Campus ప్లేస్‌మెంట్లలో ఐఐటీ మద్రాస్‌ రికార్డు .. ఒక విద్యార్థికి రూ.1.98 కోట్ల ప్యాకేజీ

ABN , First Publish Date - 2022-08-09T17:03:48+05:30 IST

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాంపస్‌(Campus) ప్లేస్‌మెంట్లలో ఐఐటీ మద్రాస్‌(IIT Madras) రికార్డు సృష్టించింది. రెండు దశల్లో నిర్వహించిన ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో 380 కంపెనీలు పాల్గొని 1,199 ఉద్యోగాలను విద్యార్థులకు ఆఫర్‌ చేశాయి

Campus ప్లేస్‌మెంట్లలో ఐఐటీ మద్రాస్‌ రికార్డు .. ఒక విద్యార్థికి రూ.1.98 కోట్ల ప్యాకేజీ

ఏడాది జీతం రూ.1.98 కోట్లు!

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఐఐటీ మద్రాస్‌ రికార్డు 

డ్రైవ్‌లో రిజిస్టర్‌ చేసుకున్న 80% మందికి ఉద్యోగాలు 

ఎంబీఏ విభాగంలో నూరు శాతం ప్లేస్‌మెంట్స్‌ ఘనత 

విద్యార్థులు అందుకున్న సగటు వేతనం 21.48 లక్షలు 


చెన్నై, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాంపస్‌(Campus) ప్లేస్‌మెంట్లలో ఐఐటీ మద్రాస్‌(IIT Madras) రికార్డు సృష్టించింది. రెండు దశల్లో నిర్వహించిన ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో 380 కంపెనీలు పాల్గొని 1,199 ఉద్యోగాలను విద్యార్థులకు ఆఫర్‌ చేశాయి. దీనికితోడు మరో 231 మందికి ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు అందడంతో ఈసారి మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,430కి చేరింది. 2018-19 విద్యా సంవత్సరంలో నమోదైన 1,151 జాబ్‌ ఆఫర్ల(Job offers)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ డ్రైవ్‌లో విద్యార్థులు అందుకున్న సగటు వేతనం రూ.21.48 లక్షలు కాగా, ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.1.98 కోట్ల (2,50,000 డాలర్లు) ప్యాకేజీ లభించిందని ఐఐటీ మద్రాస్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈసారి 14 అంతర్జాతీయ కంపెనీల నుంచి 45 మందికి విదేశాల్లో ఉద్యోగాలు దక్కడం కూడా ఒక రికార్డే. ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ రెండు దశలలో కలిపి 199 మంది విద్యార్థులకు 131 స్టార్‌అప్‌ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చాయి. ఎంబీఏ విద్యార్థులు మొత్తం 61 మందికీ ఉద్యోగాలు లభించడంతో మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐటీ మద్రాస్‌ నూరుశాతం ప్లేస్‌మెంట్‌ సాధించింది. ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో రిజిస్టర్‌ చేసుకున్న 80శాతం మంది విద్యార్థులకు ఉన్నతోద్యోగాలు లభించినట్లు ప్లేస్‌మెంట్స్‌ అడ్వయిజర్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌ శంకర్‌రామ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-08-09T17:03:48+05:30 IST