కట్టర కట్టు

ABN , First Publish Date - 2022-05-25T06:08:29+05:30 IST

ఏలూరుతోపాటు జిల్లాలోనూ అడుగడుగునా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్దే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు అధికారులు నోట్ల కట్టలతో నోళ్లు కుట్టేసుకుంటున్నారు.

కట్టర కట్టు

అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు

ఏలూరు, జంగారెడ్డిగూడెంలో నిబంధనలకు నీళ్లు

ముందుగా నోటీసులు.. ఆపై సెటిల్‌మెంట్లు 

లోపాయికారి ఒప్పందాల్లో మునిసిపల్‌ అధికారులు

తూతూ మంత్రంగా చర్యలు.. కోర్టుకు వెళ్లాలని సలహాలు

జంగారెడ్డిగూడెంలో నివాసానికి అనుమతి.. 

కడుతున్నది కమర్షియల్‌ భవనం 

కిరాయి మూకను కాపలా పెట్టి.. వేగవంతంగా పనులు

జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో పనులకు తాత్కాలిక విరామం 

ఏలూరుతోపాటు జిల్లాలోనూ అడుగడుగునా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్దే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు అధికారులు నోట్ల కట్టలతో నోళ్లు కుట్టేసుకుంటున్నారు. తూతూమంత్రంగా నోటీసులు జారీ చేయడం, ఆనక యజమానులను కోర్టు నుంచి స్టే తెచ్చుకోమని సలహాలు ఇస్తున్నారు.  


(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. ప్రతీ ప్రధాన రహదారిపైనా ఏదో ఒక నిర్మాణం జరుగుతూనే ఉంది. కొందరు అధికారులు ఎక్కడా డెమాలిష్‌ అన్న పదానికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్నారు. నిర్మాణం జరుగుతుందని తెలిసిన వెంటనే సదరు యజమానులకు కబురు చేయడం, వాటాలు మాట్లాడుకోవడం షరా మామూలైంది. దీంతో నిర్మాణం మొత్తం పూర్తయ్యే వరకు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఏదేని ఫిర్యాదులు వచ్చినా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. పైగా చర్యలు తీసుకునేలోపే కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెప్పించుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. కొందరైతే ఫలానా అడ్వకేట్‌ వద్దకు వెళితే త్వరగా పనవుతుందని దగ్గరుండి అవినీతికి మార్గం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ ఖజానాకు చేరాల్సిన సొమ్మును అధికారులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. కూల్చివేతలకు ఆదేశాలు రాకుండా కార్పొరేషన్‌ ఉన్నతాధికారులనూ ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నిబంధనల ప్రకారం నోటీసుల జారీ తర్వాత జరగాల్సిన ప్రక్రియ అమలయ్యేలోపే నిర్మాణాలపై కోర్టు ఆదేశాలు అందుతున్నాయి. ఫలితంగా కార్పొరేషన్‌కు చేరాల్సిన కోట్లాది రూపాయల సొమ్ము పక్కదారి పడుతున్నాయి.


కుప్పలు తెప్పలుగా..

కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న ఏలూరు నగరంలో ప్రతీ భవనానికి మధ్యన నిబంధనలకు అనుగుణంగా వెలుతురు, గాలి వచ్చే విధంగా నిర్మాణాలు చేయాలని 1955 గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ చట్టపరిధిలో పొందు పరిచారు. కానీ, ఆ నిబంధనలేవీ ఏలూరు కార్పొరేషన్లో అమలు కాకపోవడం గమనార్హం. ఇటీవలే టూ టౌన్‌ పోలీస్‌ పరిధిలోనూ ఓ హోటల్‌ ప్రారంభోత్సవం జరిగింది. సుమారు వంద చదరపు గజాల్లో నిర్మితమైన ఆ భవనంలో ఏకంగా నాలుగంతస్తులు వేశారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ ఓ హోటల్‌కు రెసిడెన్షియల్‌ అనుమతులు తీసుకుని, కమర్షియల్‌ భవనంగా నిర్మించి వ్యాపారం చేస్తున్నారు. పవర్‌ పేటలోని లో బ్రిడ్జి సమీపంలోనూ ఇదే తరహాలో సెట్‌ బ్యాక్స్‌ లేకుండా మూడంతస్తులకు పైగా నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ కళ్ల ముందే యథేచ్ఛగా నిర్మాణాలు జరిగిపోతున్నా కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఏం చేస్తోందని ప్రజలు నిలదీస్తున్నారు. ఎపుడూ లేని విధంగా చెత్త పన్నులు వేసి బలవంతంగా తమ వద్ద నుంచి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై ఎందుకు కన్నెర్ర చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 


కాసుల వర్షం

65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఏలూరు కార్పొరేషన్‌ పరిధికి సరిపడా అధికారగణాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కార్పొరేషన్‌ అధికారులు విఫలమవుతున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ప్రస్తుతం ఏలూరు నగర స్థాయికి సరిపడా అధికారులు లేరు. విలీన ఏడు గ్రామాలతో మరింత విస్తీర్ణాన్ని పెంచుకున్న నగరానికి ఒక్క టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మాత్రమే పనిచేస్తున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు పేట్రేగిపోతూ అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కవుతున్నారు. వాస్తవానికి టౌన్‌ ప్లానింగ్‌కు ఇద్దరు అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు ఉన్నారు. అందులో ఒక అధికారి మూడు నెలల క్రితం కాకినాడ నుంచి బదిలీపై ఏలూరు రాగా పలు ఆరోపణల కింద వచ్చిన కొద్ది రోజుల్లోనే సస్పెండయ్యారు. మరో మహిళా అధికారి నెలకు పైగా శిక్షణ పేరుతో అమరావతిలోనే ఉంటున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సంగతి సరేసరి. అధికారుల లేమి కారణంగా అటు అధికారులకు ఇటు నాయకులకు కాసుల వర్షం కురిపిస్తూ కల్పవృక్షంగా మారింది.


రౌడీ మూకను కాపలా పెట్టి..

జంగారెడ్డిగూడెం బస్టాండుకు సమీపంలో ఏడాదిగా కొనసాగుతున్న భవన నిర్మాణంపై ఇప్పటికి లెక్కకు మించి న ఫిర్యాదులు అందినా అధికారుల్లో చలనం లేదు. పైగా ఫిర్యాదుదారుల ఇంటికే సరైన అనుమతులు లేవంటూ ఏకంగా మునిసిపల్‌ అధికారులే వేధిస్తున్నారు. నియోజక వర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధికి కుడి భుజంగా పేరు పొందిన ఓ సామాజిక వర్గ చైర్మన్‌ పదవిని అనుభవిస్తున్న నాయకుడి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. కమిషన ర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో కొద్ది రోజులు నిర్మాణం ఆపిన ఆ నాయకుడు, అనంతరం సుమారు 20 మంది రౌడీలతో కాపలా పెట్టించాడని బాధితుడైన ఓ వైద్యుడు వివరిస్తున్నాడు. కమిషనర్‌కు పదే పదే ఫిర్యా దులు చేయడంతో ఇటీవలే స్థానికంగా ఓ బడా నాయకుడి నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. అయినా తాను కలవలేదని, వెంటనే ఆ అక్రమ నిర్మాణాన్ని ఆపేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. సెట్‌బ్యాక్స్‌కు తావు లేకుండా తమ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణం జరుగుతోందని, రోడ్డుకు పదడుగులు వదలాల్సి ఉన్నా వదలకుండా నిర్మిస్తున్నారని, నిర్మాణానికి వెనక భాగాన అదే తరహాలో సెట్‌బ్యాక్స్‌ లేకుండా మూడు వైపులా మూసివేసినట్లు నిర్మిస్తున్నారని ఆయన ఫిర్యాదులో వివరించారు. పైగా నివాస సంబంధిత నిర్మాణానికి అనుమతులు తీసుకుని, కమర్షియల్‌ భవనాన్ని నిర్మిస్తున్నా అధికారులు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఆక్షేపిస్తున్నారు. దీంతో తీవ్ర వేదనకు లోనైన ఆయన రెండు రోజుల క్రితం స్పందనలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ను కలిసి, నిర్మాణంపై ఫిర్యాదుచేశారు. తక్షణమే స్పందించిన కలెక్టర్‌ సంబంధిత కమిషనర్‌ శ్రావణ్‌ కుమార్‌కు తక్షణమే నిర్మాణం ఆపివేయాలని ఫోన్లోనే ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం తాత్కాలికంగా నిర్మాణాన్ని ఆపారే తప్ప, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఆ నిర్మాణంలో ఏదేని ప్రమాదం జరిగితే ప్రజలు బయటకు వెళ్లే మార్గం సరిగా లేదని, అగ్ని ప్రమాదం జరిగితే ఊహించని ప్రమాదం ఎదురవుతుందని అక్కడి పరిస్థితులను వైద్యుడు తన ఫిర్యాదులో సవివరంగా అందించినా అధికారులు లైట్‌ తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.




Updated Date - 2022-05-25T06:08:29+05:30 IST