ఇఫ్తార్‌ రుచులు.. కోవిడ్‌ సమయంలో కొత్తగా...

ABN , First Publish Date - 2021-05-08T05:11:48+05:30 IST

ఇఫ్తార్‌ విందు అంటే ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులతో చేసే వంటలు ఉండాల్సిందే. వీటితోపాటు క్వినోవా ఖీర్‌, క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌, అంజీర్‌ - కుబానీ కి టిక్కీ వంటివి కోవిడ్‌ సమయంలో తక్షణ శక్తిని అందించడంతో పాటుగా...

ఇఫ్తార్‌ రుచులు.. కోవిడ్‌ సమయంలో కొత్తగా...

ఇఫ్తార్‌ విందు అంటే ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులతో చేసే వంటలు ఉండాల్సిందే. వీటితోపాటు క్వినోవా ఖీర్‌, క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌, అంజీర్‌ - కుబానీ కి టిక్కీ వంటివి కోవిడ్‌ సమయంలో తక్షణ శక్తిని అందించడంతో పాటుగా... రుచిగా కూడా ఉంటాయి. ఆ ఇఫ్తార్‌ స్పెషల్‌ వంటలు ఎలా చేయాలో చూద్దాం.


అంజీర్‌ - కుబానీ కి టిక్కీ

అంజీర్‌లో పోషకాలు.. (100గ్రాలలో..)

క్యాలరీలు - 30

ప్రొటీన్లు - 0.3గ్రా

కార్బోహైడ్రేట్లు - 7.7గ్రా

ఫైబర్‌ - 1.2గ్రా


కావలసినవి

అంజీర్‌ - నాలుగు, కుబానీ (డ్రై అప్రికాట్స్‌) - నాలుగు, పచ్చిమిర్చి - మూడు, అల్లం - 80గ్రా, ఉల్లిపాయలు - 100గ్రా, కొత్తిమీర - 20గ్రా, ఛాట్‌ మసాల - 15గ్రా, పనీర్‌ - 200గ్రా, హంగ్‌కర్డ్‌ - 100గ్రా, శనగపిండి - 100గ్రా, ధనియాల పొడి - 15గ్రా, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - 5గ్రా.


తయారీ విధానం

ముందుగా అంజీర్‌, డ్రై  అప్రికాట్స్‌ను నానబెట్టి, తరువాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఒక పాత్ర తీసుకుని అందులో శనగపిండి, హంగ్‌ కర్డ్‌, పనీర్‌, మిరియాలపొడి, ధనియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకొని మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి.

మరొక పాత్రలో అంజీర్‌, అప్రికాట్‌, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, ఛాట్‌మసాల, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.

ఇప్పుడు సెనగపిండి, కర్డ్‌ మిశ్రమాన్ని తీసుకుని కొద్దిగా వెడల్పుగా చేసుకుని మధ్యలో రెండు, మూడు స్పూన్ల అంజీర్‌, అప్రికాట్‌ మిశ్రమాన్ని పెట్టి చివరలు దగ్గరకు అని మూసేయాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక కబాబ్‌లు వేసి వేగించాలి.

వేడి  వేడి అంజీర్‌ - కుబానీ కి టిక్కీలను సర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకోవాలి.


క్వినోవా ఖీర్‌

క్వినోవాలో పోషకాలు.. (100గ్రాలలో..)

క్యాలరీలు - 120

ప్రొటీన్లు - 4.4 ర గా

కార్బోహైడ్రేట్లు - 21.3గ్రా

ఫైబర్‌ - 2.8 గ్రా


కావలసినవి 

క్వినోవా - 200 గ్రాములు, నెయ్యి - 80 ఎంఎల్‌, పాలు - 60ఎంఎల్‌, పంచదార - 100గ్రాములు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - చిటికెడు, పిస్తా పలుకులు - 20గ్రాములు.


తయారీ విధానం

ముందుగా క్వినోవాను నీళ్లలో రెండు సార్లు కడగాలి. తరువాత పావుగంటపాటు నానబెట్టాలి.

పదిహేను నిమిషాల తరువాత నీళ్లు వంపేసి క్వినోవా పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై కుక్కర్‌పై పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక క్వినోవా వేయాలి. 

చిన్నమంటపై ఐదు నిమిషాలు వేగనివ్వాలి. 

ఇప్పుడు పాలు, తగినన్ని నీళ్లు పోయాలి. కుక్కర్‌ మూతపెట్టి రెండు, మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.

ఆవిరి పోయిన తరువాత మూత తీసి కుంకుమపువ్వు వేయాలి. మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.

మిశ్రమం చిక్కబడుతున్న సమయంలో పంచదార వేసి చిన్నమంటపై మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.

చివరగా యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉంచి దింపుకోవాలి.

పిస్తా పలుకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌

కావలసినవి

శనగపిండి - 200గ్రా, బేకింగ్‌ పౌడర్‌ - 10గ్రా, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - 10గ్రా, హంగ్‌ కర్డ్‌ - 150గ్రా, ఎండుద్రాక్ష - 20గ్రా, జీడిపప్పు - 20గ్రా, డేట్స్‌ - 50గ్రా, కొత్తిమీర - 15గ్రా, వాము - 5గ్రా, పసుపు - 10గ్రా, నూనె - సరిపడా, బ్రెడ్‌ ప్యాకెట్‌ - ఒకటి.


తయారీ విధానం

ఒక పాత్రలో శనగపిండి తీసుకుని అందులో బేకింగ్‌ పౌడర్‌, హంగ్‌ కర్డ్‌, ఎండుద్రాక్ష , జీడిపప్పు, డేట్స్‌, వాము, కొత్తిమీర, వాము, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి పలుచని మిశ్రమంలా కలుపుకోవాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలను సెనగపిండి మిశ్రమంలో డిప్‌ చేసి, నూనెలో వేసి వేగించుకోవాలి. 

ముదురు  గోధుమవర్ణంలోకి మారే వరకు డీప్‌ ఫ్రై చేయాలి. 

కొత్తిమీర చట్నీతో సర్వ్‌ చేసుకుంటే క్రిస్పీ కర్డ్‌ రోల్స్‌ రుచికరంగా ఉంటాయి. 


ఎండి షాహిద్‌ హుస్సేన్‌, ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌, తాజ్‌ కృష్ణ, హైదరాబాద్‌

Updated Date - 2021-05-08T05:11:48+05:30 IST