మంచి ఇంజనీర్‌గా నిలదొక్కుకోవాలంటే.. ఇలా చేయండి!

ABN , First Publish Date - 2021-12-13T15:38:57+05:30 IST

ఇంజనీరింగ్‌ సీటు..

మంచి ఇంజనీర్‌గా నిలదొక్కుకోవాలంటే.. ఇలా చేయండి!

నాలుగేళ్ళ జర్నీ.. బీటెక్‌


ఇంజనీరింగ్‌ సీటు ఖరారయింది. కాలేజీలో చేరడం కూడా పూర్తయింది. చాలావరకు రెగ్యులర్‌ తరగతులకు సన్నాహాలు పూర్తయ్యాయి. నాలుగేళ్ళు చదివితే ఇంజనీర్‌ అవుతారు. ఆ ఆనందం కలకాలం నిలవాలంటే, రాబోయే నాలుగేళ్ళూ అప్రమత్తంగా ఉండాలి. ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేయడం ఏమంత కష్టం కాకపోవచ్చు. మంచి ఇంజనీర్‌గా నిలదొక్కుకోవాలంటే మాత్రం స్టడీకి తోడు అప్లికేషన్‌ నాలెడ్జ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా అవసరం. ఈ మూడింటి కోసం ఎంత కష్టపడుతున్నామన్నదే ప్రధానం. ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేసుకుని బైటకు వస్తున్న వారిలో చాలా తక్కువ శాతం మందికి మాత్రమే ఉద్యోగార్హత ఉందని పలు సర్వేలు ఎప్పటికప్పుడు నిగ్గు తేలుస్తూనే ఉన్నాయి. ఉద్యోగం లేదంటే సొంతంగా ఉపాధికి తగ్గట్టు చదువుకోవడం ఎలాగో వరంగల్‌లోని ఎన్‌ఐటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.వి.రమణరావు చెబుతున్నారు. 


కలలు కనడం వేరు. వాటిని నెరవేర్చుకోవడం వేరు. ఈ రెంటికి మధ్య సన్నటి గీత ఉంటుంది. అది తెలుసుకోవడం ఒక ఎత్తు. అవాంతరాలు ఎదురైతే అధిగమించి లక్ష్యానికి చేరుకోవడం మరొక ఎత్తు. ఇంజనీరింగ్‌ కోర్సు అధ్యయనానికీ ఇదే వర్తిస్తుంది.  ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరడంతోనే సమస్తం పూర్తి కాదు. మున్ముందు చాలా దశలు ఉంటాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, టెస్టులు తదితరాలన్నీ ఉంటాయి. వాస్తవ ప్రపంచంలో ఇంజనీర్‌ అయ్యేందుకు అవసరమైన వీటన్నింటినీ ఎదుర్కొనే స్థితిలో మీరు ఉంటారని ప్రొఫెసర్‌ కూడా భావిస్తారు. అంతమాత్రాన, పాఠశాలల్లో మాదిరిగా ప్రతి అడుగులో ప్రొఫెసర్‌ మీ వెనక ఉండి, మీరు ఇంజనీర్‌ అయ్యేందుకు తోడ్పడతారని భావించవద్దు. కార్పొరేట్‌ కళాశాల తరహాలో అన్నీ నోట్లో పెట్టే పరిస్థితి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉండదు. భవిష్యత్తుకు ఉపకరించే స్థాయిలో నైపుణ్యాలను సొంతంగా అలవర్చుకోవాలి. సొంత కృషికి తోడు శ్రమించేతత్వం ఉండాలి. అన్నింటికీ మించి మీదైన సృజనాత్మకత తోడవ్వాలి. అప్పుడే మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు.


మీరే నేర్చుకోవాలి

ఇంజనీరింగ్‌లో చేరినవారిలో ఎక్కువ మంది విద్యార్థులు ‘నా టీచర్‌కు అన్నీ తెలుసు. నేను ఇంజనీరు అయ్యేందుకు అవసరమైనవన్నీ ఆయన చెబుతారు. జాగ్రత్తగా నేర్చుకుని పరీక్షల్లో వాటిని రాస్తే చాలు. ఆ ఒక్క పని చేయగలిగితే, నేను అన్నీ నేర్చుకున్నట్టే’ అని భావిస్తారు. అయితే, ఈ భావన తప్పు. అన్నీ ఒక ప్యాకేజ్‌ రూపంలో తీర్చిదిద్దినట్టుగా ఉండవు. అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకోవడమే చాలాసార్లు పెద్ద సమస్య. ప్రొఫెసర్లను అడిగి నేర్చుకోవడం మీ చేతుల్లో ఉందని తెలుసుకోండి.


ప్రశ్నించాలి

విద్యార్థులకు సాధ్యమైనంత ఎక్కువ నేర్పించేందుకే ప్రొఫెసర్లు, పుస్తకాలు ఉంటాయనుకోండి. బ్లాక్‌ బోర్డ్‌పై వేస్తున్న క్యాలిక్యులేషన్స్‌, తద్వారా సాధిస్తున్న ఈక్వేషన్‌ కాదంటే అక్కడ చూపిస్తున్న స్కెచ్‌ అర్థం కాకున్నా వెంటనే లెక్చరర్‌ని అడగండి. మీ సందేహం బైట పెట్టండి. మళ్ళీ చెప్పండని కోరండి. అలా అడిగితే మెజారిటీ లెక్చరర్లు ఏమీ అనుకోరు. పైగా సందేహం వ్యక్తం చేసినందుకు సంతోషిస్తారు. తన లెక్చర్‌ను చక్కగా ఫాలో అవుతున్నందుకు మొదట ఆనందపడతారు. విద్యార్థులకు సహకరించేందుకు ముందుకు వస్తారు. సంబంధిత మెటీరియల్‌, పుస్తకాల వివరాలు చెప్పి తోడ్పడతారు.


అడిగేయటమే!

‘ఏదైనా అర్థం కావాలంటే ప్రాక్టికల్‌ లేదా రియల్‌ వరల్డ్‌ అప్లికేషన్‌ తెలియాలి. అయితే తరగతి గదిలో మనకు థియరీ ఒక్కటే చెబుతున్నారు’, ‘అవి అలా ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలని అనుకొంటాను. అయితే ఫ్యాక్ట్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫార్ములాలను సబ్‌స్టిట్యూట్‌ చేయాల్సి వస్తోంది’. ‘చూసిన బొమ్మలు, డయాగ్రమ్స్‌, పరిశీలించిన డెమాన్‌స్ట్రేషన్స్‌తో బాగా అర్థం చేసుకోగలను. విన్నది, చదివిన దానికంటే బాగా అనిపిస్తుంది. అయితే వివిధ పదాలు, ఫార్ములాలతోనే మనమంతా తెలుసుకోవాల్సి వస్తోంది’ ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే... అధ్యయనంలో భాగంగా ఏం మిస్సవుతున్నామో మొదట గుర్తించాలి. వెంటనే తరగతి గదిలో లేదా బైట ఆ విషయాన్ని ప్రొఫెసర్‌తో ప్రస్తావించాలి. అర్థం కానప్పుడు అడగటమే మంచిది.


‘ఆ ఫార్ములాను మీరు ఎలా ఉపయోగించారో చెప్పగలరా?’ డివైజ్‌, సొల్యూషన్‌ లేదంటే ప్లాట్‌ ఎలా ఉంటుందో స్కెచ్‌ ద్వారా చూపగలరా?’ ‘మీరు బోర్డుపై రాసిన ఈక్వేషన్‌ని ఎక్కడి నుంచి తీసుకున్నారు’? ...... ఇలా చాలా పొందికగా అడగవచ్చు. చెత్త ప్రశ్న అడుగుతున్నానేమో అని భయపడినప్పటికీ, ఇబ్బంది లేదు. అడగటమే మంచిది. ఈ విషయంలో ఒకటి గ్యారంటీగా చెబుతున్నాను. నిజానికి, మీరు ధైర్యంగా ప్రశ్న లేవనెత్తినందుకు మిగిలిన స్టూడెంట్స్‌ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మరింత వివరంగా కావాలనుకుంటే నేరుగా ప్రొఫెసర్‌ ఉన్న ఆఫీసు రూమ్‌లోకి వెళ్ళి అడగండి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీ హోంవర్క్‌ చేయించుకుంటున్నారన్న భావన ప్రొఫెసర్‌కు కలుగనీయవద్దు. సరైన శ్రద్ధ పెట్టకుండా, అన్ని విధాలుగా ట్రై చేయకుండా ప్రాబ్ల్లమ్‌ను ఎన్నడూ ప్రొఫెసర్‌ వద్దకు తీసుకువెళ్ళవద్దు.  


సహ విద్యార్థులతో కలసి మెలసి

ఒంటరిగా మీరు ఏదైనా చేస్తున్నప్పుడు, అవాంతరం తలెత్తితో అక్కడ ఆగిపోవచ్చు. పూర్తిగా వదిలేయనూవచ్చు. అదే గ్రూపులో కలిసి చేస్తే, ఎవరో ఒకరు అవాంతరాన్ని అధిగమించే మార్గాన్ని చూపవచ్చు. ఒక్కడిగా బదులు సహాధ్యాయులతో కలసి పనిచేయడం వల్ల సులువుగా సమస్యలను పరిష్కరించగలుగుతారు. 


సొంత పోర్ట్‌ఫోలియో

బిజీ షెడ్యూల్‌ ఏర్పాటు ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న ప్రతి ఎక్స్‌పెరిమెంటల్‌ లెర్నింగ్‌ ప్రాజెక్టులో పాల్గొనే ప్రయత్నించండి. కాలేజీలో పొందిన పరిజ్ఞానాన్ని అన్వయించుకునే వెసులుబాటు దీంతో లభిస్తుంది. దానికితోడు ప్రాజెక్టు పోర్ట్‌ ఫోలియో రూపొందించుకోవడానికి, వాటిని ఎంప్లాయర్‌కి చూపించడానికి వీలుపడుతుంది.


మంచి నెట్‌వర్క్‌

ఇంజనీరింగ్‌ తనకు తాను ఒక్కటిగా ఉండే రంగం కాదు. భిన్న రంగాలతో కలగలిసి ఉంటుంది. నాయకత్వానికి తోడు టీమ్‌వర్క్‌ ఈ రంగంలో చాలా అవసరం. అందువల్ల కాలేజీలో ఉన్నప్పుడే నెట్‌వర్క్‌ పెంచుకుంటే, ప్రొఫెషన్‌ ఆరంభంలో బాగా ఉపకరిస్తుంది. సహాధ్యాయులకు తోడు సీనియర్లు, టీచర్లతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవాలి. సెమినార్లు, లెక్చర్లు, కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనాలి. అక్కడకు వచ్చే స్పీకర్లతో ఇంటరాక్ట్‌ కావాలి. కాలేజీ అలూమ్ని విషయంలోనూ చూసుకోవాలి. మీ కాలేజీకి సంబంధించిన వారంతా అండర్‌ గ్రాడ్యుయేట్లతో సంబంధాలు నెలకొల్పుకొనేందుకు చూస్తారు. సోషల్‌ మీడియాతో తగు మేర టచ్‌లో ఉండటం కూడా మంచిదే.


సమ్మర్‌లో ఇంటెర్న్‌

ప్రాక్టికల్స్‌తో వచ్చిన నాలెడ్జిని ఎల్లకాలం గుర్తుంచుకోగలుగుతాం. అవకాశం ఉంటే, నాలుగేళ్ళ కోర్సులో భాగంగా ప్రతి సమ్మర్‌లో ఇంటెర్న్‌కు యత్నించండి. ప్రాక్టికల్‌ అనుభవం ఉన్న అండర్‌ గ్రాడ్యుయేట్ల కోసమే ఎంప్లాయర్లు ఎప్పుడూ అన్వేషిస్తుంటారు. అదే సమయంలో సొంతగా ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియో రూపొందించుకోండి. అలాగే ఇంటెర్న్‌- తరవాత వచ్చే సెమిస్టర్‌కు సైతం ఉపయోగపడుతుంది. 


ఎక్స్‌పర్ట్‌

ఇంజనీరింగ్‌లో మీదైన రంగంలో ఆల్‌రౌండర్‌ కావాలి. విజువల్‌ డిజైన్‌ కోర్సుని ఉదాహరణగా తీసుకుంటే మీ ఆలోచనలు గ్రాఫిక్స్‌లో బలంగా కనిపించాలి. లేదంటే షార్ట్‌ టర్మ్‌ కోర్సు/ ప్రోగ్రామ్‌తో బిజినెస్‌ ఎక్స్‌పర్ట్‌ కావచ్చు. ఒకప్పటి రోజుల్లో ఇంజనీర్లకు సాంకేతిక నైపుణ్యం ఉంటే సరిపోయేది. ఆ రోజులు గతించాయి. ఇప్పటి ఇంజనీర్‌ బిజినెస్‌ ఎక్స్‌పర్ట్‌ కూడా కావాలి. మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే తెలివితేటలు అందరిలో ఉంటాయి. అయితే వాటిని వెలికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పడిపోతుందని పసిపాపను అడుగులు వేయకుండా అడ్డుకోలేం. ప్రతి మలుపు దగ్గర ఇదే సూత్రం అన్వయించుకోవాలి. అప్పుడే పురోగతి.  


నమ్మకం కోల్పోవద్దు

నీపై నీకు ఉండే నమ్మకాన్ని కోల్పోవద్దు. బాగా శ్రమించి, నీదైన పద్ధతిలో ఇంజనీరింగ్‌ విద్యార్ధిగా అత్యున్నత దశకు చేరే ప్రయత్నం చేయి. ఇప్పటికిప్పుడు ఈ సూచన కష్టంగా అనిపిస్తే, తరవాత మీకే ఇబ్బంది. సైకాలజిస్టులు ఉపయోగించే ‘ఇంపోస్టర్‌ ఫెనామిన్‌’ కావాల్సి వస్తుంది. మీకు అన్వయించేట్లు చెప్పుకోవాలంటే, ఇంజనీరింగ్‌ లక్షణాలన్నీ ఉన్నట్లు భ్రమింపజేసే స్థితికి చేరుకుంటావు. 


నిపుణులతో చర్చించండి

ఒక్కోసారి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రాక్టీసింగ్‌ ఇంజనీర్లకు కూడా అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు నిపుణులతో చర్చిస్తారు. అలాగే విద్యార్థిగా మీకూ కొందరు నిపుణులు అందుబాటులో ఉంటారు. కోర్సు ఇన్‌స్ట్రక్టర్‌ అందులో మొదటి వ్యక్తి. అయితే, అన్ని వేళలా మంచిది కాకపోవచ్చు. గ్రాడ్యుయేట్‌ టీచింగ్‌ అసిస్టెంట్లు, అదే కోర్సును బోధించే ఇతర ప్రొఫెసర్లు, ఇంతకు మునుపు చదివిన విద్యార్థులు, ట్యూటర్లు తదితరులు మీకు అందుబాటులో ఉండే నిపుణులు. సమస్య ఎదురైన వెంటనే వారిలో ఎవరో ఒకరితో మాట్లాడాలి. ఫైనల్‌ పరీక్షల వరకు విషయాన్ని దాచిపెట్టుకోవద్దు. 


చదువు... చదువు... చదువు!

ప్రాక్టికల్‌ ఇలస్ట్రేషన్లు, వివరణలతో కొన్ని పుస్తకాలు క్లిష్టంగా ఉన్న మెటీరియల్‌ను అర్థం చేసుకునే వీలు కల్పిస్తాయి. నిజంగా సమస్య తలెత్తినప్పుడు అలాంటి పుస్తకాలపై దృష్టి సారించండి. అంతే తప్ప హోమ్‌ వర్క్‌ ప్రాబ్లమ్స్‌ కోసం వాటిని వెతకవద్దు. ఒక సబ్జెక్టుపై రిఫరెన్స్‌గా మరొక పుస్తకాన్ని చూడటం లేదంటే వెబ్‌సెర్చ్‌ మంచి వ్యూహం. థియరీలను లోతుగా చదవడం వల్ల మరింత స్పష్టంగా అవి అర్థమవుతాయి. పరిజ్ఞాన పరిధీ పెరుగుతుంది.




Updated Date - 2021-12-13T15:38:57+05:30 IST