Abn logo
Aug 9 2020 @ 04:27AM

వాగు.. కనుమరుగు!

Kaakateeya

  • వక్కిలేరులో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
  • ఎర్రమట్టి, వాగులోని రాళ్లతో వ్యాపారం 
  • అక్రమార్కులకు ఓ అధికారి అండదండలు

శిరివెళ్ల, ఆగస్టు 8: వాగులు, వంకలను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఎర్రమట్టి, ఇసుక, గుండ్రాళ్లు.. ఏ ఒక్కటీ వదలకుండా సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారు. శిరివెళ్ల మండలం మహదేవపురం గ్రామ శివారు, నల్లమల అటవీ ప్రాంతంలోని వక్కిలేరు వాగులో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. రెవెన్యూ, గనుల, భూగర్భ శాఖల నుంచి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఉన్నతాధికారులు అక్రమ తవ్వకాలను నిలువరించడంతో పాటు మట్టి, ఇసుక దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మహదేవపురం రైతులు కోరుతున్నారు. 


వాగు పోరంబోకు భూములు స్వాహా

నల్లమల అటవీ ప్రాంతంలో వక్కిలేరుకు అనుసంధానంగా ఉన్న వాగు పోరంబోకు భూములను కొందరు ఆక్రమించుకుంటున్నారు. వాగు వెంట ఉన్న పట్టా భూముల్లో చదును చేస్తున్నామంటూ వాటిని కొల్లగొడుతున్నారు. నదీ ప్రవాహక ప్రాంతం కావడంతో నాణ్యమైన ఎర్రమట్టిని ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇటుకల బట్టీలకు, గుండ్రాళ్లు, ఇసుకను పెద్ద పెద్ద గోడౌన్లు, నివాసాల నిర్మాణాలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. రాయల్టీలు చెల్లించకుండా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. 


మూడు టిప్పర్లు.. ఆరు ట్రాక్టర్లుగా..

నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారి పక్కన మట్టిని తవ్వేస్తున్నారు. గాజులపల్లె, నంద్యాల, పొన్నాపురం, అయ్యలూరు తదితర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి తవ్వకాలు చేపడుతున్నారు. వీరికి ఓ అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. నిబంధనలు అతిక్రమించి 10 నుంచి 20 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ట్రాక్టర్‌ మట్టి రూ.700 నుంచి 1500 వరకు, టిప్పర్‌ రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. 


యథేచ్ఛగా తవ్వకాలు: చిన్నా, ఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

వక్కిలేరు వాగులో తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన ఓ అధికారి కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారులు వెంటనే విచారణ చేపట్టాలి. వాగు వెంట ఇష్టారాజ్యంగా సాగుతున్న తవ్వకాలను అరికట్టాలి. 


చర్యలు తీసుకుంటాం: నాగరాజు, తహసీల్దార్‌  

మట్టి అక్రమ తవ్వకాలను నిలువరించి సంబంధితులపై చర్యలు తీసుకుంటాం. మట్టి తవ్వకాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా నింబధనలు అతిక్రమిస్తే ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్లను సీజ్‌ చేస్తాం. 

Advertisement
Advertisement
Advertisement