అక్రమ కుళాయిలు

ABN , First Publish Date - 2022-10-04T05:25:14+05:30 IST

నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ కుళాయి కనెక్షన్లు పెరిగిపోతున్నాయి. అయినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

అక్రమ కుళాయిలు

  1. నగరంలో 2500 పైగా అక్రమ కనెక్షన్లు 
  2. మామూళ్ల మత్తులో రెవెన్యూ సిబ్బంది 
  3. చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు

కర్నూలు(న్యూసిటీ), అక్టోబర్‌ 3: నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ కుళాయి కనెక్షన్లు పెరిగిపోతున్నాయి.  అయినా  ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కొందరు సిబ్బంది చేతివాటం చూపిస్తూ అక్రమ కనెక్షన్లకు తెరతీస్తున్నారు. అందినకాడికి దండుకుంటూ  అక్రమ కనెక్షన్లు ఇస్తూ సంస్థ ఆదాయానికి గండికొడుతున్నారు. నగర పరిధిలో 6 లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరందరికీ  మునగపాలపాడు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు నుంచి వచ్చే నీటిని అశోక్‌నగర్‌ పంప్‌హౌ్‌సకు తరలించి శుద్ధి చేసి  సరఫరా చేస్తున్నారు. అయితే కొన్ని శివారు కాలనీలతో పాటు నగరంలోని ప్రధాన కాలనీల్లో నీరు సరిగ్గా రావడం లేదనే  ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన చేపట్టిన గడప గడప కార్యక్రమంలో చాలా వార్డుల్లో ప్రజలు తమకు తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదు చేశారు.  ఈ  సమస్యను నివారించేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇండ్లకు,  పరిశ్రమలకు  కుళాయి కనెక్షన్ల మంజూరులో సరైన అవగాహన లేకపోవడంతో నీటి సమస్య తీవ్రమయింది.  దీనినే ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది ఇష్టానుసారంగా అక్రమ కుళాయి కనెక్షన్లు ఇస్తూ జేబులు  నింపుకుంటున్నారు.

 అక్రమాలకు తెర

నగర పరిధిలో ఒక ఇంటికి కుళాయి కనెక్షన అత్యవసరం కింద మంజూరు చేయాలంటే రూ.10,500 చలానా కట్డాలి. ఇదే కనెక్షన నిర్ణీత సమయంలో ఇవ్వాలంటే రూ.6510 కట్టాలి.  పరిశ్రమలకు రూ.20,500 డిపాజిట్‌ చేయాలి. అయితే కింది స్థాయి సిబ్బంది కొందరు ఉన్నతాధికారుల అండదండలతో.. కుళాయి కనెక్షన కోసం ప్రజలు చెల్లించే నగదులో కొంత సొమ్మును తీసుకుని అక్రమంగా కుళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా రెవెన్యూ సెక్షనలోని కింది స్థాయి అధికారి చేతుల్లోనే జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.   ఆ అధికారి విలాసాలకు  అలావాటుపడటంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని సమాచారం. 

 ఇక్కడే అధికం

నగర పరిధిలోని స్టాంటనపురం, సంతో్‌షనగర్‌, జొహరాపురం, ప్రకా్‌షనగర్‌, ఎనఆర్‌పేట,కొత్తపేట, నంద్యాల చెక్‌పోస్టు వీకర్‌సెక్షన కాలనీ, తుంగభద్రనదీ తీరం వెంట, మేయర్‌ వార్డులోని పలు కాలనీల్లో అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. సుమారు 2500 పైగా కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించినా వాటికి ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వకపోవడం కొసమెరుపు.  ఇదంతా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినప్పుడు  అక్రమ కనెక్షన్లపై  నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా  కింది స్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. అయితే కిందిస్థాయి సిబ్బందికి ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండటంతో వారు చెప్పిందే వేదంగా తయారైందనే విమర్శలు ఉన్నాయి.  ప్రతి నెల ఆ అధికారికి ముడుపులు వెళ్తుండటంతో ఆయన చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నగర మేయర్‌ బీవై. రామయ్య వార్డు 19లో గతంలో ఇంజనీరింగ్‌ అధికారులు పర్యటించి అక్రమ కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించి తొలగించారు. ఈ విషయంపై డీఈ, ఏఈ, ట్యాప్‌ ఇనస్పెక్టర్లకు వివరణ ఇవ్వాలని మెమో జారీ చేశారు. మేయర్‌ వార్డులోనే అక్రమ కుళాయి కనెక్షన్లు ఉంటే శివారు కాలనీల్లో ఇంకెన్ని ఉంటాయో లెక్కలు తేలాల్సిందే.  

 సంస్థ ఆదాయానికి గండి..

నగరంలోని పలు విభాగాల ద్వారా నగర పాలక సంస్థకు నీటి పన్ను నుంచి ప్రతి సంవత్సరం రూ.10 కోట్ల వరకు వసూలవుతుంది.  అయితే గత రెండు సంవత్సరాలుగా రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు మాత్రమే వసూలు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు రూ.6 కోట్ల వరకు బకాయిలు ఉంటున్నాయి.  కొంత మంది  లబ్ధిదారులు   సిబ్బందికి కొంత సొమ్ము ఇచ్చి  తప్పించుకుంటున్నారు. అట్లాగే కొందరు సిబ్బంది   ఏకంగా లబ్ధ్దిదారుల నుంచి నీటి పన్ను వసూలు చేసుకుని సొంతానికి వాడుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

 తనిఖీ చేసి  చర్యలు తీసుకుంటాం...శేషసాయి, ఇనచార్జి ఎస్‌ఈ

నగర పరిధిలో అక్రమ కుళాయి కనెక్షన్లు ఉంటే తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. అక్రమ కనెక్షన్టు ఉన్నట్లు తెలిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాము. అక్రమ కనెక్షన్లు తొలగించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమిస్తాం. 


Updated Date - 2022-10-04T05:25:14+05:30 IST