Abn logo
Sep 10 2021 @ 02:33AM

ఐఐటీ మద్రాస్‌ అత్యుత్తమం

 • మూడేళ్లుగా అగ్రస్థానంలోనే.. తర్వాతి స్థానాల్లో ఐఐఎస్సీ, ఐఐటీ ముంబై
 • ఐఐటీ హైదరాబాద్‌కు 16వ ర్యాంకు
 • 17వ స్థానంలో హెచ్‌సీయూ.. ఓయూకి 62
 • వరంగల్‌ ఎన్‌ఐటీకి 59వ ర్యాంకు
 • ఇంజనీరింగ్‌లో ఐఐటీ-హెచ్‌కి 8వ స్థానం
 • ట్రిపుల్‌ ఐటీకి 54, జేఎన్‌టీయూకి 62
 • న్యాయ విద్యలో నల్సార్‌కు మూడో స్థానం
 • మేనేజ్‌మెంట్‌లో ప్రైవేటు సంస్థలకు చోటు
 • ఇక్ఫాయ్‌, ఐఎంటీలకు జాబితాలో ర్యాంకులు
 • ఫార్మసీలో నైపర్‌, కేయూలకు 6, 48 స్థానాలు
 • అనురాగ్‌, విష్ణు ఇన్‌స్టిట్యూట్‌లకూ ర్యాంకులు
 • కాలేజీల జాబితాలో సెయింట్‌ ఫ్రాన్సిస్‌
 • విద్యాసంస్థలకు కేంద్ర విద్యాశాఖ ర్యాంకులు
 • ర్యాంకుల్లో కానరాని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు
 • ప్రక్రియలో పాల్గొనడానికే వర్సిటీల నిరాసక్తత

న్యూఢిల్లీ / హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్‌ అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఈ సంస్థ టాప్‌ ర్యాంకును దక్కించుకోవడం విశేషం. ఐఐఎ్‌ససీ బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ ముంబై మూడో స్థానంలో నిలిచాయి. పరిశోధనల కేటగిరీలో బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) దేశంలో అత్యుత్తమ సంస్థగా నిలిచింది. ఇంజనీరింగ్‌ విభాగంలో చెన్నై, ఢిల్లీ, ముంబైలోని ఐఐటీలు వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. యూనివర్సిటీల కేటగిరీలో ఐఐఎస్సీ, ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్సిటీ, వారాణసిలోని బెనారస్‌ హిందూ వర్సిటీ వరుసగా టాప్‌ 3 స్థానాల్లో నిలిచాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలు మంచి ర్యాంకులు సాధించడంలో విఫలమయ్యాయి. చాలా సంస్థలు ర్యాంకింగ్‌ ప్రక్రియలో పాల్గొనడానికే ముందుకు రాకపోవడం గమనార్హం. పాల్గొన్న సంస్థలు కూడా జాబితాలో వెనుకబడ్డాయి. అనేక ప్రయివేటు కాలేజీలు ఈ విషయంలో మెరుగ్గా పనిచేయడం విశేషం. దేశంలో ఉత్తమ ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలకు నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) పేరుతో కేంద్రం ర్యాంకులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 2021కి సంబంధించిన ర్యాంకులను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం వెల్లడించారు. విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ విధానం తోడ్పడుతుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. బోధనలో నాణ్యత, పరిశోధనలు, అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాల ఆధారంగా కేంద్రం ఈ ర్యాంకులను కేటాయిస్తుంది.రాష్ట్రంలో టాప్‌ హైదరాబాద్‌ ఐఐటీ

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌లోని ఐఐటీ రాష్ట్రంలో మేటి సంస్థగా నిలిచింది. ఇంజనీరింగ్‌ విభాగంలో దేశంలోని 10 అత్యుత్తమ విద్యాసంస్థల్లో 8వ స్థానాన్ని దక్కించుకుంది. ఐఐటీ-హెచ్‌ ఆరేళ్లుగా టాప్‌ 10 ర్యాంకుల్లో నిలవడం విశేషం. మొత్తంగా చూసినా దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల్లో ఐఐటీ-హెచ్‌ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. గతేడాది 17వ స్థానంలో నిలవగా, ఈసారి 16వ ర్యాంకును సాధించిందని సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు. ప్రపంచ ర్యాంకింగ్‌లలో కూడా ఐఐటీ-హెచ్‌ టాప్‌ 600 విద్యాసంస్థల్లో ఒకటిగా నిలిచిందని ఆయన వివరించారు. ఓవరాల్‌ ర్యాంకుల్లో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ) 17వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) 59వ ర్యాంకును, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) 62వ ర్యాంకును దక్కించుకున్నాయి. యూనివర్సిటీల కేటగిరీలో హెచ్‌సీయూ 9, ఓయూ 32, హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ ఐటీ 83 ర్యాంకులను దక్కించుకున్నాయి. నల్సార్‌కు మూడో ర్యాంకు

న్యాయ విద్యాసంస్థల విభాగంలో హైదరాబాద్‌లోని నల్సార్‌కు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు లభించింది. ఇదే విభాగంలో ఇక్ఫాయ్‌ సంస్థకు 29వ ర్యాంకు వచ్చింది. ఇంజనీరింగ్‌ విభాగంలో వరంగల్‌ నిట్‌ 23, ఐఐఐటీ హైదరాబాద్‌ 54, జేఎన్‌టీయూ - హైదరాబాద్‌ 62 స్థానాల్లో నిలిచాయి. మేనేజ్‌మెంట్‌ విభాగంలో హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు 27వ ర్యాంకు, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీకి 63వ స్థానం లభించాయి. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నైపర్‌కు 6వ ర్యాంకు, కాకతీయ యూనివర్సిటీకి 48, అనురాగ్‌ యూనివర్సిటీకి 61, విష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీకి 72 ర్యాంకులు దక్కాయి. కాలేజీల విభాగంలో హైదరాబాద్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కాలేజీ 85వ స్థానం లభించింది. డెంటల్‌ విభాగంలో సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సె్‌సకు 30వ ర్యాంకు దక్కింది. పరిశోధన సంస్థల జాబితాలో ఐఐటీ హైదరాబాద్‌ 15, హెచ్‌సీయూ 25 స్థానాల్లో నిలిచాయి.