వివాహేతర సంబంధంపై పంచాయితీ పెద్దల వెరైటీ తీర్పు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..!

ABN , First Publish Date - 2020-06-29T17:19:01+05:30 IST

వివాహేతర సంబంధంపై పంచాయితీ తీర్పు చెప్పిన 10 మంది గ్రామ పెద్దలపై భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

వివాహేతర సంబంధంపై పంచాయితీ పెద్దల వెరైటీ తీర్పు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..!

పంచాయితీ తీర్పు చెప్పిన గ్రామ పెద్దలపై కేసు నమోదు


రేగొండ(భూపాలపల్లి) : వివాహేతర సంబంధంపై పంచాయితీ తీర్పు చెప్పిన 10 మంది గ్రామ పెద్దలపై భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్సై కృష్ణ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రేపాక గ్రామానికి చెందిన చేనపురి హరిబాబు, జ్యోతికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. హరిబాబు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె గ్రామ పెద్దలకు చెప్పింది. తనకు న్యాయం చేయాలని కోరగా గ్రామ పెద్దలు హరిబాబుకు చెందిన ఎకరం భూమిని ఆ మహిళకు రాసి ఇవ్వడంతోపాటు ఆమెతో అతడు కలిసి ఉండేలా తీర్పు చెప్పారు.


దీనిపై హరిబాబు భార్య జ్యోతి అభ్యంతరం వ్యక్తం చేస్తూ చట్ట విరుద్ధంగా తీర్పు చెప్పిన గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. దీంతో సర్పంచ్‌ పొనగంటి తిరుపతి, ఉప సర్పంచ్‌ గుడ్డ తిరుపతి, గ్రామ పెద్దలు పొనగంటి సమ్మయ్య, సుదమల్ల భిక్షపతి, గుర్రం సమ్మయ్య, తుంగండ సమ్మయ్య, పొనంగంటి ఓంకార్‌, పొనంగంటి జాని, పైడిపల్లి సాంబయ్య, గుర్రం బాబు, పొనంగంటి మల్లయ్యపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.  


Updated Date - 2020-06-29T17:19:01+05:30 IST