ఇలాగైతే.. కివిడ్‌ కట్టడి ఎలా!?

ABN , First Publish Date - 2021-07-24T06:03:49+05:30 IST

కర్ఫ్యూ నిబంధనల సడలింపుల తరువాత ప్రజలు పూర్తిగా కొవిడ్‌ నిబంధనలను విస్మ రించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని నిపుణులు, అధికారులు సూచిస్తున్నా..అస్సలు పట్టించుకోవడం లేదు.

ఇలాగైతే.. కివిడ్‌ కట్టడి ఎలా!?

కనిపించని భౌతిక దూరం

అధికారులు, వైద్యుల ఆందోళన

పొంచి ఉన్న మూడో వేవ్‌ ముప్పు

ఏదైనా ముందే మేల్కొనడం

మంచిదని సూచన

కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో

పెరుగుతున్న నిర్లక్ష్యం

జనాలతో కిక్కిరిసి కనిపిస్తున్న  మార్కెట్లు మాల్స్‌, పర్యాటక ప్రాంతాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కరోనా మూడో వేవ్‌కుఅవకాశం కల్పించేలా ప్రస్తుతం ప్రజలు వ్యవహరిస్తున్నారని వైద్యులు, అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి పెరిగిపోయిందని పేర్కొంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని, ఇప్పటికీ కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. 


కొవిడ్‌ నిబంధనలు ఎక్కడ..?

కర్ఫ్యూ నిబంధనల సడలింపుల తరువాత ప్రజలు పూర్తిగా కొవిడ్‌ నిబంధనలను విస్మ రించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని నిపుణులు, అధికారులు సూచిస్తున్నా..అస్సలు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాన్నారు. దీంతో మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, పర్యాటక ప్రాంతాలు కిక్కిరిసి కనిపిస్తు న్నాయి. భౌతిక దూరం అనేమాట ఈ మూడు చోట్ల ఎక్కడా కనిపించడం లేదు.  నగర పరిధిలోని అనేక షాపింగ్‌ మాల్స్‌ ఆదివారాల్లో ఖాళీ ఉండడం లేదు. ఇక, పర్యాటక ప్రాంతాల సంగతి సరే సరి. ఆదివారం వస్తే ఆర్కే బీచ్‌కు ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తున్నారు. ఇక్కడ భౌతిక దూరం అన్నది కనిపించడం లేదు. కనీసం మాస్క్‌ అయినా  వాడుతున్నారా?...అంటే దాన్నీ చాలామంది పక్కన పెట్టేస్తున్నారు. ఒకపక్క అధికారులు వద్దని హెచ్చరిస్తున్నా..ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా బీచ్‌, ఇతర పర్యాటక ప్రాంతాల్లో తిప్పుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. దీనివల్ల కాస్త నెమ్మదించిన వైరస్‌ మళ్లీ విజృంభించేందుకు అవకాశముందని, అనుకున్న దానికంటే ముందుగానే మూడో వేవ్‌ జిల్లాలో వచ్చే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వద్దని కాదు..జాగ్రత్త ముఖ్యం.. 

అత్యవసరమైతే ప్రయాణాలు చేయొద్దని, బయటకు వెళ్లొద్దని తాము చెప్పడం లేదని, అయితే, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, నిపుణులు అంటున్నారు. వీలైనంత వరకు భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని పేర్కొంటున్నారు. జన సమూహ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు డబుల్‌ మాస్క్‌ ధరించాలని, వీలైనంత వేగంగా అక్కడి నుంచి వెళ్లి పోయేందుకు యత్నించాలని సూచిస్తున్నారు. అలాగే, ప్రయాణాలు సాగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, హ్యాండ్‌ శానిటైజర్‌ను తరచుగా వినియోగించాలని పేర్కొంటున్నారు. 


ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడితేనే ఫలితం

- డాక్టర్‌ పీవీ సుధాకర్‌, ఉత్తరాంధ్ర జిల్లాల కొవిడ్‌-19 ప్రత్యేక అధికారి

కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రజల ఆలోచనలో మార్పుతోనే వైరస్‌ కట్టడి సాధ్యం. ప్రస్తుతం...అవసరం లేకుండానే ఎంతోమంది బయట తిరుగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆలోచించండి..మూడో వేవ్‌ హెచ్చరికలు వున్న నేపథ్యంలో మరికొన్ని నెలలపాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరిగిపోయిన తరువాత బాధపడడం కంటే...ముందుగానే మేల్కొనడంతో మంచి ఫలితాలు సాధ్యం. 

Updated Date - 2021-07-24T06:03:49+05:30 IST