగనమల మండలంలో  కాంట్రాక్టర్ల తీరిదీ..!

శింగనమల, ఏప్రిల్‌ 18 : అధికారముంటే కొండలైన బద్దలవ్వాల్సిందంటే ఇదే నేమో...  మండలంలో ఇప్పుడు అదే జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన వారమనే ధైర్యంతో కొందరు కాంట్రాక్టర్లు నిబంధనలు తుంగలో తొక్కి అక్రమం గా కొండలను చీల్చి మరీ మట్టిని తరలిస్తున్నారు. అదే సామాన్యుడు అవసరం మేరకు మట్టి కావాలంటే... నిబంధనలు తప్పనిసరని చెప్పే అధికారులకు ఈ ఘ టనలు కనబడలేదో... లేకపోతే అధికార పార్టీకి తలొగ్గారో తెలియదుగానీ... చూ సీచూడనట్లు మిన్నకుండిపోతున్నారు. దీంతో మండలంలో ఎర్రమట్టి తవ్వకాలు మూడు పువ్వులు... ఆరు కాయలు అన్న చందంగా నడుస్తున్నాయి. ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మాణానికి ఎద్దుల బండితో మట్టి, ఇసుక తోలుకుంటే పంచాయతీ అనుమతి లేదని ఎద్దులను, బండ్లను పోలీస్‌స్టేషనకు తరలించే పోలీసులకు ఈ ఎర్రమట్టి తరలింపు కనబడ లేదా అని మండల ప్రజలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా... రోడ్డు నిర్మాణాలకంటూ అధికార పార్టీకి చెందిన కొందరు కాంట్రాక్ట ర్లు కొండను తవ్వుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై మండల వ్యాప్తం గా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులే రోడ్డు నిర్మాణాలు చే యడంతో పంచాయతీ అధికారులు నోరుమెపదడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

అధికారం దెబ్బకు చతికిలపడ్డ నిబంధనలు

శింగనమల మండలంలో సలకం చెరువు, ఈస్టు నరసాపురం, కొరివిపల్లి, ఉల్లికల్లు, వెస్టునరసాపురం, గుమ్మేపల్లి, పెద్దమట్లగొంది ప్రాంతాల్లోని కొండ ప్రాం తంలో ఎర్రమట్టి అధికంగా లభ్యమవుతోంది. ఇక్కడే అధికార పార్టీకి చెందిన కొం దరు కాంట్రాక్టర్ల కన్ను పడింది. మండలంలోని ఉల్లికల్లు-నాయనపల్లి రోడ్డు, పో తురాజుకాలువ, సలకం చెరువు రోడ్డు, నాయనవారిపల్లి రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులకు మట్టి తరలించేందుకు తప్పనిసరిగా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. దీంతో పాటు పంచాయతీకి కట్టాల్సిన రుసుం చెల్లించి ఎన్ని క్యూబిక్‌ మీటర్లు కావాలో... అందుకు సంబంధించి అనుమతులు తీసుకోవాలి. మండలంలో ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. సలకం చెరువు కొండ, ఈస్టు నరసాపురం, కొరివి పల్లి ప్రాంతాల నుంచి ఎవరికి తోచిన స్థాయిలో కాంట్రాక్టర్లు యథేచ్ఛగా ఎర్రమట్టిని తోలేస్తున్నారు. దానిని ఇష్టారాజ్యంగా రోడ్డుకిరువైపుల తోలుకొని ప్రభుత్వ ఆ దా యానికి గండి కొడుతున్నారు. వందలాది టిప్పర్లతో ఎర్రమట్టిని అక్రమంగా తర లించి ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్న వాదనలు బలంగా విని పిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.... కాంట్రాక్టర్లు వైసీపీకి చెందిన వారు కావడం తోనే వారికి అడ్డుచెప్పే ధైర్యం చేయలేని స్థితిలో స్థానిక అధికారులు ఉన్నారన్న వాదనలు ఆ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. అయితే కొండ ప్రాంతంలో భూ ములున్న రైతులేమో... తమ భూముల పైప్రాంతంలో ఎర్రమట్టి తొలగిస్తే, వర్షం వచ్చినప్పుడు నీరు వచ్చి తమ భూములు కోతకు గురవుతాయని అధికారులకు తెలిపినా... ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే వి ధంగా మండలంలోని ఓ గ్రామంలో కేవలం అధికార పార్టీ నాయకులు తక్కువ క్యూబిక్‌ మీటర్లకు అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా ఎ ర్రమట్టి తవ్వకాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారు లు స్పందించి  ఎర్రమట్టి అక్రమ తవ్వకాలను ఆపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

అనుమతులు తప్పనిసరి : శివనారాయణరెడ్డి, ఈఓపీఆర్డీ

గ్రామ పంచాయతీలో ఇసుక, ఎర్రమట్టి తోలుకోవడానికి తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి అనుమతులు తీసుకోవాలి. అనుమతులు లేకుండా వాటిని తరలిస్తేస్తే చర్యలు తప్పవు. మండలంలో ఎర్రమట్టి తరలింపునకు పంచాయతీ కార్యదర్శులు అనుమతులు ఇచ్చి ఉన్నారు.


Updated Date - 2021-04-19T06:07:41+05:30 IST