6జీ అభివృద్ధిలో ఐఐటీహెచ్‌ ముందడుగు

ABN , First Publish Date - 2022-05-03T07:19:24+05:30 IST

దేశంలో టెలికం విప్లవానికి కారణమైంది 4జీ టెక్నాలజీ. దాన్ని మించిన వేగం 5జీది. ఆ టెక్నాలజీ ఇంకా మనదేశంలోకి అందుబాటులోకి రాకుండానే.. 6జీ టెక్నాలజీకి సంబంధించి ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రజ్ఞులు కీలక ముందడుగు వేశారు. ఎక్స్‌ట్రీమ్‌ మాసివ్‌ మిమో టెక్నాలజీ ద్వారా ప్రజలకు సూపర్‌ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలందించే దిశలో గొప్ప విజయం సాధించారు. ....

6జీ అభివృద్ధిలో ఐఐటీహెచ్‌ ముందడుగు

హైదరాబాద్‌, మే 2: దేశంలో టెలికం విప్లవానికి కారణమైంది 4జీ టెక్నాలజీ. దాన్ని మించిన వేగం 5జీది. ఆ టెక్నాలజీ ఇంకా మనదేశంలోకి అందుబాటులోకి రాకుండానే.. 6జీ టెక్నాలజీకి సంబంధించి ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రజ్ఞులు కీలక ముందడుగు వేశారు. ఎక్స్‌ట్రీమ్‌ మాసివ్‌ మిమో టెక్నాలజీ ద్వారా ప్రజలకు సూపర్‌ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలందించే దిశలో గొప్ప విజయం సాధించారు. ఈ సాంకేతికత సాయంతో 5జీ నెట్‌వర్క్‌ కంటే మూడింతలు అధిక వేగాన్ని అందుకోవచ్చని సోమవారం వారు ప్రకటించారు.ఇంటర్నెట్‌ సాంకేతిక పరిజ్ఞానంలో అద్భుతాలు చేస్తున్న 5జీ సేవలకు మాసివ్‌ మిమో (మల్టిపుల్‌ ఇన్‌పుట్‌ - మల్టిపుల్‌ అవుట్‌పుట్‌) టెక్నాలజీ వెన్నెముక వంటిది.ఈ టెక్నాలజీని మరింత విస్తరించి, 6జీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ముందడుగు వేసిన ఐఐటీ-హెచ్‌.. ఎక్స్‌ట్రీమ్‌ మాసివ్‌ మిమో టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సూపర్‌ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందరికీ అందనున్నాయి. దీని ద్వారా హైక్వాలిటీ ఆడియో, వీడియో కాల్స్‌ చెయ్యవచ్చు. హైడెఫినిషన్‌ వీడియోలను బఫరింగ్‌ లేకుండా చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాలకు కూడా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ వైర్‌లె స్‌ ఇంటర్నెట్‌ సేవలు అందించవచ్చు. కాగా, 6జీ టెక్నాలజీకి సంబంధించిన పరిశోధనల్లో ఇది ఆరంభం మాత్రమేనని ఐఐటీ-హెచ్‌ పరిశోధనా విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ కిరణ్‌ కూచి, ప్రాజెక్టు లీడ్‌ పరిశోధకులు ప్రొఫెసర్‌ సాయి ధీరజ్‌ అన్నారు. ‘మా క్యాంప్‌సలో 192 యాంటెనాలు ఉపయోగించి ఎక్స్‌ట్రీమ్‌ మాసివ్‌ మిమో బేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశాం.


ఈ బేస్‌స్టేషన్‌ ద్వారా ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న 5జీ నెట్‌వర్‌ ్క కంటే మూడురెట్లు అధిక సామర్థ్యాన్ని అందుకోవచ్చని నిరూపించాం. 6జీ టెక్నాలజీ దిశగా పదేళ్లుగా చేస్తున్న కృషిలో భాగంగా మరెన్నో అవిష్కరణలు జరగనున్నాయి. ఇది ఒక ఆరంభం మాత్రమే’ అని వారు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 192 యాంటెనాలు, 48 రేడియోఫ్రీక్వెన్సీ చైన్‌లు ఉపయోగించి, ఒక స్పెక్ట్రమ్‌ ద్వారా 24 నుంచి 36 మంది వినియోగదారులకు సేవలు అందించామని తెలిపారు. 5జీ మాసివ్‌ మిమో టెక్నాలజీతో ఒక స్పెక్ట్రమ్‌ నుంచి 12 మందికి మాత్రమే సేవలు అందించే వీలుందని వివరించారు. ఎక్స్‌ట్రీమ్‌ మాసివ్‌ మిమో టెక్నాలజీ వల్ల ఎక్కువ మందికి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందించే వీలు కలుగుతుందని ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌  బి.ఎ్‌స.మూర్తి అన్నారు. తమ పరిశోధనకు కేంద్రం  సహకారం అందిస్తున్నాయని వెల్లడించారు. 

Read more