సూళ్లూరుపేటలో నైట్ రౌండ్ తప్పనిసరి
నాన్ కంటైన్మెంట్లలో చెక్‌పోస్టులు వద్దు
ఐజీ ప్రభాకర్ రావు
నెల్లూరు(క్రైం), మే 22: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోయంబేడు లింకులపై ప్రత్యేక దృష్టి సారించాలని సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్ ఐజీ జే ప్రభాకర్ రావు జిల్లా పోలీసులను ఆదేశించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. కోయంబేడు లింకులతో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో చాలా మందికి కరోనా లక్షణాలు లేవని, ఈ నేపథ్యంలో వైరస్ విస్తరించకుండా వెంటనే అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని, పాజిటవ్ వచ్చిన వారి కాంటాక్టులను గుర్తించాలని ఆదేశించారు. సూళ్లూరుపేట రెడ్‌జోన్ ప్రాంతాల్లో పికెట్లు, బందోబస్తు కఠినంగా ఏర్పాటు చేయడంతో పాటు నైట్ రౌండ్స్ అధికారులను నియమించి నిఘా పెంచాలని సూచించారు.
అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కఠినంగా వ్యవహరించాలన్నారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో ఉన్న పికెట్లు, చెక్‌పోస్టులు తీసేసి కంటైన్మెంట్ జోన్లలో బందోబస్తును మరింత బలోపేతం చేయాలని సూచించారు. సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్, మెరైన్ నుంచి వచ్చిన సిబ్బందిని తిరిగి ఆ శాఖలకు పంపాలన్నారు. ఈ వీడియో సమావేశంలో ఏఎస్పీ (అడ్మిన్) పీ వెంకటరత్నం, డీఎస్పీ ఎన్ కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ రాబోయే రోజులు చాలా క్లిష్టతరమైనవని, మరో వారం రోజులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.