విద్యార్థులు ప్రశ్నించింది విద్యా సంక్షోభాన్నే!

ABN , First Publish Date - 2022-08-09T08:43:05+05:30 IST

‘అమ్మ’ఇచ్చిన గడువు ముగిసింది. సమస్యలు తీరక పోగా, ఇంకా ఎక్కువై, వరుసగా అనారోగ్యం పాలై ఐఐఐటీ బాసర విద్యార్థులు గందరగోళ పరిస్థితిలోకి

విద్యార్థులు ప్రశ్నించింది విద్యా సంక్షోభాన్నే!

‘అమ్మ’ఇచ్చిన గడువు ముగిసింది. సమస్యలు తీరక పోగా, ఇంకా ఎక్కువై, వరుసగా అనారోగ్యం పాలై ఐఐఐటీ బాసర విద్యార్థులు గందరగోళ పరిస్థితిలోకి వెళ్లడం పౌర సమాజానికి ఒక చేదు పరిణామం. సహజంగా, గడువులు ఇచ్చేది నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, కానీ, సమస్యలను తీర్చడంలో ఇచ్చిన గడువును ప్రభుత్వాలు మరవడం, ప్రజాస్వామ్యాన్ని అగౌరపరచడమే. ‘పబ్లిక్ ట్రస్ట్’ అనేది ప్రజాస్యామ్యానికి ఉన్న మూల లక్షణం అందుకే దీన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత. దీనిని మరవడమే కాకుండా, యాజమాన్యం విద్యార్థులను బెదిరిస్తూ, ఎటువంటి నిరసనలకు దిగినా, క్యాంపస్ లో సెలవులు ప్రకటించడం, ఆంక్షలు పెట్టడం జరుగుతుందని చెప్పడం ఒకరకంగా హింసించే చర్యలే.


తమ న్యాయపరమైన 12 డిమాండ్లను నెరవేర్చాలని విద్యార్థులు జూన్ 14 నుంచి శాంతియుతంగా నిరసనకు దిగారు. ఇందులో శాశ్వత వీసీని నియమించడం, లెక్చరర్స్‌ని రెగ్యులరైజ్ చేయడం, ముఖ్యంగా సీఎం కెసిఆర్ క్యాంపస్ గోడు వినడానికి రావాలనేవి విద్యార్థుల ప్రధాన డిమాండ్స్. అయితే వీటిని ‘సిల్లీ’ డిమాండ్స్ అని విద్యాశాఖ మంత్రి అనడం, ప్రభుత్వం తన సిల్లీతనాన్ని బహిర్గతం చేసినట్లయింది. కానీ ఈ సిల్లీతనాన్ని కేవలం నోరుజారిన చర్యగా చూస్తే మనం పొరపడినట్టే. ప్రపంచంలో ఎక్కడైనా పోరాటాలు జరగనీ, వాటిని కొన్ని పేర్లతో సంబోధించడం మనకు తెలిసిన అలవాటు. అయితే, న్యాయం కోసం జరిగే పోరాటాలని, పోరాటంలో పాల్గొన్న వారిని అవహేళన చేయటం అటు రాజ్యానికి, ఇటు పౌర సమాజానికి ఉన్న వితండ లక్షణం. ఈ అవహేళన చేసే భాష సహజంగా మనకు హింసాత్మకంగా అనిపించకపోయినా, అటువంటి భాషలో కూడా ఒక రకమైన వివక్ష, దోపిడీ ముడిపడి ఉంటుంది. సామాజిక న్యాయం కోసమై జరిపే ఉద్యమం అయినా లేక ప్రభుత్వ ‘ప్రజా–వ్యతిరేక’ విధానాలను ప్రశ్నించే పోరాటం అయినా, సహజంగా అవహేళనపరిచే భాషని ఉపయోగిస్తూ, మనిషికి ఉన్న హ్యూమన్ ఏజెన్సీని చిన్న చూపు చూస్తూ, వాటిపై వ్యతిరేక ప్రాపగాండా చేయటం ప్రభుత్వాలకు, ఇతర యాజమాన్యాలకు ఉన్న ఇంకో లక్షణం. విద్యావ్యవస్థలో నుంచి కేవలం విద్యావంతులుగా తయారు కావడమే తమ లక్ష్యంగా పెట్టుకోకుండా, ఆ వ్యవస్థను కాపాడుకోవడం కూడా తమ బాధ్యతని విద్యార్థుల పోరాటం మనకు ఇప్పటికీ అందిస్తున్న సామాజిక, రాజకీయ సందేశం.


‘ఇది మీ ప్రభుత్వం’ అని చెప్తూనే, సమస్యలు తీర్చడానికి గడువులని అడ్డుగోడలుగా మారుస్తూ, మంత్రి విద్యార్థుల నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా, మరిన్ని నిరసనలకు తావిచ్చిన వాళ్ళయ్యారు. విద్యార్థులు తమ నిరసనను ఆపకుండా అందరి మద్దతు పొందుతూ, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూ, అధికారిక అంధకారాన్ని ఎంతోకాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ముందుండి ప్రశ్నించడంలో ఎన్నో సమస్యలు ఎదురైనా, విద్యార్థులు సామూహిక శక్తిని తోడుగా ఉంచుకోవడం విద్యార్థి ఉద్యమాలకు ఉన్న సాంఘిక లక్షణం. అయితే ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడే భాష, రాజ్యం కావాలని ఎంచుకున్న మార్గం. అందుకే ఈ భాషను సామాజిక శాస్త్రంలో వివక్ష, మానసిక హింసతో జత చేస్తూ విశ్లేషించడం జరుగుతుంది.


ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ భాషకి తగిన గౌరవం దక్కడం లేదని, వివక్షకు గురవుతున్నామని చేసిన వాదన మరిచి, ఇప్పుడు ఒక అభ్యంతరకరమైన భాషని ఉపయోగిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, బెదిరించడం, అవహేళన చేయటం– ఇప్పుడు ఉనికిలో ఉన్న రాజకీయ భాష. ఇలా క్రమంగా జరిగే ఈ ప్రక్రియని, తిప్పి కొట్టాల్సిన అవసరం ఈనాటి ప్రజాస్వామ్యవాదులు, సామాజిక ఐక్యతవాదుల మీద ఉన్న తక్షణ బాధ్యత. చిన్న చిన్న సమస్యలని తీర్చడంలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చు అన్న విద్యాశాఖ మంత్రి మాటలు సమంజసం కాదు. అదేవిధంగా విద్యార్థులు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లను ఇంతవరకు పరిష్కరించకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థుల ‘బంగారు భవిష్యత్తు’కి ప్రభుత్వం సహకరించకపోగా, వారి పోరాట స్ఫూర్తిని అవహేళన చేయడం కూడా ఏమాత్రం సరైనది కాదు.


ఐఐఐటీ బాసర యాజమాన్యం జనవరి 2020లో NAACకు సమర్పించిన సెల్ఫ్ స్టడీ రిపోర్ట్‌లో తమ సంస్థాగత సవాళ్ళను, బలహీనతలను వివరిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా ఆధారపడడం వల్ల కొంత నిధుల కొరత ఉందనీ, ఇతర మార్గాలపైన యూనివర్సిటీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇది కాకుండా, యూనివర్సిటీ ఒక వెనకబడిన ప్రాంతంలో ఉండడం, బెస్ట్ ఫ్యాకల్టీని తమకు దొరకకుండా చేస్తున్నదని తెలిపారు. సవాళ్ళను అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం లెక్కలోకి తీసుకోకపోవడమే పైన పేర్కొన్న కరోనా అనంతర విద్యా సంక్షోభం. ఈ సంక్షోభాన్ని ప్రభుత్వం గడువులతో లేక జాప్యంతో సరిచేద్దాం అనుకుంటే, విద్యార్థులను ప్రలోభపెట్టడమే కాకుండా వాళ్ళు కలలు కన్న ‘విద్యావంతుల విముక్తి తెలంగాణ’ బాటను అడ్డుకున్న వాళ్లవుతారు.


పల్లికొండ మణికంఠ

రాజనీతి శాస్త్ర అధ్యాపకులు

Updated Date - 2022-08-09T08:43:05+05:30 IST