నీ జతే నే కోరుకున్నా..!

ABN , First Publish Date - 2021-08-04T06:16:25+05:30 IST

ప్రేమ కథలు అందరికీ ఇష్టమే. కానీ అదే ప్రేమ మన హృదయాన్ని మీటితే..! కథ మరోలా ఉంటుంది. అదీ కరోనా లాంటి మహమ్మారి కమ్మేసిన కాలమైతే..

నీ జతే నే కోరుకున్నా..!

ప్రేమ కథలు అందరికీ ఇష్టమే. కానీ అదే ప్రేమ మన హృదయాన్ని మీటితే..! కథ మరోలా ఉంటుంది. అదీ కరోనా లాంటి మహమ్మారి కమ్మేసిన కాలమైతే..! ఒకరిని ఒకరు కలుసుకొనే వీలు లేక... ప్రేమ పండక... జంటలకు మిగిలేది ఒంటరి గీతమే. ఈ డిజిటల్‌ యుగంలో వర్చువల్‌ ప్రేమలు వర్థిల్లుతున్నా... దానివల్ల పొందే అనుభూతి, అనుభవం పరిమితం. భారత్‌లోని 98 శాతం మంది యువ జంటల అభిప్రాయం ఇదేనట. ముఖ్యంగా శృంగారం విషయంలో! ప్రముఖ ఫ్రాగ్రెన్స్‌ బ్రాండ్‌ ‘ఐటీసీ ఎంగేజ్‌’ తాజాగా జరిపిన సర్వేలో ఈ విషయం తేలింది. సర్వేలో పాల్గొన్న అత్యధిక జంటలు... నిజ జీవిత ప్రేమతో వర్చువల్‌ ప్రేమను ఏమాత్రం పోల్చలేమన్నారు. 


దూరాలు పెంచిన సరికొత్త జీవన శైలిలోనూ సన్నిహితంగా ఉండడానికే ఇష్టపడుతున్నారట యువ ప్రేమికులు. ‘వర్చువల్‌ వర్సెస్‌ రియల్‌ లవ్‌’ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో 63 శాతం మంది దీర్ఘకాల బంధాలకే ఓటు వేశారట. ఇదిలావుంటే మహానగరాల్లోని 24 శాతం మంది డేటింగ్‌కు భౌతిక దూరం సమస్య కాదంటున్నారు. ఇక 80 శాతంమంది ఒంటరి యువతీయువకులు లాక్‌డౌన్‌ ‘ప్రేమ పరిచయాలకు’ బ్రేక్‌ వేసిందని అభిప్రాయపడ్డారు. అప్పుడే చిగురించిన ప్రేమను ముందుకు తీసుకువెళ్లే అవకాశం లేకుండా పోయిందని 70 శాతంమంది బాధను వ్యక్తం చేశారు. ఈ దూరం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడిందని మరికొందరు భావిస్తున్నారనేది సర్వే సారం. అయితే వర్చువల్‌ రొమాన్స్‌... నేరుగా తమ మనసులో మాట చెప్పలేని అంతర్ముఖులు, బిడియస్తులకు బాగా ఉపయోగపడుతుందనేది యాభై శాతం మంది అభిప్రాయం. కానీ ఇందులో ఇబ్బందులు, ప్రమాదాలూ ఉన్నాయని సర్వేలో పాల్గొన్న కొందరు పేర్కొన్నారు. విచిత్రమేమంటే... కొవిడ్‌ దెబ్బకు ‘బీయింగ్‌ టుగెదర్‌, కెమిస్ర్టీ’ వంటి పాజిటివ్‌ పదాల వాడకం 23 శాతం తగ్గిందట. అదే సమయంలో ‘డిఫికల్ట్‌, యాంగ్జైటీ, ఫ్రస్టేటింగ్‌’ తదితర నెగెటివ్‌ పదాల వాడకం 25 శాతం పెరిగిందట. ఏది ఏమైనా... ప్రేమ అనేది భావోద్వేగాలతో మిళితమైన బంధం కనుక... దాన్ని దూరంగా కంటే దగ్గరగా ఆస్వాదిస్తేనే మధురమని అంటున్నారు సీనియర్‌ ప్రేమికులు, లవ్‌గురూలు. 

Updated Date - 2021-08-04T06:16:25+05:30 IST