బీజేపీని పట్టించుకోవద్దు

ABN , First Publish Date - 2020-08-02T08:24:39+05:30 IST

‘‘ప్రతి చిన్నవిషయానికీ బీజేపీ రాష్ట్ర నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై

బీజేపీని పట్టించుకోవద్దు

  • ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై స్పందన వద్దు..
  • టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులతో భేటీలో కేటీఆర్‌
  • కార్యకర్తల త్యాగాలతోనే ఈ స్థాయికి..
  • బీమా కంపెనీకి చెక్కు అందించిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌


హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రతి చిన్నవిషయానికీ బీజేపీ రాష్ట్ర నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై స్పందన కూడా వద్దు’’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వం మీద కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని, వాటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. శనివారం టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై సమావేశంలో ఆయన ఆరా తీశారు. ఆగస్టు 15లోపు పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం మొదలవుతుందని, అన్ని కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలో పట్టభద్రుల కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని కేటీఆర్‌ వారికి సూచించారు.


తెలంగాణకు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే

‘‘జలదృశ్యం నుంచి గెంటివేతకు గురైన పార్టీ మనది. కార్యకర్తల శ్రమ, పట్టుదల కారణంగానే టీఆర్‌ఎస్‌ ఈ స్థాయికి వచ్చింది. ఆ శ్రమ, పట్టుదల, త్యాగాలు మామూలువి కావు. కార్యకర్తలను ఆదుకునే స్థాయికి ఎదిగాం. కార్యకర్తల బీమా కోసం రూ.16.11 కోట్లు ప్రీమియం మొత్తం బీమా కంపెనీకి చెల్లించాం. కేసీఆర్‌ స్థాపించిన ముహూర్త బలం వల్ల మరో వందేళ్లు పార్టీ బలంగా ఉండేలా ఉంది. కార్యకర్తల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉంది’’ అని కేటీఆర్‌ అన్నారు.


తెలంగాణకు కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం కేసీఆరేనని చెప్పారు. ప్రమాదవశాత్తు చనిపోయిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు బీమా కింద చెల్లించాల్సిన డబ్బులను బీమా కంపెనీకి చెక్కు రూపంలో కేటీఆర్‌ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అజేయమైన శక్తిగా టీఆర్‌ఎస్‌ ఎదిగిందన్నారు. కార్యకర్తల సంక్షేమమే పార్టీ ప్రాథమిక కర్తవ్యమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ అన్నారు. 

Updated Date - 2020-08-02T08:24:39+05:30 IST