తెలంగాణవే అక్రమ ప్రాజెక్టులు

ABN , First Publish Date - 2021-06-22T08:08:35+05:30 IST

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద ఎత్తిపోతల నిర్మిస్తే తప్పెలా అవుతుందో తెలంగాణ చెప్పాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు

తెలంగాణవే అక్రమ ప్రాజెక్టులు

అనుమతులు లేకుండా కొత్తవి కడుతున్నారు

పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల కడితే తప్పేంటి?

నీటి కేటాయింపులకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నాం

అధికారుల స్థాయిలో నీటి సమస్యలు పరిష్కారం కావు 

కేసీఆర్‌, జగన్‌ కలసి మాట్లాడుకుంటారు: మంత్రి అనిల్‌


అమరావతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద ఎత్తిపోతల నిర్మిస్తే తప్పెలా అవుతుందో తెలంగాణ చెప్పాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. నిబంధనల ప్రకారమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా నదిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నట్లు ఆ రాష్ట్రం ఆరోపిస్తోందని.. అయితే రాయలసీమలో కడుతున్న ప్రాజెక్టులన్నీ బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులకు లోబడినవేనని స్పష్టం చేశారు. సోమవారమిక్కడ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు నీరు వస్తేనే పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను రాష్ట్రం వినియోగించుకునే వీలుందని.. అది కూడా కేవలం 15 రోజులు.. రోజుకు 44,000  క్యూసెక్కులను తీసుకోగలమని గుర్తుచేశారు. 848 అడుగుల మట్టంలో ఒక్క చుక్క నీటిని కూడా తీసుకునే వీలుండదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరు టీఎంసీలకు పైగా నిల్వ సామర్థ్యం కలిగిన కొత్త ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో 800 అడుగుల్లో నీటి నిల్వలున్నా తోడుకునేలా తెలంగాణ ప్రాజెక్టులను నిర్మిస్తోందని అన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు సామర్థ్యం పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి పథకంలోనూ లిఫ్ట్‌ పెట్టారన్నారు. సుంకేశుల వద్ద తెలంగాణ కడుతున్న ప్రాజెక్టు సక్రమమైనదా అని నిలదీశారు. 800 అడుగుల నుంచి తెలంగాణ తోడుకుంటే తప్పులేదా.. ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తే మాత్రం తప్పా అని ప్రశ్నించారు. కృష్ణా నది నుంచి సరిపడా నీళ్లను తీసుకునేందుకే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నామని చెప్పారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని.. భవిష్యత్‌లోనూ అదే చేస్తామని తెలిపారు.అధికారుల స్థాయిలో నీటి సమస్యలు పరిష్కారం కావని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణకు స్నేహహస్తం అందించే ప్రయత్నం చేసినా ప్రయోజనం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల స్థాయిలో నీటి పంపకాలు, వినియోగం సమస్యలు పరిష్కారం కావని.. వీటిపై సీఎం జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పకుండా కలసి మాట్లాడుకుంటారని అనిల్‌కుమార్‌ తెలిపారు.


తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై న్యాయపోరాటం

కృష్ణా నదిపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై న్యాయపోరాటం చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. జలవివాదాలపై కేసీఆర్‌తో మరోదఫా ముఖాముఖి చర్చలు జరపాలని భావించినా.. చర్చలతో ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయానికి సీఎం జగన్‌ వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానంలో తేల్చుకుందామని రాష్ట్ర జల వనరుల శాఖకు ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది. దీంతో ఈ అంశంపై న్యాయ సలహా తీసుకోవడానికి మంగళవారం అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాతో జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు సమావేశం కానున్నారు. కాగా.. తెలంగాణ ప్రాజెక్టులపై రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీని కోరకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఏముంటుందని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-06-22T08:08:35+05:30 IST