పసిడిపురిలో పట్టా... ఫట్‌..!

ABN , First Publish Date - 2022-05-22T05:40:08+05:30 IST

ప్రొద్దుటూరులో భూ దందాలు పెరిగిపోయాయి. ఈ దందాల్లోనూ కొత్తపోకడలు పుట్టుకొచ్చాయి. ఖద్దరు నేతలు నేరుగా రంగంలోకి దిగకుండా.. మొదట తమ అనుయాయులు ముఖ్యంగా ఎస్సీలను ముందుకు తెస్తారు. వారిపేర ప్రైవేటు భూములను

పసిడిపురిలో పట్టా... ఫట్‌..!
కంచెవేసి ఆక్రమించిన బాలాజీ కాలనీ భూములు

పట్టా భూములనూ వదలని ఖద్దరు గద్దలు 

అనుయాయుల పేర అక్రమ రిజిస్ట్రేషన్లు 

రెవెన్యూ రికార్డుల్లోనూ అక్రమ నమోదులు

భారీగా చేతులు మారిన నోట్లకట్టలు 

ఆపై రంగంలోకి ఎస్సీలను దించిభూముల కబ్జా

దౌర్జన్యంగాకంచెలు నిర్మించి బెదిరింపులు

రూ.100 కోట్ల విలువైన 20 ఎకరాల పట్టా భూముల ఆక్రమణ

అధికార పార్టీ నేతల రంగప్రవేశంతో పట్టించుకోని అధికారులు


హైదరాబాదు, విశాఖ లాంటి నగరాల్లోప్రైవేటు భూములను కబ్జాచేసి కోట్ల రూపాయలసెటిల్‌మెంటు వ్యవహారాలు జరపడం సినిమాల్లో చూస్తుంటాం. పత్రికల్లో కథనాలుగా చదివాం. ఆ నయా దందా కల్చర్‌ ఇప్పుడు ప్రొద్దుటూరు లాంటి పట్టణాలకు పాకింది. అయితే నగరాల్లోలా గూండాలు రౌడీలు ఇక్కడ కనపడరు. ఫక్తు ఖద్దరు చొక్కాలు ధరించి అధికారాన్ని అడ్డంపెట్టుకొన్న రాజకీయ నేతలు ఇక్కడ పావులు కదుపుతారు. 


ప్రొద్దుటూరు (అర్బన్‌) మే 21: ప్రొద్దుటూరులో భూ దందాలు పెరిగిపోయాయి. ఈ దందాల్లోనూ కొత్తపోకడలు పుట్టుకొచ్చాయి. ఖద్దరు నేతలు నేరుగా రంగంలోకి దిగకుండా.. మొదట తమ అనుయాయులు ముఖ్యంగా ఎస్సీలను ముందుకు తెస్తారు. వారిపేర ప్రైవేటు భూములను అక్రమంగా సబ్‌రిజిష్టర్‌ కార్యాలయాల్లో రిజిష్టర్లు చేయిస్తారు. ఆ తరువాత వాటి ఆధారంగా తహసీల్దారు కార్యాలయాల్లో రెవెన్యూ రికార్డులైన 1బి, అడంగల్‌లో వారిపేర ఎకరాల భూములు అధికారికంగా ఆన్‌లైన్‌లో రికార్డులకు ఎక్కిస్తారు. ఈ వ్యవహారాలు చక్కదిద్దిన సబ్‌రిజిస్ర్టారు, తహసీల్దారు కార్యాలయాల్లో పెద్దఎత్తున నోట్లకట్టలు చేతులు మారుతాయి. ఆ తరువాత అక్రమంగా తయారుచేసిన రికార్డులు పట్టుకొని ఈ భూమి మాదంటూ ప్రైవేటు వ్యక్తుల భూముల్లో దిగుతారు. కంచెలు నిర్మించి భూమి స్వాఽధీన పరుచుకొంటారు. ఎవరైనా మా భూమిని ఆక్రమిస్తావేంటి అని అడిగితే దౌర్జన్యం చేస్తారు. గట్టిగా ప్రశ్నిస్తే ఎస్సీఎస్టీ కేసులు పెడతామంటారు. దీంతో ప్రైవేటు భూములున్న వారు లబోదిబోమంటున్నారు. ప్రొద్దుటూరు లాంటి వ్యాపార పట్టణాల్లో ఇలాంటి దౌర్జన్య పరిస్థితి రావడంపై ఆందోళన చెందుతున్నారు. తమ భూములను ఆక్రమించారని, అడిగితే దౌర్జన్యం చేస్తున్నారంటూ సాక్షాత్తు కలెక్టరు, ఎస్పీలకు మొరపెట్టుకున్నారు. జిల్లా అధికారులు ఆదేశించినా ఇక్కడి స్థానిక అధికారులు స్పందించటంలేదు.. దీనికి కారణం ఈ భూదందాలోఅధికార పార్టీ నేతలు ఉండడం.

ప్రొద్దుటూరు మండలం, లింగాపురం గ్రామం, తాళ్లమాపురం రెవెన్యూ పొలంలోని 152, 153, 154, 155, 156, 166, 168 సర్వేనెంబర్లలో నామా వెంగయ్య అనే ఆర్యవైశ్యుడు బాలాజీ కాలనీ అనే ఫరం స్థాపించి దాని తరుపున పలువురు రైతుల నుంచి దాదాపు 20 ఎకరాల భూములను 1984లో కొనుగోలు చేశారు. బాలాజీ కాలనీ పేర లేఅవుట్‌ వేసి 390 ప్లాట్లు ఏర్పాటు చేశారు. 1986లో నామా వెంగయ్య తన కుమారుడైన నామా సత్యనారాయణ పేర పవర్‌ ఆఫ్‌ పట్టా చేయించి 1987 నుంచి పట్టణంలో పలువురికి ప్లాట్లు విక్రయించారు. దాదాపు 250కి పైగా ప్లాట్లు అమ్మకాలు సాగాయి. కానీ పట్టణం అభివృద్ధి కాకపోవడం, అక్కడ భూములకు ధరలు లేకపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆ రోజుల్లో పెద్దగా సాగలేదు. దీంతో కాలక్రమంలో ఆ ప్లాట్లకున్న రాళ్లు పడిపోయి ఖాళీ భూములుగా మారాయి. బీడుగా ఉండటంతో ఇందులో కొందరు స్థానికులు వ్యవసాయం చేసుకునేవారు. 


ఎంవీ రమణారెడ్డి ఉన్నంత వరకు..

గతంలో ఈ ప్రాంతం అంతా మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కనుసన్నుల్లో ఉండేది. ఆయన నివాసం ఉండే ప్రాంతం కావడం చేత ఎవరూ కబ్జాలాంటి సాహసాలు చేసేవారు కారు. ఆయన ఇటీవల మరణించటంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల జోరు పెరిగింది. దానికితోడు లింగాపురం గ్రామంపట్టణ ముఖద్వారం కావడం, ఆ భూముల పక్కనే ఇంజనీరింగ్‌ కాలేజి ఉండటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కడప-మైదుకూరు రోడ్డుమార్గం హైవే పక్కనే ఈ భూములుండటంతో ఎకరా రూ.5 కోట్లు పలుకుతోంది. 20 ఎకరాలున్న ఈ భూములు దాదాపు రూ.100 కోట్ల విలువ కావడంతో అధికార పార్టీనేత కళ్లు పడ్డాయి. ఇందుకోసం భారీ ఎత్తున అధికార యంత్రాంగాన్ని డబ్బుతో లొంగదీసుకుని భూముల కబ్జాకు ప్రణాళికబద్ధంగా తెగబడ్డారు. అక్రమంగా రికార్డుల్లో ఎక్కించడానికి పార్లమెంటు స్థాయి నాయకునితో అధికారులకు సిపారసు చేశారని ప్రచారం సాగుతోంది. 


ఆర్యవైశ్యుడు ఏమీ చేసుకోలేడనే ధీమాతో..

బాలాజీ కాలనీలోని భూములు గతంలో ప్లాట్లు వేసినవికావడం, లేఅవుట్‌ వేసిన యజమాని ఆర్యవైశ్యుడు కావడంతో ఏమీ చేయలేరనే ధైర్యంతో ఖద్దరు నేతలు రంగంలోకి దిగారు. ప్లాట్ల యజమానులు ఎవ్వరూ వాటినిహద్దులు పాతుకొని తమ స్థలాలను సంరక్షించుకోకపోవడం కబ్జాదారులకు కలిసివచ్చింది. అందువల్ల వాటిని సాగు భూములుగా చూపించి అక్రమంగా తమ అనుయాయులైన ఎస్సీల పేర రిజిష్ట్టర్లు చేయించారు. రెవెన్యూ రికార్డుల్లో 1బి, అడంగల్‌లలో నమోదు చేసి ఆన్‌లైన్‌ ఎక్కించారు. పట్టాదారు పాసుపుస్తకాలు పుట్టించారు. స్థానికంగా ఉన్న ఎస్సీలను ముందు పెట్టి వారిచేత ఇటీవల అక్రమంగా కంచె నిర్మించారు. 


కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేసినా..

ఈ భూముల కబ్జాప్రొద్దుటూరు పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖద్దరు నేతలు తెగబడి చేస్తున్న ఈ భూదందాపై పట్టణ ప్రజలు, వ్యాపార వర్గాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటివి ఇక్కడ సాగనిస్తే రేపు పట్టణంలో ఎవ్వరి ఆస్తులకూ భద్రత ఉండదని వాపోతున్నారు. నెలరోజుల క్రితమే ఈ దందా వెలుగులోకి రావడంతో బాధితులైన ప్లాట్ల యజమానులు కలెక్టరును, ఎస్పీని ఏప్రిల్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. దీని  వెనక అధికారపార్టీ నేత హస్తం ఉండడంతో స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.


కోర్టును ఆశ్రయిస్తాం

- నామా వెంకటేశ్వర్లు, బాలాజీ కాలనీ భూముల యజమాని

బాలాజీ కాలనీ ఫరం పేర 1984లో మా తండ్రి నామా వెంగయ్య 20 ఎకరాల భూములను లింగాపురం గ్రామం తాళ్లమాపురం రెవెన్యూలోని పలువురు రైతుల నుంచి కొనుగోలు చేశారు. నాలుగు సెంట్ల విస్తీర్ణంగల 390 ప్లాట్లు వేసి1987 నుంచి పట్టణంలో పలువురికి విక్రయించాము. ఆ ప్లాట్లకు కాలక్రమంలో రాళ్లుపడిపోయి బీడు భూమిగా ఉండటంతో రాజకీయ పెద్దలుకొందరు ఎస్సీల పేర అక్రమంగా రిజష్టర్‌ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించారు. భూములను ఆక్రమించి ఇనుప కంచె నిర్మించారు. దీనిపై రెవెన్యూ, సబ్‌రిజస్ర్టార్‌ అధికారులపై కలెక్టరు, ఎస్పీలకు వందమంది ప్లాట్ల యజమానులతో ఫిర్యాదు చేశాం. వారి ఆదేశాలను ఇక్కడి అధికారులు పట్టించుకోలేదు. అక్రమ రిజిష్టర్లు చేసుకున్నవారికి, భూదందాలో అక్రమాలకు పాల్పడ్డ అధికారులకు లీగల్‌ నోటీసులు ఇచ్చాం. కానీ వారి నుంచి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించనున్నాం.


సరైన ఆధారాలతోనే ఆ భూములను ఆన్‌లైన్‌ చేశాం

- నజీర్‌ అహ్మద్‌, తహసీల్దారు, ప్రొద్దుటూరు

లింగాపురం గ్రామంవద్ద తాళ్లమాపురం రెవెన్యూ పొలంలోని పలు సర్వేనెంబర్లలో ఇప్పటివరకు 9.45 ఎకరాల భూములకు ఆధార పత్రాలు సమర్పించిన వారిపేర ఆన్‌లైన్‌ చేశాం. ఆ భూములపై సరైన ఆధార పత్రాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే విచారించి వాస్తవాలు ధ్రువీకరించి పాసుపుస్తకాలు రద్దు చేస్తారు. ఇందులో రికార్డుల ప్రకారమే పాసుపుస్తకాలు జారీ చేశాం తప్ప ఎటుంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేవు. 

Updated Date - 2022-05-22T05:40:08+05:30 IST