గడ్డకట్టుకుపోయిన బల్లులు మీ నెత్తిన పడతాయి జాగ్రత్త.. అమెరికా వాతావరణ శాఖ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-02-01T01:02:39+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పడిపోతున్నాయి. మంచు తుఫాను కారణంగా ఉత్తర అమెరికాలోని అనేక ప్రాంతాలు చలి గెప్పెట్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో అమెరికా వాతావరణ శాఖ ఫ్లోరిడా రాష్ట్ర వాసులకు ఓ హెచ్చరిక చేసింది.

గడ్డకట్టుకుపోయిన బల్లులు మీ నెత్తిన పడతాయి జాగ్రత్త.. అమెరికా వాతావరణ శాఖ హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పడిపోతున్నాయి. మంచు తుఫాను కారణంగా ఉత్తర అమెరికాలోని అనేక ప్రాంతాలు చలి గెప్పెట్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో అమెరికా వాతావరణ శాఖ ఫ్లోరిడా రాష్ట్ర వాసులకు ఓ హెచ్చరిక చేసింది. ఇగ్వానా జాతికి చెందిన బల్లులు గడ్డుకట్టుకుపోయి చెట్ల మీద నుంచి మనుషుల నెత్తిపై పడిపోతాయని పేర్కొంది. చలి తట్టుకోలేక అవి గడ్డకట్టుకుపోయి అలా అచేతనంగా మారిపోయాయని, అవి చనిపోయినట్టు భావించవద్దని ప్రజలకు సూచించింది. 


‘‘వాటి శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో ఈ శీతల వాతావరణానికి అవి కదలలేక అచేతనంగా మారిపోతున్నాయి. చెట్లపై నుంచి అకస్మాత్తుగా కిందకుపడిపోతున్నాయి. కానీ..అవి ఇంకా ప్రాణాలతోనే ఉంటాయి’’ అంటూ వాతావరణ శాఖ ఓ ట్వీట్ చేసింది. 


ఉష్ణమండల ప్రాంతాలకు చెందిన ఈ జాతి బల్లులు కొన్ని శతాబ్దాల క్రితం అమెరికా ఖండంలోకి ప్రవేశించాయి. వివిధ ఖండాల మధ్య సముద్ర రవాణా ఊపందుకుంటున్న తరుణంలో అవి ప్రమాదవశాత్తూ ఓడల్లో చిక్కుకుని చివరికి అమెరికాలోకి ప్రవేశించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఫ్లోరిడా రాష్ట్ర వాసులు.. ‘బల్లుల వర్షం కురుస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2022-02-01T01:02:39+05:30 IST