‘చరిత్ర’ను తవ్వేస్తున్నారు

ABN , First Publish Date - 2022-03-14T07:44:23+05:30 IST

కాలజ్ఞానం రచించిన స్థలం కాలగర్భంలో కలసిపోతోంది. భారీ బ్లాస్టింగ్‌లతో దద్దరిల్లుతోంది. అధికార పార్టీ నేతల అండతో అక్రమ మైనింగ్‌ రాజ్యమేలుతోంది. అడ్డుకట్ట వేయాల్సిన..

‘చరిత్ర’ను తవ్వేస్తున్నారు

  • రవ్వలకొండ గుహలపై మైనింగ్‌ పంజా
  • బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రాంతం
  • 500 మీ. దూరంలో తవ్వకాలకు అనుమతి లేదు
  • ఓ ప్రజాప్రతినిధి అనుచరుల అక్రమ మైనింగ్‌ 
  • వంత పాడుతున్న కీలక శాఖల అధికారులు 
  • సీఎంకు ఫిర్యాదు చేసినా స్పందించని వైనం
  • బ్లాస్టింగ్‌లతో బెంబేలెత్తుతున్న బనగానపల్లె 


వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించిన గుహలు ఉన్న ప్రాంతం అది. ఆ చారిత్రక ప్రదేశం.. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని రవ్వలకొండ. ఆ గుహలకు 500 మీటర్ల లోపు మైనింగ్‌ జరపకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అక్రమార్కులు వాటిని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. అధికార పార్టీ నేతల అండతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. 


(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

కాలజ్ఞానం రచించిన స్థలం కాలగర్భంలో కలసిపోతోంది. భారీ బ్లాస్టింగ్‌లతో దద్దరిల్లుతోంది. అధికార పార్టీ నేతల అండతో అక్రమ మైనింగ్‌ రాజ్యమేలుతోంది. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు వంత పాడుతున్నారు. ఇదీ.. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని రవ్వలకొండలో బెదిరింపుల నడుమ అక్రమ మైనింగ్‌ జరుగుతున్న తీరు. అక్రమ మైనింగ్‌ వెనుక ఓ ప్రజాప్రతినిధి హస్తంఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ప్రభుత్వం కళ్లుమూసుకోవడంతో పరోక్ష సహకారం ఇచ్చినట్టవుతోంది. బ్రహ్మంగారి భక్తులు పవిత్రంగా భావించే రవ్వలకొండ ప్రాంతం మైనింగ్‌కు నిలయంగా మారింది. అన్‌ సర్వేయ్‌డ్‌ హిల్‌ బ్లాక్‌ పేరుతో అధికారులు మైనింగ్‌ లీజులు ఇచ్చారు. బనగానపల్లె మండలం భానుముక్కల గ్రామంలోని అన్‌ సర్వేయ్‌డ్‌ హిల్‌ బ్లాక్‌లో ప్రభుత్వ ఆధీనంలోని 3.002హెక్టార్లలో ఓ క్వారీ ఉంది. రోడ్లు, భవన నిర్మాణాలకు కావాల్సిన మట్టి తవ్వుకునేందుకు ఓ ప్రజాప్రతినిధికి సమీప బంధువైన జి.శివశంకర్‌రెడ్డి లీజుకు తీసుకున్నారు.


2012లో కర్నూలు జిల్లా గనులు, భూగర్భ శాఖ లీజుకు ఇచ్చింది. 2019లో శివశంకర్‌ రెడ్డి మరణానంతరం ఆయన కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి చేయించుకున్నారు. ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోనే క్వారీ నిర్వహణ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఆయనపై అక్రమ తవ్వకాల కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేయించారు. క్వారీ పనులను తిరిగి హుటాహుటిన మొదలుపెట్టారు. సంబంధిత 3.002 హెక్టార్లతో పాటు ఆనుకుని ఉన్న రవ్వలకొండలోని ఎక్స్‌టెన్షన్‌ 1.910 హెక్టార్లనూ తవ్వేస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించిన రవ్వలకొండలోని గుహలకు 500 మీటర్ల దూరంలోపు మైనింగ్‌ జరపకూడదన్న నిబంధనలను అక్రమార్కులు తుంగలో తొక్కుతున్నారు. భారీగా ఎక్స్‌వేటర్లను మోహరించి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. 


ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో..

ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో క్వారీ యజమానులు మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. పలు శాఖల అధికారులను బెదిరిస్తూ అక్రమ మైనింగ్‌, బ్లాస్టింగ్‌లపై వచ్చే ఫిర్యాదులను అడ్డుకుంటున్నారు. పైగా సీఎం జగన్‌ అండదండలు తమకున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. సీఎం జగన్‌కు ఫిర్యాదులు చేసి ఏడాది గడుస్తున్నా స్పందించలేదు. దీంతో అధికార పార్టీ మద్దతు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


బీజేపీ నేత వాగు కబ్జా 

ఆ ప్రజాప్రతినిధి అండతో స్థానిక బీజేపీ నేత కూడా కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జల వనరుల శాఖకు చెందిన సుమారు 750 మీటర్ల వాగును ఆ నేత ఆరడుగుల మేర పూడ్చేసి, తన కల్యాణ మండపానికి రోడ్డు వేయించుకున్నారు. దర్గా స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడంతో విషయం ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి వరకు వెళ్లింది. ఎస్పీ జోక్యంతో ఆయన దిగి వచ్చారు. ఆ బీజేపీ నేత సోదరుడు వైసీపీలో స్థానిక ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్నారు. కల్యాణ మండపం భూమి పూజకు స్థానిక ఎమ్యెల్యే ముఖ్య అతిథిగా పాల్గొనడం గమనార్హం. 


కంపించిన బనగానపల్లె 

ఏడాది క్రితం అన్‌ సర్వేయ్‌డ్‌ హిల్‌ బ్లాక్‌ ప్రాంతంలో జరిగిన బ్లాస్టింగ్‌లకు బనగానపల్లె కంపించిపోయింది. మైనింగ్‌ ప్రాంత పరిసరాల్లోని నివాసాలకు బీటలు ఏర్పడటంతో కూలిపోయే స్థితికి చేరాయి. ఆ బ్లాస్టింగ్‌ జరిగింది సదరు ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోని క్వారీ నుంచా కాదా అనేది తెలుసుకోలేకపోయామంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు తప్పించుకుంటున్నారు. అక్రమార్కులను ఇలాగే వదిలేస్తే మరో ఏడాదిలో రవ్వలకొండ చరిత్రలో కలిసిపోవడంతో పాటు ఊరి జనం ఖాళీ చేసి వలసలు వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ అక్రమ మైనింగ్‌, బ్లాస్టింగ్‌లపై ఎప్పటికప్పుడు స్థానిక, జిల్లా అధికారులకు పట్టణ వాసులు, నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే.. ఏ  అధికారి కూడా అటువైపు తొంగి చూడటంలేదు. పైగా బ్లాస్టింగ్‌లు చేసింది ఎవరో తెలియలేదని స్థానిక రెవెన్యూ అధికారి లిఖిత పూర్వకంగా రాసి పోలీసులకు అందించారు. కేసు నమోదై ఏడాదిన్నర గడుస్తున్నా పోలీసులు నిందితులను అదుపులోకి కూడా తీసుకోకుండా కేసును పెండింగ్‌లో పెట్టారు. 


స్థానికుల ఫిర్యాదు 

రవ్వలకొండ సమీపంలో రాంభూపాల్‌ నగర్‌, ఈద్గా నగర్‌, తెలుగుపేట వంటి పలు కాలనీలున్నాయి. అందులో వందకు పైగా నివాసాలున్నాయి. అక్కడి ప్రజలు భారీ పేలుళ్ల ధాటికి భయకంపితులవుతున్నారు. 2020లో రవ్వలకొండ మైనింగ్‌లో జరిగిన పేలుళ్ల ధాటికి ఊరంతా మార్మోగిపోయింది. భూకంపం వచ్చిందని ప్రజలు వణికిపోయారు. అక్రమార్కుల నిర్వాకమని తెలుసుకున్న స్థానిక కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రవ్వలకొండకు అతి సమీపంలో 750 మంది విద్యార్థులతో కూడిన మోడల్‌ స్కూల్‌తో పాటు గురుకుల పాఠశాల, బాయ్స్‌ హాస్టల్‌ కూడా ఉన్నాయి. 


పేలుళ్లకు ఇల్లు వదిలేశాం  

తవ్వకాలకు మేం అడ్డుగా ఉన్నట్టుంది. ఇటీవలి వరకు కొండపై పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఆ పేలుళ్లకు మా ఇంటి కప్పులు కూలిపోయాయి. చేసేది లేక ఆ ఇల్లు ఖాళీగా వదిలేసి మరోచోట వచ్చి ఉంటున్నాం. ఇక్కడ నీళ్లు, కరెంట్‌, డ్రైనేజీ సౌకర్యాలు లేకపోయినా ఉంటున్నాం. ఈ పేలుళ్లకు ఇళ్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితులు వస్తున్నాయి. చాలా మంది ఇక్కడ ఉండటానికి భయపడి, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. 

లక్ష్మీదేవి, బనగానపల్లె 


ఫిర్యాదు చేస్తేనే సర్వే చేస్తాం 

రవ్వలకొండలో సర్వే చేయట్లేదు. ఏవైనా ఫిర్యాదులు వస్తేనే సర్వేచేస్తాం. అప్పుడే అనుమతులు మీరి తవ్వకాలు జరుగుతున్నాయో, లేదో తెలుస్తుంది. గతంలో జరిగిన బ్లాస్టింగ్‌ ఆ మైనింగ్‌లో కాదని స్థానిక వీఆర్వో వార్తా ప్రకటన ఇచ్చారు. ఆ బ్లాస్టింగ్‌ల సంగతి పోలీసుల పరిధిలోనిది. మేమేం చేయగలం? వాళ్లే పట్టించుకోవాలి.  

 సుబ్బారెడ్డి, అసిస్టెంట్‌ డైర్టెకర్‌, గనులు, భూగర్భ శాఖ 


రవ్వలకొండ ప్రాశస్త్యం 

చరిత్రకారుల ప్రకారం బనగానపల్లె సమీపంలో రవ్వలకొండలోని గుహల్లో పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం రాశారు. 1608లో జన్మించిన ఆయన బనగానపల్లెకు 13 ఏళ్ల వయసులో వచ్చారు. గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో గోవుల కాపరిగా జీవనం సాగించారు. గోవులను రవ్వలకొండకు తోలుకెళ్లి మేపేవారు. ఆ సమయంలో ఓ గుహలో కూర్చుని భవిష్యత్‌లో జరగబోయే విషయాల గురించి తాళపత్ర గ్రంథాలు రచించారు. ఆ గుహను నిత్యం వేల సంఖ్యలో  సందర్శిస్తుంటారు. ప్రస్తుతం కొన్ని తాళపత్ర గ్రంథాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. బనగానపల్లెలోని చింతమాను మఠంలో నేలమాళిగలో కొన్ని ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. 

Updated Date - 2022-03-14T07:44:23+05:30 IST