భూతవైద్యం చేశానంటున్న ఐఐటీ కాన్పూరు ప్రొఫెసర్

ABN , First Publish Date - 2022-01-16T00:02:05+05:30 IST

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-కాన్పూరు ప్రొఫెసర్

భూతవైద్యం చేశానంటున్న ఐఐటీ కాన్పూరు ప్రొఫెసర్

కాన్పూరు : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-కాన్పూరు  ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహరా వివాదంలో చిక్కుకున్నారు. తాను భూతవైద్యం చేసి, తన స్నేహితుని అపార్ట్‌మెంట్ నుంచి దయ్యాన్ని పారదోలానని ఆయన చెప్పినట్లు కనిపిస్తున్న వీడియో బయట పడటంతో దుమారం రేగింది. తాను పవిత్రమైన మంత్రాలను ఉచ్చరించి, తన మిత్రుని తల్లిదండ్రులకు పట్టిన దయ్యాన్ని వదిలించానని కూడా ఆయన ఈ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది. 


ఐదు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో బెహరా తాను 1993లో చెన్నై వెళ్ళి, తన మిత్రునికి సహాయపడిన విషయాన్ని వివరించారు. తన మిత్రుని కుటుంబ సభ్యులు దయ్యాలబారిన పడ్డారని, మంత్రాలను ఉచ్చరించడం ద్వారా వారికి సాంత్వన కలిగించానని చెప్పారు. తాను భగవద్గీతను పాటిస్తానని చెప్పారు. ‘హరే రామ హరే కృష్ణ’ మంత్రాన్ని జపిస్తానని తెలిపారు. ఈ మంత్రాల మహిమను తన మిత్రునికి తెలియజేసి, వారి కుటుంబానికి సహాయపడ్డానని తెలిపారు. 


ఈ వీడియో క్లిప్ గురించి లక్ష్మీధర్‌ బెహరాను జాతీయ మీడియా ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ, తాను చేసిన పనినే చెప్పానన్నారు. దయ్యాలు నిజంగానే ఉన్నాయన్నారు. చాలా విషయాలను ఆధునిక సైన్స్ వివరించజాలదని తెలిపారు. 


ఇదిలావుండగా, ఈ వీడియోను ఏడు నెలల క్రితం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ దుమారం రేగడంతో దీని సెట్టింగ్స్‌ను పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కు మార్చేశారు. 


లక్ష్మీధర్ బెహరా ఇటీవలే ఐఐటీ-మండీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఐఐటీ కాన్పూరు వెబ్‌సైట్‌నుబట్టి లక్ష్మీధర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్. ఐఐటీ-ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. జర్మన్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి పోస్ట్ డాక్టరేట్ చేశారు. ఆయన రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేక నైపుణ్యంగలవారు. 


2020లో అష్ట దిగ్బంధనం అమలైన కాలంలో క్యాంపస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దాదాపు 800 మంది వీథి బాలలకు ప్రతి రోజూ భోజనం పెట్టారు. ఆయన దాతృత్వాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. 


Updated Date - 2022-01-16T00:02:05+05:30 IST