అధికార పేకాట

ABN , First Publish Date - 2022-05-27T06:18:04+05:30 IST

అధికార పేకాట

అధికార పేకాట

మంతెనలో యథేచ్ఛగా పేకాట శిబిరాలు

రూ.కోట్ల పందేలతో నిత్యం పండుగ వాతావరణం

సర్పంచ్‌ వెంకటరమణే సూత్రధారి 

ఎమ్మెల్యే పార్థసారథికి ముఖ్య అనుచరుడు

సెబ్‌ దాడులు.. 23 మంది అరెస్టు 

సమాచారం తెలిసి రూ.25 లక్షలతో కీలక వ్యక్తులు పరార్‌


వందల సంఖ్యలో కార్లు.. పదుల సంఖ్యలో పేకాట రాయుళ్లు.. రూ.కోట్లలో డబ్బు కట్టలతో మంతెనలోని పేకాట శిబిరం నిత్యం సంక్రాంతి సీజన్‌ను తలపిస్తుంది. వైసీపీ నేత, స్థానిక సర్పంచ్‌ ఆధ్వర్యంలో రోజూ పండుగ వాతావరణంలో జరిగే శిబిరాలకు సెబ్‌ అధికారులు చెక్‌ పెట్టారు.


(విజయవాడ - ఆంధ్రజ్యోతి/కంకిపాడు) : పేకాట శిబిరాల నిర్వహణలో గుడివాడను తలదన్నేలా పెనమలూరూ మారుతోంది. ఇక్కడ అధికార పార్టీ నాయకులే శిబిరాల నిర్వాహకులు కావడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. పోలీసులు నెలవారీ మామూళ్లు అందుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం మంతెన పేకాట శిబిరంపై దాడులు చేశారు. 23 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. సుమారు రూ.3.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అసలు సూత్రధారి రూ.25 లక్షలకుపైగా సొమ్ముతో పరారైనట్లు సమాచారం.  

సర్పంచే నిర్వాహకుడు

మంతెనలో పేకాట శిబిరాన్ని నిర్వహించేది గ్రామ సర్పంచే. ఈయన స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సారథికి ముఖ్య అనుచరుడు. సర్పంచ్‌ వీరంకి వెంకటరమణ ఆధ్వర్యంలోనే ఈ శిబిరం జరుగుతోంది. నిత్యం రూ.కోట్లలో పందేలు నడుస్తున్నాయి. కేసినోను తలపించేలా పేకాట నిర్వహిస్తున్నారు.  పోలీసులకు మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల నుంచి కూడా పేకాటరాయుళ్లు ఇక్కడికి వస్తున్నారు. దీంతో మంతెనలో ఈ పేకాట శిబిరం నిర్వహించే ప్రాంతంలో వందల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు కనిపిస్తుంటాయి. సర్పంచ్‌ వెంకటరమణకు కమీషన్ల రూపంలోనే నెలకు రూ.కోటిపైనే ఆదాయం సమకూరుతుందని సమాచారం. పోలీసులు, ఇతరుల నుంచి సమస్య ఎదురైతే పరిష్కరించే బాధ్యతను ఓ ఉన్నతస్థాయి అధికారి బావమరిదికి అప్పజెప్పారు. ముందస్తు సమాచారం మేరకు 23 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసిన సెబ్‌ అధికారులు సూత్రధారి రమణను పట్టుకునే దిశగా చర్యలు తీసుకోలేదు. ఇందుకోసం వైసీపీ పెద్దలు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. 

Updated Date - 2022-05-27T06:18:04+05:30 IST