అటవీ, దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలు!

ABN , First Publish Date - 2022-06-04T05:30:00+05:30 IST

కీసరగుట్ట ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డుకు అనుకొని ఆటవీ, దేవాదాయ శాఖ భూముల్లో ఇళ్ల అక్రమ నిర్మాణాలకు తెర తీశారు.

అటవీ, దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలు!
కీసర రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో అక్రమ నిర్మాణాలు


  • 60,100 గజాల వైశాల్యంలో గృహాలు
  • శరవేగంగా పనులు.. 
  • చోద్యం చూస్తున్న ఎండోమెంట్‌, ఫారెస్ట్‌ శాఖలు
  • ఇంటి నెంబర్లు, కరెంట్‌ కనెక్షన్‌కు లంచాలు
  • టీఆర్‌ఎస్‌ నాయకుల అండదండలతో పనులని ఆరోపణలు
  • కీసరగుట్ట సమీపంలో భూ బాగోతం

కీసరగుట్ట ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డుకు అనుకొని ఆటవీ, దేవాదాయ శాఖ భూముల్లో ఇళ్ల అక్రమ నిర్మాణాలకు తెర తీశారు. రాళ్లు కొట్టుకొని జీవించే పేదలు కొన్నేళ్లుగా ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం రాత్రికి రాత్రి గుడిసెలు కూల్చి, వాటి పరిధి ఖాళీ స్థలంలో ఉన్న భారీ వృక్షాలను సైతం నరికి అరవై, వంద గజాల చొప్పున ప్లాట్లుగా చేసుకొని ఇళ్లు కట్టుకుంటున్నారు. ఇలా 50 నుంచి 60 కుటుంబాల వారు నిర్మాణాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వారికి ఇళ్లు కట్టుకోవడానికి అనుమతి పేరుతో స్థానిక అధికార పార్టీ నాయకులు లక్షల్లో దండుకుంటున్నారని, పేదల పేరుతో విలువైన భూమిని పెద్దలు తన్నుకుపోయే కుట్ర జరుగుతోందని కీసర వాసులు ఆరోపిస్తున్నారు.

మేడ్చల్‌, జూన్‌4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కీసర మండల కేంద్రంలో భూ అక్రమాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ, ఇనాం, సీలింగ్‌ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వెంచర్లు చేశారు. ఈ వెంచర్లను ఒకటికి రెండుసార్లు అక్రమ రిజిస్ర్టేషన్లు చేయించి సామాన్యులను ముంచి రూ.కోట్లు గడిస్తున్నారు. ఇలా అడుగడుగునా అక్రమాలకు అడ్డాగా మారిన కీసరలో మరో అవినీతి బాగోతం బయటకొచ్చింది. అటవీ, దేవాదాయ శాఖల భూముల్లోని వృక్షాలను నరికి రాత్రికిరాత్రి గుడిసెలున్న చోట భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ తతంగమంతా అధికార పార్టీ నాయకుల కనుసైగల్లోనే కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలు

కీసర రామలింగేశ్వరస్వామి ఆలయ గుట్ట మెట్లకు సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం పేరుతో పర్యాటకాభివృద్ధి పనులు  జరుగుతున్నాయి.  2001లో ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కింద 170 ఎకరాలుంది. ఇతర ప్రాంతాల నుంచి వలసొచ్చిన పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. వీరంతా బండ రాళ్లు కొట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారివి 50 నుంచి 60 కుటుంబాలున్నాయి. ఇప్పుడు వీరు 60, 100గజాల స్థల్లాలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. పేదలకు భవన నిర్మాణానికి వారం పది రోజుల్లోనే రూ.లక్షల డబ్బు ఎలావచ్చిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలు మాత్రం శర వేగంగా జరుగుతున్నాయి. 45 వరకు ఇళ్లు నిర్మిస్తున్నారు. కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులే ప్రోత్సహిస్తూ పేదలతో భవన నిర్మాణాలు చేయిస్తున్నారని కీసర వాసులంటున్నారు. గుడికి వెళ్లే రోడ్డుకు ఆనుకొనే ఇళ్లు నిర్మిస్తుండడం గమనార్హం. ఈ ఇళ్ల ఎదుట ఖాళీ స్థలాల్లో ఉన్న వృక్షాలను రాత్రికిరాత్రే నరికేశారు. భవిష్యత్తులో ఈ ఖాళీ స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మించుకోవచ్చనే ఆలోచనతోనే వృక్షాలను నరికివేశారని అంటున్నారు. 15రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా ఎండోమెంట్‌, అటవీ శాఖల అధికారులు పట్టించుకోకపోవడం చూస్తోంటే ‘అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది.’ అనే స్థానికుల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌ నాయకులపై ఆరోపణలు చేశారు.

భారీగా చేతులు మారిన డబ్బు

కీసరగుట్ట సమీప అటవీ భూమిలో బండరాయి కొట్టుకునే కుటుంబాలు ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అయితే ప్రస్తుతం నాయకులు సూచించిన విధంగా 60గజాల్లో ఇల్లు కట్టుకునే వారు రూ. 6లక్షలు, 100 గజాల్లో కట్టుకునే వారు రూ.10లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటున్నామని చెబుతున్నారు. ఈ డబ్బు ఎవరికిచ్చారు? పర్మిషన్‌  ఎలా సాధించారు? ఇన్నేళ్లుగా గుడిసెల్లో ఉన్న వారికి హఠాత్తుగా ఇళ్లు కట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఇది వరకు తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు ఆందోళనలు చేసిన సందర్భాలు సైతం లేవు. అలాగే వారి గుడిసెలను తొలగించిన అధికారులూ లేరు.అయితే ఉన్నట్టుండి గుడిసెల స్థానంలో పక్కా భవనాలు వెలుస్తోండడమే పెద్దల హస్తం ఏమైనా ఉందా? అనే అనుమానాలకు తావిస్తోంది. అసలే పేదలు.. ఇళ్ల నిర్మాణాలకే అనుమతి లేదంటే వాటికి అనుబంధంగా రోడ్లు కూడా వేస్తోండడం చూస్తే దీని వెనుక పెద్దలున్నారనే దానికి బలం చేకూరుస్తోంది. ఇదిలా ఉంటే అటవీ శాఖ భూమిలో పోడు వ్యవసాయమే చేయనివ్వడం లేదు. అలాంటిది వృక్షాలు నరికేసి ఇళ్లెలా కట్టనిస్తున్నారో? అనేది పట్టణ వాసులకు అంతు బట్టడం లేదు. ఇదిలా ఉంటే కొత్త ఇళ్లకు ఇంటి నెంబరు కేటాయింపు, కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి ఒక్కో ఇంటికి రూ.రెండు లక్షల చొప్పున తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 15రోజుల్లోనే గుడిసెల స్థానంలో గృహాలు నిర్మించడంలో స్థానిక నాయకులు భారీ స్కెచ్చే వేసినట్టు తెలుస్తోంది. తద్వారా పేదల నుంచి లక్షల్లో డబ్బు పోగుచేసుకోవాలనే ప్లాన్‌తోనే ఇదంతా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇళ్ల స్కాంలో రూ.రెండు కోట్ల వరకు చేతులు మారాయని తెలుస్తోంది.

గుట్టల్లో ఎర్రమట్టి తవ్వకాలు

అటవీ, రామలింగేశ్వరస్వామి ఆలయ స్థలాల్లో బండరాళ్లు, వృక్షాలు, గుట్టలు ఉన్నాయి. గుట్టల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతెలా ఇచ్చారో తెలియదు. ఇదిలా ఉంటే గుట్టలు కరగదీసి ఎర్రమట్టిని తరలించారు. మైనింగ్‌ అధికారులకు కూడా తెలిసే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. ఇక్కడి ఎర్రమట్టి, క్రషర్లకు బండరాళ్లను తరలించారని చెబుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం సైతం పట్టించుకోవడం లేదు. తిలా పాపం.. తలా పిడికెడు అన్న చందంగా ఈ అక్రమాల్లో అన్ని శాఖల, రాజకీయ పార్టీ నాయకుల హస్తం ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది.

భూమి మాదో.. వారిదో తెలియదు

రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఏళ్లుగా బండరాళ్లు కొట్టుకొంటూ జీవించే కుటుంబాలు ఉంటున్నాయి. 15 రోజలుగా గుడిసెలు ఎత్తేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. వారు నిర్మాణాలు చేపడుతున్న స్థలం అటవీ శాఖ భూమా లేక దేవాదాయ శాఖదా? అనేది సర్వే చేసి నిర్ధారించాల్సి ఉంది. ఏ శాఖకు చెందినా అది ప్రభుత్వ ఆధీనంలోని భూమి అనేది సుస్పష్టం. మేము వెంటనే సర్వే చేయించి ఆ భూమి ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ది అయితే నిర్మాణాలు నిలిపివేయించి, కట్టిన వాటినీ కూల్చివేస్తాం. రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఆక్రమణ క్రిమినల్‌ నేరం కిందికే లెక్క. పేదలైనా, వేరే ఎవరైనా అటవీ స్థలాన్ని ఆక్రమించడం నేరమే. డిస్ర్టిక్ట్‌ సర్వేకు దరఖాస్తు చేశాం.

                                                          - లక్ష్మణ్‌, ఎఫ్‌ఆర్వో, కీసర డివిజన్‌

Updated Date - 2022-06-04T05:30:00+05:30 IST