టికెట్‌ కావాలా నాయనా..!

ABN , First Publish Date - 2022-06-06T06:14:15+05:30 IST

‘వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్‌ కావాలా..? ఏం పరవాలేదు. అంతా మేం చూసుకుంటాం. ఈ నియోజకవర్గంలో సర్వే చేసి, ఎవరికి టికెట్‌ ఇస్తే గెలుస్తారో చెప్పమని మీ పార్టీ మాకు బాధ్యతలు అప్పగించింది

టికెట్‌ కావాలా నాయనా..!

డబ్బులివ్వు.. నేను చూసుకుంటా..

శింగనమల నియోజకవర్గంలో పైసా వసూల్‌


‘వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్‌ కావాలా..? ఏం పరవాలేదు. అంతా మేం చూసుకుంటాం. ఈ నియోజకవర్గంలో సర్వే చేసి, ఎవరికి టికెట్‌ ఇస్తే గెలుస్తారో చెప్పమని మీ పార్టీ మాకు బాధ్యతలు అప్పగించింది. నేనే సర్వే చేయిస్తున్నా. నేనిచ్చే రిపోర్టుతో మీకు టికెట్‌ రావడం ఖాయం. మీరు నన్ను చూసుకోండి. సర్వే రిపోర్టు సంగతి నేను చూసుకుంటా. అన్ని వర్గాల్లో మీకు మద్దతు ఉన్నట్లు నివేదిక ఇస్తా..’ అని ఓ యువకుడు వ్యాపారం మొదలు పెట్టాడు. శింగనమల నియోజకవర్గంలో ఆ యువకుడి బేరసారాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. 

రాజకీయ పార్టీలు రూట్‌ మార్చాయి. మరీ ముఖ్యంగా.. తెలుగుదేశం పార్టీ..! మిగిలిన పార్టీలతో పోలిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజానాడి తెలుసుకుంటారు. బాగా పనిచేసేవారికే ప్రాధాన్యం ఉంటుందని పదే పదే చెబుతుంటారు. పనితీరు తెలుసుకునేందుకు గుట్టుగా సర్వేలు చేయిస్తుంటారు. శింగనమల నియోజకవర్గంలో ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థ సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ఎవరికి టికెట్‌ ఇస్తే మంచి ఫలితం వస్తుందో నివేదిక ఇవ్వాలని ఆ సంస్థను కోరినట్లు సమాచారం. సర్వే టీం బాధ్యతలను తనకు అప్పగించారని బుక్కరాయసముద్రానికి చెందిన ఓ యువకుడు చెప్పుకుంటున్నాడు. నియోజకవర్గంలో ఆశావహులతోపాటు.. పలువురు ద్వితీయశ్రేణి నాయకులకు ఈ యువకుడు ఫోన చేసి, వల విసిరినట్లు తెలిసింది. ‘నియోజకవర్గంలో జరిగే అన్ని సంఘటనలను అధినాయకత్వం దృష్టికి నేనే తీసుకువెళుతున్నా. టికెట్‌ కోసం మీ పేరును సిఫార్సు చేస్తా’ అని నమ్మబలుకుతున్నాడు. ఇప్పటికే పలువురితో  డబ్బు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

- బుక్కరాయసముద్రం


ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు.. 

సర్వేల పేరుతో వచ్చిన వారికి ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. శింగనమల నియోజకవర్గంలో డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శింగనమల నియోజకవర్గంలో డబ్బు వసూళ్ల గురించి పార్టీ అధినాయకత్వానికి తెలియజేస్తాను.

- కాలవ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు


Updated Date - 2022-06-06T06:14:15+05:30 IST