పిఠాపురంలోకి ప్రవేశించాలంటే..ముక్కు మూసుకోవాల్సిందే!

ABN , First Publish Date - 2020-09-28T11:29:19+05:30 IST

ఎక్కడైనా పట్టణంలోకి ప్రవేశించే ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉంటాయి.. అందుకు భిన్నం ఇక్కడ పరిస్థితి.. ప్రవేశ రహదారులకు

పిఠాపురంలోకి ప్రవేశించాలంటే..ముక్కు మూసుకోవాల్సిందే!

ఇటు చెత్తకుప్పలు.. అటు దుర్గంధ వాతావరణంతో స్వాగతం

మురికికూపంగా ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారి


పిఠాపురం, సెప్టెంబరు 27: ఎక్కడైనా పట్టణంలోకి ప్రవేశించే ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉంటాయి.. అందుకు భిన్నం ఇక్కడ పరిస్థితి.. ప్రవేశ రహదారులకు ఇరువైపులా చెత్తకుప్పలు.. ఆపై దుర్గంధపూరిత వాతావరణం.. వాహనాలపై వెళ్లే వారందరూ ఇక్కడకు వచ్చేసరికి ముక్కుమూసుకోవాల్సిందే.


216వ జాతీయ రహదారి బైపాస్‌ జంక్షన్‌ నుంచి పిఠాపురం పట్టణంలోకి ప్రవేశించే మార్గంలో ఉన్న ఆర్‌అండ్‌బీ ప్రదాన రహదారి డంపింగ్‌యార్డును తలపిస్తోంది. పశువుల సంతవరకూ రోడ్డుకు ఇరువైపులా భారీగా చెత్తకుప్పలు వేశారు. పట్టణానికి మాధవపురంలో డంపింగ్‌యార్డు ఉన్నప్పటికీ మునిసిపల్‌ ట్రాక్టర్లు ద్వారా చెత్తను తెచ్చి ఇక్కడ వేస్తున్నారు. సుమారు అరకిలోమీటరు పొడవునా ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డును డంపింగ్‌యార్డుగా మార్చివేశారు. డ్రెయిన్లు పూడుకుపోయి ఉండడం, పూడిక తొలగింపు జరగకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా మురికికూపాన్ని తలపిస్తోంది.


మరుగు వ్యర్థాలను ట్యాంకర్లు ద్వారా తెచ్చి ఇక్కడే వేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి, పాదగయ సమీపంలో చెత్తను డంప్‌ చేయవద్దని, ఇప్పటికే ఇక్కడ వేసిన చెత్తను తక్షణం తరలించాలని గతంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోగా మరింత చెత్తాచెదారాన్ని ఇక్కడ తెచ్చి డంప్‌ చేస్తున్నారు. చెత్తకుప్పలను వెనక్కి తోస్తుండడంతో డ్రెయిన్లతోపాటు పంటకాలువలు మూసుకుపోతున్నాయి. ఈ మార్గంలో వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మునిసిపల్‌ అధికారులు తక్షణం స్పందించి పట్టణంలోకి ప్రవేశించే మార్గాల్లో రోడ్డుకిరువైపులా వేసిన చెత్తాచెదారాన్ని తొలగించి డంపింగ్‌యార్డుకు తరలించాలని, డ్రెయిన్లలో పూడికలు తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-09-28T11:29:19+05:30 IST