పరిశోధనల్లో ఐఐటీ-హెచ్‌ అగ్రగామి

ABN , First Publish Date - 2022-07-05T10:39:35+05:30 IST

పరిశోధన రంగంలో ఐఐటీ హైదరాబాద్‌(ఐఐటీ-హెచ్‌) దేశంలోనే అగ్రగామిగా ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేందర్‌సింగ్‌ కొనియాడారు.

పరిశోధనల్లో ఐఐటీ-హెచ్‌ అగ్రగామి

  • మానవ రహిత వ్యవస్థల అభివృద్ధి అద్భుతం
  • కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ ప్రశంసలు
  • టీహాన్‌ అటానమస్‌ టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి


కంది, జూలై 4: పరిశోధన రంగంలో ఐఐటీ హైదరాబాద్‌(ఐఐటీ-హెచ్‌) దేశంలోనే అగ్రగామిగా ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేందర్‌సింగ్‌ కొనియాడారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ సంస్థలో టీహాన్‌ అటానమస్‌ నావిగేషన్‌ టెస్ట్‌ బెడ్‌ను సోమవారం మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఐఐటీ-హెచ్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తిలతో కలసి మంత్రి ప్రాంరంభించారు. అనంతరం టీహాన్‌లో ఏర్పాటు చేసిన మానవరహిత వాహనాల నమూనాలను పరిశీలించారు. ఐఐటీ-హెచ్‌ పరిశోధకులు వివిధ రూపాల్లో తయారు చేసిన డ్రోన్లు దేశానికి ఉపయోగపడేలా ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. ‘‘స్వయం ప్రతిపత్తితో నడిచే వాహనాల భవిష్యత్‌ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. నావిగేషన్‌ సాంకేతికతలో మన దేశం అగ్రగామిగా నిలుస్తుంది. టీహాన్‌ ఒక శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన సంస్థగా గుర్తింపు పొందింది. రాబోయే రోజుల్లో సరికొత్త ఆవిష్కరణలకు భారత్‌ ఒక వేదికగా మారుతుంది. మానవ రహిత వాహనాల అభివృద్ధితో ఐఐటీ-హెచ్‌ మరో మైలురాయిని దాటింది’’ అని మంత్రి ఆకాంక్షించారు. టీహాన్‌ (టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ అటానమస్‌ నావిగేషన్‌) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ టి.రాజ్యలక్ష్మితో పాటు పరిశోధన బృందం సభ్యులు సంస్థ ప్రాంగణంలో 120 కిలోల బరువు మోయగల 75 కిలోల మానవరహిత డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా ఎగురవేశారు. ఈ డ్రోన్‌ ఇద్దరిని గాల్లో తీసుకెళ్లేలా తయారుచేసి త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తామని పరిశోధకులు తెలిపారు.. అనంతరం మానవరహిత వాహనంలో కేంద్రమంత్రి కొద్ది దూరం ప్రయాణించారు.


ఐఐటీ-హెచ్‌లో డ్రోన్ల సందడి 

ఐఐటీ హైదరాబాద్‌లో సోమవారం వినూత్న డ్రోన్లు సందడి చేశాయి. టిహాన్‌ (టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ అటానమస్‌ నావిగేషన్‌) ప్రాజెక్ట్‌లో భాగంగా ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, డిజైన్‌, లిబర్‌ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో మానవరహిత ఏరియల్‌, గ్రౌండ్‌ వెహికిల్స్‌ నమూనాలను ప్రదర్శించారు. టిహన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ఐఐటీ-హెచ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌ టి.రాజ్యలక్ష్మి, పరిశోధన బృందం సభ్యులు ఈ డ్రోన్లను రూపొందించారు. ఇవి త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. 


మానవరహిత యుద్ధ వాహనాలు

దేశ సైనికులకు ఉపయోగపడేలా రూపొందించిన మానవరహిత యుద్ధ ట్యాంకర్లు ప్రయోగ దశలో ఉన్నాయి. సెన్సార్‌, జీపీఎ్‌సలతో నడిచే ఈ యుద్ధ యంత్రాలు లక్ష్యాన్ని తప్పకుండా.. సూచించిన చోటికి ఏ పరిస్థితులోనైనా వెళ్లగలవని పరిశోధకులు పేర్కొన్నారు.


అగ్నిమాపక డ్రోన్‌

హస్కి-800 పేరుతో రూపొందించిన ఈ డ్రోన్‌ మంటలను క్షణాల్లో అదుపు చేస్తుంది. ఇందులోని ఫైర్‌సేఫ్టీ ప్రొటెక్షన్‌ ప్రోగ్రామింగ్‌తో గుట్టలు, కొండ ప్రాంతాల్లోకి సైతం సులువుగా వెళ్లి మంటలను ఆర్పగలుగుతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. 


ప్యాసింజర్‌ బేస్డ్‌ డ్రోన్‌ 

ఒకరు లేదా ఇద్దరు గగనవిహారం చేసేలా రూపొందించిన ప్యాసింజర్‌ బేస్డ్‌ డ్రోన్‌.. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌తో నడుస్తుంది. సెన్సార్‌, జీపీఎ్‌సలతో అనుసంధానమై దాదాపు 30 నిమిషాలు గాల్లో ఎగిరేలా ఐఐటీ-హెచ్‌ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 


ఫ్లాఫింగ్‌ వింగ్స్‌ డ్రోన్‌

పక్షిలాగా రెక్కలు కొడుతూ ఎగిరే డ్రోన్‌ ఆకాశంలో ఎగురుతూ కావాల్సిన వారికి సంకే తాలను అందజే స్తుంది. రెక్కలు కొట్టుకుంటుండగానే ఈ డ్రోన్‌ చార్జింగ్‌ అవుతుంది. పక్షిలాగే కనిపించే ఈ ఫ్లాఫింగ్‌ వింగ్స్‌ డ్రోన్‌ ప్రస్తుతానికి ప్రయోగదశలో ఉంది. 

Updated Date - 2022-07-05T10:39:35+05:30 IST