నాజిల్‌ జెల్‌తో కరోనా కట్టడి

ABN , First Publish Date - 2020-04-10T06:03:00+05:30 IST

కరోనా వైర్‌సపై పోరులో ఐఐటి బాంబే మరో ముందడుగు వేసింది. వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశించకుండా ముక్కు వద్దే నిర్వీర్యం చేసేలా..

నాజిల్‌ జెల్‌తో కరోనా కట్టడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: కరోనా వైర్‌సపై పోరులో ఐఐటి బాంబే మరో ముందడుగు వేసింది. వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశించకుండా ముక్కు వద్దే నిర్వీర్యం చేసేలా సరికొత్త జిగురు (నాజిల్‌ జెల్‌) వంటి ఔషధాన్ని ఐఐటి బాంబేకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోసైన్సెస్‌ అండ్‌ బయో ఇంజనీరింగ్‌ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఈ జిగురులో డిటర్జెంట్‌ తరహాలో వైరస్‌లను నాశనం చేసే జీవకణాలు (బయలాజికల్‌ మాలిక్యూల్స్‌) ఉంటాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో ఈ జిగురు పదార్థం కీలకంగా మారే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తికి ముక్కు ప్రవేశ ద్వారం వంటిది. ఈ భాగం వద్ద వైర్‌సను నిరోధిస్తే వ్యాధి సంక్రమణను చాలా వరకు నియంత్రించవచ్చు. ముఖ్యంగా కరోనా రోగులకు సేవ చేస్తున్న వైద్య సిబ్బందిని వ్యాధి సోకకుండా కాపాడటానికి, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను నిరోధించడంలో ఈ జిగురు ఉపయోగకరంగా ఉంటుంది. 


దీన్ని నాసికా రంధ్రాల వద్ద పూసుకుంటే వైర్‌సను అక్కడే చంపేస్తుంది. తద్వారా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరదు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఐఐటి బాంబే పరిశోధకులు రెండంచెల వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించారు. వైర్‌సలు ఊపిరితిత్తుల్లోకి చేరకుండా నిరోధించడం అందులో తొలి వ్యూహం. దీంతో ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది. ఇందుకోసమే ఈ జిగురును ఐఐటి బాంబే అభివృద్ధి చేస్తోంది. రెండో దశలో జీవకణాలను (బయలాజికల్‌ మాలిక్యూల్స్‌) జొప్పించి తద్వారా లోపల చిక్కుకుపోయిన వైర్‌సలను డిటర్జెంట్ల తరహాలో నిర్వీర్యం చేసే పరిజ్ఞానంపై ఆ సంస్థ పరిశోధకులు పనిచేస్తున్నారు. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని 9 నెలల్లో అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది. ఈ జిగురు తయారీకి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆర్థికసాయం అందిస్తోంది. ఐఐటి కాన్పూర్‌ కూడా ఇటువంటి జెల్‌ను రూపొందించే ప్రాజెక్టుపై పని చేస్తోంది.

Updated Date - 2020-04-10T06:03:00+05:30 IST