క్షేత్ర జ్ఞానం కలగాలంటే...

ABN , First Publish Date - 2021-08-06T05:30:00+05:30 IST

పొలంలో నాటిన విత్తనాలకు తగిన సమయంలో ఫలం అందుతుంది. అలాగే శరీరం ఆధారంగా మానవులు చేసే కర్మ సంస్కార బీజాల నుంచి కూడా తగిన సమయంలో ఫలం లభిస్తుంది.

క్షేత్ర జ్ఞానం కలగాలంటే...

పొలంలో నాటిన విత్తనాలకు తగిన సమయంలో ఫలం అందుతుంది. అలాగే శరీరం ఆధారంగా మానవులు చేసే కర్మ సంస్కార బీజాల నుంచి కూడా తగిన సమయంలో ఫలం లభిస్తుంది. అందుకే శరీరానికి ‘క్షేత్రం’ అని పేరు వచ్చిందంటారు పండితులు. 


క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత!

క్షేత్ర క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్‌ జ్ఞానం మతం మమ


‘‘సర్వ క్షేత్రాల్లో (సర్వ శరీరాల్లో) ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే! క్షేత్ర- క్షేత్రజ్ఞుల సంబంధాన్ని తెలుసుకోవడమే జ్ఞానం’’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. ‘వికార సహితమైన ప్రకృతి నిజస్థితినీ, నిర్వికార పురుషుల నిస్తులమైన అంటే సాటిలేని తత్త్వాన్నీ తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం’ అనే అపూర్వమైన విషయాన్ని సైతం భగవద్గీత వివరిస్తోంది. క్షేత్ర- క్షేత్రజ్ఞుల తత్త్వ విచారణ గురించి ఋషులు అనేక విధాలుగా వర్ణించారు. వేద మంత్రాలు వేర్వేరు రూపాల్లో అభివర్ణించాయి. బ్రహ్మసూత్రాలు నిశ్చయాత్మకంగా, హేతుబద్ధంగా వివరించాయి. 


క్షేత్రం అంటే...

పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి; అంతఃకరణ వృత్తులైన అహంకారం, బుద్ధి;  త్రిగుణాల అవ్యక్తస్థితి; జ్ఞానేంద్రియాలయిన చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మం; కర్మేంద్రియాలుగా పేర్కొనే కాళ్లు, చేతులు, నోరు, మల, మూత్ర ద్వారాలు, పదకొండవ ఇంద్రియంగా  పరిగణించే మనస్సు; పంచభూతాల గుణాలు తెలియబరచే తన్మాత్రలైత శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు; కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, స్థూలశరీరం, చేతనం, ధృతి కలసి క్షేత్ర రూపమని ‘భగవద్గీత’లోని  క్షేత్ర విభాగం వివరిస్తోంది.


క్షేత్ర- క్షేత్రజ్ఞుల గురించి జ్ఞానం పొందాలంటే ఆచరించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. మన శరీర ప్రయోజనం మరింత ఉత్కృష్టం కావాలంటే ఆడంబరాన్ని అణచివేయాలి. నిరాడంబరతను ఆశ్రయించాలి. ‘నేను గొప్పవాడిని’ అనే భావన పనికిరాదు. నిగర్విగా మెలగడం ఉత్తమం. నిగర్వి సాధించిన సత్కృత్యాలు సమాజాభివృద్దికి తోడ్పడతాయి. హింసకు పాల్పడకుండా ఉండడం, క్షమాగుణాన్ని కలిగి ఉండడం మానవుడికి గొప్ప ఆభరణాలు. ఎదుటివారి మనసులను మాటల ద్వారా, చేతల ద్వారా బాధించడమే హింస. వాటిని పాపకార్యాలుగా పరిగణించాలి. ఇతరుల మనసులను సంతోషపెట్టేలా మన చర్యలు ఉండాలి. పుణ్యకార్యాల్లో విధిగా పాల్గొనాలి. 


గురుసేవ మానవులను వృత్తి గుణ కోవిదులుగా తీర్చిదిద్దుతుంది. మనిషి మనసులో అజ్ఞానమనే మాలిన్యాన్ని తొలగించే పూజ్యుడు గురువు. శారీరక, మానసిక ఆరోగ్యాలు అత్యవసరాలు. అందుకే బాహ్య, ఆంతరంగిక శౌచ విధులను అనునిత్యం నిర్వర్తించాలి. అప్పుడే మనిషి అన్ని విధాలా శోభిస్తాడు. ఇంద్రియ ప్రయోజనాల విషయంలో వైరాగ్యం తప్పనిసరి. ఇంద్రియాల దృష్టి ప్రాపంచిక భోగాల మీద ప్రసరించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. పరమాత్మ ద్వారా కలిగే ప్రయోజనాల వైపు దృష్టి సారించాలి. అలా చేస్తే శరీర బంధం తొలగిపోతుంది. శరీరం అశాశ్వతమనీ, అంతటా నిండిన పరమాత్ముడు మాత్రమే శాశ్వతుడనీ విశ్వసించాలి. జన్మ-మృత్యు-జరా-రోగాల వల్ల కలిగే దుఃఖ నివృత్తి గురించి పదే పదే మనసులో మెదులుతూ ఉండాలి. భార్య, పిల్లలు, ధనాదుల మీద ఉండే వ్యామోహాన్ని ‘ఈషణత్రయం’ అంటారు. అవి అంతరించాలి. విషయవాంఛల పట్ల నిమిత్తమాత్రుడిగా ఉండే నేర్పు సాధించాలి. శాస్త్ర మర్యాదలను అనుసరించి కర్తవ్య కర్మలు చేయాలి. చేసే ప్రతి పని ఫలితాన్నీ పరమాత్మకు అర్పించాలి. 

వల్లూరు చిన్నయ్య

Updated Date - 2021-08-06T05:30:00+05:30 IST