కట్టకటా..!

ABN , First Publish Date - 2022-05-28T05:52:42+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బడాబాబులు బుడమేరును కొల్లగొట్టేస్తున్నారు.

కట్టకటా..!
ఎక్స్‌కవేటర్‌తో అక్రమచేపల చెరువుల తవ్వకాలు

బుడమేరు కరకట్టల నడుమ అక్రమంగా చెరువుల తవ్వకాలు

ఓగిరాల ఆయకట్టులో చెలరేగిపోతున్న అక్రమార్కులు

అరిపిరాల సరిహద్దులో అరాచకాలు

బుడమేటి ప్రవాహానికి అడ్డుగా భారీ తవ్వకాలు 

చేష్టలుడిగిన డ్రెయినేజీ, రెవెన్యూ అధికారులు

రూ.109 కోట్ల ఆధునికీకరణ పనులు వృథాయేనా?

ఒకరిని చూసి మరికొందరు.. వారిని చూసి ఇంకొందరు.. ఇలా ఆక్రమణదారుల చెరలో బుడమేరు అలమటించిపోతోంది. ఏకంగా బుడమేరు ప్రవాహానికి అడ్డుగా చేపలు, రొయ్యల చెరువులను తవ్వేస్తూ, ఎత్తుగా కట్టలు నిర్మించేస్తున్నారు. భీమవరానికి చెందిన బడాబాబులు ఈ అక్రమాలకు తెరలేపగా, అధికార పార్టీ నేతల అండ.. అధికారుల అభయంతో వారం రోజులుగా తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 

గుడివాడ, మే 27 : పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బడాబాబులు బుడమేరును కొల్లగొట్టేస్తున్నారు. అధికారపక్షానికి చెందిన ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల మద్దతుతో, డ్రెయినేజీ, రెవెన్యూ శాఖల ఆశీస్సులతో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు చేపడుతున్నారు. బాపులపాడు మండలం ఓగిరాల రెవెన్యూ పరిధిలో బుడమేరు కుడి, ఎడమ గట్ల నడుమ 60 ఎకరాల విస్తీర్ణంలో వారం రోజులుగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. అదేమంటే గతంలో తవ్విన చేపల చెరువులకు ఎందుకు అనుమతులు ఇచ్చారని ఆక్రమణదారులు ప్రశ్నిస్తుండటం గమనార్హం.

బుడమేరు ప్రవాహానికి అడ్డుగా.. 

కృష్ణాడెల్టా ఆధునికీకరణలో భాగంగా బుడమేరును రూ.కోట్లు వెచ్చించి వెడల్పు చేశారు. దీనికోసం రైతుల నుంచి ప్రైవేట్‌ భూములు సేకరించారు. డెల్టా ఆధునికీకరణలో భాగంగా కేసరపల్లిలోని ఎనికేపాడు యూటీ నుంచి నందివాడ మండలం ఇలపర్రు శివారు ఎల్‌ఎన్‌ పురం వరకూ 50.6 కిలోమీటర్ల పరిధిలో ఈ పనులు జరిగాయి. రైతుల నష్టపరిహారంతో పాటు తవ్వకాలకు రూ.109 కోట్లు ఖర్చు చేశారు. కానీ, ఓగిరాల రెవెన్యూ పరిధిలోని నందివాడ మండలం అరిపిరాలకు సరిహద్దున ఉన్న బుడమేరు ఏటిలో కరకట్టల నడుమ తవ్వకాలు చేపడుతూ ప్రవాహానికి అడ్డుగా చేపల చెరువులు తవ్వుతున్నారు. ఎత్తుగా కట్టలు నిర్మిస్తున్నారు. పది జేసీబీలు, పలు టిప్పర్లు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. భీమవరానికి చెందిన బడాబాబులు హనుమన్‌ జంక్షన్‌కు చెందిన ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌ సహకారం తీసుకుని ఈ బరితెగింపునకు పాల్పడ్డారని సమాచారం. వీరికి ఇద్దరు ప్రజాప్రతినిధుల మద్దతు కూడా తోడవడంతో తవ్వకాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.

నిబంధనలకు తూట్లు

నిబంధనలకు తూట్లు పొడిచి, బరితెగించి బుడమేరు గర్భంలో చేపట్టిన తవ్వకాలను ఆపాల్సిన రెవెన్యూ, డ్రెయినేజీ అధికారులు ఆ పని తమది కాదంటే, తమది కాదని బుకాయిస్తున్నారు. బుడమేరులో రైతులకు సొంత భూములు ఉన్నప్పటికీ వరద రాకపోతే పంట పండించుకునే వెసులుబాటు ఉంది. ఏటికి అడ్డుగా కట్టలు వేసి, చేపల చెరువులు సాగు చేసుకునే అవకాశం లేదు. ఎవరికివారు ఇలా ఆక్రమించుకుని బుడమేరు గర్భాన్ని మింగేస్తే విజయవాడ నగరం సహా గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, ఉంగుటూరు, నందివాడ మండలాలకు చెందిన పొలాలు, గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోటీసులు ఇచ్చి మమ..

ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం నోటీసులు ఇచ్చి హడావుడి చేసే రెవెన్యూ, డ్రెయినేజీ శాఖల అధికారులు తర్వాత ఆక్రమణదారులతో లాలూచీ పడి బుడమేరుకు నష్టం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రెయినేజీ అధికారులు ఏడాది క్రితం ఏటిలోని ఆక్రమణలకు నోటీసులిచ్చారు. కానీ, చర్యలేమీ తీసుకోకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని బుడమేరు పరివాహక గ్రామాలవాసులు పేర్కొంటున్నారు. ఆక్రమణదారులు, అధికారులకు మధ్య ఒప్పందం కుదిరే ఇలా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ చేపలు, రొయ్యల చెరువులను తొలిదశలోనే అడ్డుకోకపోతే నందివాడ మండలంలోని పంట పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. కొల్లేరు తరహా ఆపరేషన్‌ చేపట్టి అక్రమ చేపల చెరువులు తీసివేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. రొయ్యలు, చేపల చెరువుల వ్యర్థాలు బుడమేరు నీటిలో కలిసి ప్రజలు, పశువులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. 

సిబ్బంది కొరత వల్ల అక్రమాలు ఆపలేకపోతున్నాం..

సిబ్బంది కొరతతో చర్యలు తీసుకోలేకపోతున్నాం. చేపల చెరువుల తవ్వకాన్ని ఆపమన్నా ఆపట్లేదు. ఇప్పటికే డీఈ, ఏఈలను పంపి చర్యలు తీసుకున్నాం. మత్స్యశాఖ అధికారులు అనుమతులు ఇచ్చారని అతిక్రమణదారులు చెబుతున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. గతంలో ఏర్పాటుచేసిన చెరువులను సైతం కొట్టేస్తాం.

- గోపాల్‌, డ్రెయినేజీ ఈఈ

Updated Date - 2022-05-28T05:52:42+05:30 IST