ఐఐటీ అవధాని శ్రీ చరణ్‌

ABN , First Publish Date - 2022-05-29T08:34:20+05:30 IST

ఆయన వృత్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అదీ అమెరికాలో ఇరవై ఏళ్లుగా. చదువుకున్నది ఖరగ్‌పూర్‌ ఐఐటీలో. అయితే చదువుకీ, వృత్తికీ బొత్తిగా సంబంధంలేని రంగంలో ఆయన ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో అవధానాలు చేస్తున్న పాలడుగు శ్రీచరణ్‌ మన తిరుపతివాడు.

ఐఐటీ అవధాని శ్రీ చరణ్‌

ఆయన వృత్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అదీ అమెరికాలో ఇరవై ఏళ్లుగా. చదువుకున్నది ఖరగ్‌పూర్‌ ఐఐటీలో. అయితే చదువుకీ, వృత్తికీ బొత్తిగా సంబంధంలేని రంగంలో ఆయన ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో అవధానాలు చేస్తున్న పాలడుగు శ్రీచరణ్‌ మన తిరుపతివాడు.రామచంద్రాపురం మండలంలోని కమ్మపల్లె ఆయన పుట్టిన ఊరు. వేల సంఖ్యలో సంస్కృత శ్లోకాలూ, పద్యాలూ రాసిన చరణ్‌ శతావధానం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఈనెల 31 నుంచి రెండు రోజులపాటు జరగనుంది. ఈ సందర్భంగా ఆయనతో సంభాషణలోని ముఖ్యాంశాలు, ఆయన మాటల్లోనే...

శతకపద్యాలే పునాది

మాది తిరుపతి సమీపంలోని కమ్మపల్లె.  నాన్న విద్వాన్‌  పాలడుగు జయరామానాయుడు ప్రధానోపాధ్యాయుడిగా, అమ్మ రావిళ్ల మనోరంజని జువాలజీ అధ్యాపకురాలిగా పనిచేశారు.  నాకు తమ్ముడు జయచరణ్‌ ఉన్నాడు. నా చదువు బీటెక్‌ వరకూ తిరుపతిలోనే జరిగింది.1997లో  ఎంటెక్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేశా. వెంటనే ఉద్యోగం వచ్చింది. 1998లోనే అమెరికా వెళ్లా. అక్కడ సాప్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌గా పనిచేసేవాణ్ని. చిన్నపుడు అమ్మానాన్నలు నేర్పిన శతకపద్యాలు ఇప్పటి నా అవధానాలకు పునాది వేశాయనిపిస్తుంది.  రోజూ నాలుగైదు పద్యాలు అప్పట్లో కంఠతా పట్టేవాడిని. రామాయణం, భారతాల నుండీ  కథలు చెప్పేవారు. ఇక తిరుపతిలో ఉండడమనే కారణంతో గుడులకు వెళ్ళడం, అన్నమాచార్య కళామందిరానికి వెళ్ళడం వంటివి చిన్నతనం నుంచీ అలవడింది. దీంతో భక్తి, సాహిత్యం, భాష.. ఈ  మూడింటిపైౖ ఆసక్తికలిగింది. ఆలయాల్లో పసితనం నుంచీ వింటున్న వేదపారాయణం కారణంగా శృతి, లయలపై కూడా తెలియని అరాధనాభావం ఏదో మదిలో ఉండేది. ఘంటసాల వారి పద్యాలు,ఎన్టీఆర్‌ పౌరాణిక సినిమాల ద్వారా సాహిత్యం, పురాణాలపై జిజ్ఞాస కలిగింది.చిన్నతనం నుంచీ చూస్తున్న అవధానాలు, వింటున్న ప్రవచనాలు, ఉషశ్రీ పుస్తకాలు వంటివి నాలో సాహిత్యం పట్ల అనురక్తిని పెంపొందించాయి. 


గుడిలో బీజం

అమెరికాలో ఒక గుడికి వెళ్ళినపుడు పరిచయమైన గణేశశర్మ అనే పురోహితుడి ద్వారా ప్రతి సోమవారం సాయంకాలం మూడేళ్లపాటు రుద్రాభిషేకంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ శబ్ద సౌందర్యం మంత్రాలపై ఆసక్తి కలిగించింది. వేదం నేర్చుకోవాలనే కోరిక కలిగింది, కానీ కొన్ని ఆటంకాలతో అది ముందుకు సాగలేదు. చివరకు,  గురువుగారు మారేపల్లి నాగవేంకట శాస్త్రి ఒకసారి నాలోని భక్తి, శ్రద్ధ గమనించి, ఈ రెంటికీ తోడు శుద్ధి కూడా పాటిస్తే వేదం నేర్పుతానన్నారు. వారి అనుగ్రహంతో 2007 మే మాసం నుంచి వేదం అధ్యయనం చేస్తున్నా.ఒకవైపు తెలుగు, సంస్కృత సాహిత్యాలు చదువుకుంటూ, మరో వైపు వేదం నేర్చుకోవడంతో నాలో సాహిత్య అధ్యయన దృష్టి పెరిగింది. 



8వేల పద్యాలు, శ్లోకాలు : 

2017లో తొలిసారి పద్యం రాసే ప్రయత్నం చేశా కానీ ఫలించలేదు. అడపా దడపా, ఆశువుగా రాసుకున్న పద్యాలను ఒకసారి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చూసి, పద్యనిర్మాణంలో మెలకువలు చెప్పారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ నేను రాసిన శివోహం పద్యాలు చూసి ప్రోత్సహించారు. ఛందఃపద్మాలు అనే నా తొలిపుస్తకాన్ని 2013లో వారే ఆవిష్కరించారు. నా సాధనలో భాగంగా ఇప్పటివరకూ 8 వేలపద్యాలు, శ్లోకాలు రాశా.


పుస్తకాల పురుగు

ఇంటర్లో సంస్కృతం తీసుకున్నా. అప్పటి మా ఉపాధ్యాయులు పాఠం చెప్పేతీరు సంస్కృతం అంటే నాకుఇష్టం పెరిగేలా చేసింది. ఐఐటీలో మంచి లైబ్రరీ ఉండేది. అక్కడ చాలా పుస్తకాలు చదివా. అమెరికా వెళ్ళిన తొలినాళ్ళలోనే మళ్లీ ఆన్‌లైన్లో సంస్కృతం నేర్చుకోవడం, పుస్తకాలు తెప్పించుకోవడం చేసేవాణ్ణి. తిరుపతి విశాలాంధ్ర నుంచి నాకు కావలసిన పుస్తకాలను అమ్మ కొని పంపేది. అలా సంస్కృతంలో పంచమహా కావ్యాలు, వాల్మీకి రామాయణం పూర్తిగా చదువుకున్నా. 



అవధానంలోకి.. 

2016లో వద్దిపర్తి పద్మాకర్‌ సమస్య, వర్ణనలతో నాచేత అవధానం సాధన  చేయించారు. 2017 మే మాసంలో అమెరికాలో నా తొలి అవధానం జరిగింది. వెంటనే సెప్టెంబర్‌ మాసంలోనే తెలుగు- సంస్కృత భాషలలో ద్విగుణిత అష్టావధానం చేశా.వారంరోజుల వ్యవధిలోనే ఐదు అవధానాలుచేసే అవకాశం వచ్చింది. సంస్కృతంలోనే అప్రస్తుత ప్రసంగంతో అవధానం చేశాను. జంట అవధానం, త్రిగళావధానం, 8 మంది  పృఛ్చకులతో  కాకుండా 15 మంది పృఛ్చకులతో అవధానం చేయడం జరిగింది. ఇపుడు చేయబోయేది నా తొలి శతావధానం, అదికూడా సంస్కృతం-తెలుగు భాషల్లో చేస్తున్నా. 


  - తిరుపతి (కల్చరల్‌) 


Updated Date - 2022-05-29T08:34:20+05:30 IST