అక్రమాలు చేపట్టారు

ABN , First Publish Date - 2022-05-27T06:21:30+05:30 IST

అక్రమాలు చేపట్టారు

అక్రమాలు చేపట్టారు

నిషేధ సమయంలో యథేచ్ఛగా చేపల వేట

అధికార పార్టీ నాయకుల మాయాజాలం

బోటుకు రూ.10 వేల చొప్పున వసూలు

చక్ర ం తిప్పుతున్న సంఘ మాజీ నాయకులు

మెరైన్‌, మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి

ఖరీదైన కచిడి చేపల కోసమే.. 


చేపల వేట నిషేధ సమయం అధికార పార్టీ నేతలకు కాసుల పంట పండిస్తోంది. నిబంధనలను పక్కనపెట్టి సముద్రంలో వారంపాటు చేపలు పట్టుకునేందుకు ఒక్కో బోటు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. అధికారులు అడక్కుండా, పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు బోట్ల యజమానులు అధికార పార్టీ నాయకులను రంగంలోకి దింపడంతో నిషేధ సమయంలో వేట జోరుగా సాగుతోంది. 


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన ఇది. కానీ, మచిలీపట్నం గిలకలదిండి హార్బర్‌ వద్ద చేపల వేట అక్రమంగా సాగుతోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారూ అక్రమంగా వేట సాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ నుంచి ప్రత్యేకంగా మత్స్యకారులను తీసుకొచ్చి మరీ వేటను సాగిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ముడుపులు దండుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. 

బోటుకు రూ.10 వేలు

ఏప్రిల్‌కు ముందు కచిడి చేపలు సముద్రంలో 100 నాటికల్‌ మైళ్ల దూరంలో తిరుగుతుంటాయి. ఏప్రిల్‌ ప్రారంభం నుంచి ఈరకం చేపలు గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తాయి. నీటిలో పైకి తేలుతూ కనిపించే ఈ చేపలను ఈ రెండు నెలల్లో తేలిగ్గా పట్టుకోవచ్చు. వీటి ఊపిరితిత్తులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. మనుషులకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలకు ఈ ఊపిరితిత్తుల నుంచి తయారుచేసిన దారాన్నే ఉపయోగిస్తారు. దీంతో వీటి ధర ఎక్కువగానే ఉంటుంది. పెద్ద చేప అయితే రూ.లక్ష పలుకుతుంది. ఈ కారణంతోనే నిషేధ సమయంలో కచిడి చేపలను పట్టేందుకు మత్స్యకారులు ఆసక్తి చూపిస్తారు. దీనినే సాకుగా తీసుకుని కొందరు మత్స్యకారుల సంఘం పెద్దలు గిలకలదిండి హార్బర్‌ను కేంద్రంగా చేసుకుని సోనాబోట్లను చేపల వేటకు పంపుతున్నారు. ఒక్క బోటు వారం పాటు వేట సాగిస్తే పెద్దలకు ఇవ్వాల్సింది రూ.10 వేలు. ఈ లెక్కన ఈ హార్బర్‌ మీదుగా 30 నుంచి 40 బోట్ల వరకు చేపల వేటకు వెళ్లొస్తున్నాయి. 

ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమావేశమై..

ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ అసాని తుఫాను సంభవించింది. మచిలీపట్నం-కృత్తివెన్ను మధ్య తీరాన్ని తాకింది. దీంతో సముద్రంలోకి గుట్టుచప్పుడు కాకుండా చేపల వేటకు వెళ్లిన బోట్లు తుఫాను సమయంలో చిక్కుకుపోయాయి. గిలకలదిండి హార్బర్‌  నుంచి వెళ్లిన బోటు, అందులోని 8 మంది ఎన్నో కష్టాలు పడి బయటపడ్డారు. దీంతో మత్స్య, మెరైన్‌, పోలీస్‌ అధికారులు సముద్రంలోకి బోట్లు వెళ్లకుండా నిఘా పెంచారు. ఆ సమయంలో చిక్కుకుపోయిన బోటును కనిపెట్టే క్రమంలో పోలీసులు సముద్రంలో జల్లెడ పట్టగా, 30 నుంచి 40 బోట్లు ఉన్నట్టు గుర్తించారు. కాగా, గిలకలదిండికి చెందిన బోటు యజమానులు వారం కిందట ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమావేశమయ్యారు. సముద్రంలో కచిడి చేపలు దొరుకుతున్న నేపథ్యంలో బోట్లు చేపల వేటకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. చూసీచూడనట్టుగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇదే అదనుగా గిలకలదిండి, మచిలీపట్నానికి చెందిన కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు పెద్దల అవతారమెత్తారు. వేటకు వెళ్లే ఒక్కో బోటు నుంచి కనీసం రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. ఈ విషయం తెలిసిన మరికొందరు మత్స్య సహకార సంఘం మాజీ నాయకులు మా సంగతేంటని, బోట్లు వేటకు వెళ్తే అధికారులకు ఫిర్యాదు చేస్తామని బేరాలకు దిగారు. దీంతో బోటు యజమానులు.. ఆ మాజీ నాయకులను మచ్చిక చేసుకునేందుకు మళ్లీ నగదు వసూళ్లకు పాల్పడటంతో ఈ వ్యవహారం బయట పడింది.


నిఘా పెంచాం..

గిలకలదిండి హార్బర్‌తో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ ఎఫ్‌డీవోల ద్వారా నిఘా పెట్టాం. నేను కూడా రోజూ ఉదయం, సాయంత్రం పరిశీలిస్తున్నాను. ఈ నెల 12న సముద్రంలో వేటకు వెళ్లిన బోటుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నాం. ఉప్పాడ నుంచి గిలకలదిండికి మత్స్యకారులను తీసుకొచ్చి నిషేధ సమయంలో వేటను కొనసాగించే విషయంపై దృష్టి సారిస్తున్నాం. జూన్‌ 15  వరకు సంప్రదాయ బోట్లు తప్ప ఇంజనుతో నడిచే బోట్లు వేటకు వెళ్లకూడదు. - షేక్‌ లాల్‌మహ్మద్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి

Updated Date - 2022-05-27T06:21:30+05:30 IST