ఇంట్లోనే ఇఫ్తార్‌ రుచులు

ABN , First Publish Date - 2020-05-09T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ మూలంగా బహిరంగ ఇఫ్తార్‌ విందులు లేకుండా పోయాయి. అయితేనేం ఇంట్లోనే ఇఫ్తార్‌ విందు రుచికరంగా చేసుకోవచ్చు. టేస్ట్‌తో పాటు శక్తినిచ్చే వెరైటీ రుచులు ఇవి...

ఇంట్లోనే ఇఫ్తార్‌ రుచులు

లాక్‌డౌన్‌ మూలంగా బహిరంగ ఇఫ్తార్‌ విందులు లేకుండా పోయాయి. అయితేనేం ఇంట్లోనే ఇఫ్తార్‌ విందు రుచికరంగా చేసుకోవచ్చు. టేస్ట్‌తో పాటు శక్తినిచ్చే వెరైటీ రుచులు ఇవి...


మటన్‌ ఎగ్‌ ఖీమా 

కావలసినవి

మటన్‌ ఖీమా - పావుకేజీ, కోడిగుడ్లు - నాలుగు, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, టొమాటో - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, గరంమసాల - రెండు టీస్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, పుదీనా, నిమ్మకాయ - గార్నిష్‌ కోసం.

చట్నీ కోసం : పుదీనా ఆకులు - ఒక కప్పు, కొత్తిమీర - ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి - నాలుగు, నిమ్మకాయ - ఒకటి. 


తయారీ

  1. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెన్న వేసి ఉల్లిపాయలను వేగించాలి. 
  2. అదే సమయంలో పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో వేసి పేస్టుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు వేసి రెండు నిమిషాల పాటు వేగించాలి.
  4. టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి. 
  5. గరంమసాల, కారం, పసుపు వేసి మరికాసేపు వేగించాలి. 
  6. ఇప్పుడు ఖీమా వేసి కలుపుకోవాలి. పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి.
  7. గ్రీన్‌ చట్నీ, ఉడికించిన కోడిగుడ్లు వేసి కలుపుకోవాలి. 
  8. తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఖీమా మెత్తగా ఉడికే వరకు ఉండనివ్వాలి.
  9. చివరగా పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

మటన్‌ ఘోష్‌

కావలసినవి

మటన్‌ - ఒక కేజీ, బొప్పాయి పండు గుజ్జు - 3 టేబుల్‌స్పూన్లు, నెయ్యి - 150 గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు - 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు - నాలుగు, టొమాటోలు - ఆరు, పసుపు- రెండు టీస్పూన్లు, కారం - 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, జాజికాయ పొడి - పావు టీస్పూన్‌, బిర్యానీ ఆకులు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, యాలకులు - మూడు, లవంగాలు - నాలుగైదు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, పెరుగు - రెండు కప్పులు, పాలు - ఒక కప్పు.


తయారీ

  1. మటన్‌ను శుభ్రంగా కడిగి, బొప్పాయి గుజ్జు వేసి కలుపుకొని పక్కన పెట్టాలి.
  2. పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు వేసి వేగించాలి.
  3. టొమాటో ముక్కలు వేయాలి. పసుపు, బిర్యానీ ఆకు, జాజికాయ పొడి, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర వేసి మరికా సేపు వేగనివ్వాలి. 
  4. ఇప్పుడు మటన్‌ వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం వేసి పావుగంట పాటు ఉడకనివ్వాలి.
  5. పెరుగు వేసి మరో పదినిమిషాలు ఉడికించాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి అరగంటపాటు ఉడికించాలి. నీళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే మూత తీసి, ఎక్కువ మంటపై కాసేపు ఉండనివ్వాలి.
  6. తరువాత పాలు పోసి కలుపుకోవాలి. మాంసం మెత్తగా ఉడికిన తరువాత దింపుకోవాలి. రోటీలోకి లేదా అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.

సెనగపప్పు చికెన్‌ ఖీమా 

కావలసినవి

 సెనగపప్పు - ఒక కప్పు, చికెన్‌ ఖీమా - అరకేజీ, నూనె - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, లవంగాలు - 4,  నల్లమిరియాలు - నాలుగైదు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - అర టీస్పూన్‌, కారం - ఒకటిన్నర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు, పెరుగు - ఒక కప్పు, నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు, పుదీనా - అరకప్పు, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - ఒక కట్ట. 

తయారీ

  1. పాన్‌లో నూనె వేసి లవంగాలు, మిరియాలు వేగించాలి.
  2. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మరో మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వాలి.
  3. నానబెట్టుకున్న సెనగపప్పును వేసి కలుపుకోవాలి. 
  4. కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి, గరంమసాల, ఉప్పు వేసి కలియబెట్టాలి.
  5. కొద్దిగా నీళ్లు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. మూతపెట్టి పావుగంట పాటు ఉడికించాలి.
  6. ఇప్పుడు చికెన్‌ వేసి కలుపుకోవాలి. పెరుగు, గరంమసాల, నెయ్యి, పుదీనా, కొద్దిగా నిమ్మరసం వేసి మరో పావుగంట ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-05-09T05:30:00+05:30 IST