అక్రమంగా హోర్డింగ్‌లు

ABN , First Publish Date - 2022-05-30T06:01:18+05:30 IST

కీసర, చీర్యాల్‌ చౌరస్తాల్లోని ఇళ్లపై పదుల సంఖ్యలో భారీ హోర్డింగులు పెట్టారు. వాటిలో ఒక్కదానికీ అనుమతి లేదు. ప్రధాన చౌరస్తాల్లో హోర్డింగ్‌లు పెట్టాలంటే పంచాయతీ అనుమతి తప్పనిసరి.

అక్రమంగా హోర్డింగ్‌లు
కీసరలో పెట్టిన హోర్డింగ్‌లు

  • ఇళ్లపై పుట్టగొడుగుల్లా వెలిసిన వైనం
  • నిబంధనలు పాటించని కంపెనీలు, ఇళ్ల యజమాలు
  • పంచాయతీలకు వస్తున్న ఆదాయం సున్నా
  • పర్మిషన్‌, ట్యాక్స్‌లపై దృష్టి సారించని అధికారులు

కీసర, చీర్యాల్‌ చౌరస్తాల్లోని ఇళ్లపై పదుల సంఖ్యలో భారీ హోర్డింగులు పెట్టారు. వాటిలో ఒక్కదానికీ అనుమతి లేదు. ప్రధాన చౌరస్తాల్లో హోర్డింగ్‌లు పెట్టాలంటే పంచాయతీ అనుమతి తప్పనిసరి. అలాగే పంచాయతీకి తగిన ఫీజూ చెల్లించాలి. ఇవేమీ పాటించకుండానే కంపెనీల ప్రతినిధులు ఇళ్ల యజమానుతో అగ్రిమెంట్‌ చేసుకుంటూ అడ్వైర్టైజ్‌మెంట్‌ హోర్డింగ్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన రోడ్ల పక్కన భారీ హోర్డింగ్‌ల ఏర్పాటుతో గాలిదుమారం సమయాల్లో అవి వాహనదారులపై పడే ప్రమాదం కూడా ఉంది.


కీసర, మే 29: కీరస పట్టణంలో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న బిల్డింగ్‌లపై నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం హోర్టింగులు పెట్టారు. హోర్డింగ్‌లపై పంచాయతీకి పన్ను మాత్రం కట్టడం లేదు. పెట్టిన హోర్డింగుల్లో చాలా వాటికి పంచాతీ పర్మిషన్‌ లేదు. కీసర, చీర్యాల్‌ చౌరస్తా పరిధిలో పదుల సంఖ్యలో హోర్డింగులు పెట్టారు. ప్రధాన రోడ్డుపై ఉండే కట్టడాలు, బిల్డింగ్‌లపై వాహనదారుల దృష్టి మరల్చేలా పెట్టే హోర్డింగ్‌లు, అడ్వర్టైజ్‌మెంట్‌ ఫ్లెక్సీలు, భారీ బ్యానర్లు తదితర వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. పట్టణాలు, నగరాల్లోని ప్రధాన రోడ్లపై ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను చూసి కొన్నిసార్లు వాహనదారులు ప్రమాదాలకు గురైన సందర్భాలూ ఉన్నాయి. అలాగే గాలి దుమారం వచ్చిన సమయాల్లో భారీ హోర్డింగ్‌లు రోడ్డు పడిపోయి వాహనదారుల గాయపడిన, వాహనాలు ధ్వంసం అయిన సందర్భాలు సైతం ఉన్నాయి. దీంతో వాణిజ్య ప్రకటనల హోర్డింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. హోర్డింగ్‌ల ద్వారా మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఆదాయం వచ్చినా వాటి వల్ల ప్రజా జీవనానికి ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతో కఠిన నిబంధనలు విధించింది. ఎక్కడ హోర్డింగ్‌లు పెట్టుకోవచ్చు, పెడితే ఎలాంటి భద్రతా నియమాలు పాటించాలి? అనే అంశాలపై విధివిధానాలు రూపొందించారు. ఇళ్ల యజమానులు ఇష్టానుసారం హోర్డింగులు పెట్టించుకోవడం నిషేధం. ప్రజలకు ఇబ్బందులు, ప్రమాదకంగా ఉండే చోట్ల హోర్డింగ్‌లు పెట్టకూడదు. హోర్డింగులు పెట్టాలన్నా పంచాయతీలు/ మున్సిపాలిటీల నుంచి అనుమతి తప్పక తీసుకోవాలి. అలాగే సదరు హోర్డింగ్‌లకు కాలానుగుణంగా స్థానిక సంస్థలకు ఫీజు చెల్లించాలి.

పంచాయతీలకు చేకూరని ఆదాయం

పట్టణాల్లో ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో హోర్డింగ్‌ల పెట్టినా పంచాయతీలకు ఆదాయం మాత్రం రావడం లేదు. ఇళ్ల యజమానులు కంపెనీల నుంచి ఏటా వేలాది రూపాయలు తీసుకుంటున్నా పంచాయతీలకు పైసా కట్టడం లేదు. కంపెనీలు ఓ ఇంటిపై హోర్డింగ్‌ పెట్టాలంటే ఇంటి యజమానితో ఒప్పందం చేసుకుంటాయి. నెల, రెండు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఇలా ఎంత కాలం హోర్డింగ్‌ పెడతారు? ఎంత సైజులో పెడతారు? అనేవి ముందే అగ్రిమెంట్‌ చేసుకుంటారు. బిల్డింగ్‌ పరిమాణం, లొకేషన్‌ తదితర అంశాలపై రెంట్‌ నిర్ణయించుకుంటారు. హోర్డింగులపై పన్నులు వసూళ్లు చేస్తున్నారా? అని కీసర పంచాయతీ కార్యదర్శిని అడుగగా అసలు తనకు ఆ విషయమే తెలియదని చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారులు పట్టించుకొని నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన హోర్డింగులను తీసేయించడంతో పాటు హోర్డింగులు పెట్టుకోవాల్సిన చోట్ల వాటికి తగిన అనుమతి తీసుకునేలా చూడాల్సిన బాధ్యత ఉంది.  లేదంటే సదరు కంపెనీలకు, ఇళ్ల యజమానులకు భారీగా జరిమానా విధించే హక్కు పంచాయతీలకు ఉంది.

  • పంచాయతీ ఆదాయానికి గండి : బండారి శ్రీనివా్‌సరెడ్డి, కీసర

పుట్టగొడుగుల్లా హోర్డింగ్‌ల వెలుస్తున్నా.. పంచాయతీకి రావాల్సిన ఆదాయం మాత్రం రావడం లేదు. ఇళ్ల యజమానులు ఇష్టానుసార హోర్డింగులు పెట్టించుకుంటున్నారు. హోర్డింగులపై పన్నులు వసూళ్లు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపై ఇన్ని హోర్డింగ్‌లు కన్పిస్తున్నా.. ఎన్నింటికి అనుమతి తీసుకున్నారనే విషయం అధికారులకు తెలియదా? కొందరు పంచాయతీ సిబ్బంది సైతం ఇళ్ల యజమానులు, కంపెనీల ప్రతినిఽధలతో కుమ్మక్కై పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారడంతో సందేహం లేదు. కీసరలో హోర్డింగ్‌లపై జిల్లా అధికారులు దృష్టి సారించాలి.


  • ఇష్టానుసారం హోర్డింగ్‌లకు అనుమతి లేదు : మంగతాయారు, ఎంపీవో, కీసర

ఇష్టానుసారం, అనుమతి లేకుండా పెట్టిన హోర్డింగులను గుర్తిస్తాం. హోర్డింగులు పెట్టించిన ఇళ్ల యజమానులకు నోటీసులు ఇస్తాం. హోర్డింగ్‌లపై నిబంధనల మేరకు పన్నులు వసూలు చేస్తాం. నాలుగైదేళ్లుగా హోర్డింగ్‌లు ఇతర అడ్వర్టైజ్‌మెంట్‌ల ద్వారా వచ్చే ఆదాయంపై మేం పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇకపై ప్రతీ హోర్డింగ్‌కు అనుమతి తీసుకునేలా డ్రైవ్‌ నిర్వహిస్తాం. హోర్డిండ్‌ ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్లవ వాటిని పెట్టకుండా చూస్తాం. ప్రజా భద్రతే మాకు ముఖ్యం.

Updated Date - 2022-05-30T06:01:18+05:30 IST