బస్సెక్కితే బాదుడే

ABN , First Publish Date - 2022-04-13T05:30:00+05:30 IST

ఆర్టీసీ చార్జీలు పెరిగాయి.

బస్సెక్కితే బాదుడే

  1.  డీజిల్‌ సెస్సు రూపంలో ఆర్టీసీ చార్జీల పెంపు
  2.  ‘పల్లె వెలుగు’లో కనీస చార్జీ రూ.10
  3.  ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుకు రూ.5
  4.  ఏసీ బస్సు టికెట్‌పై రూ.10 
  5.  రోజూ 2.50 లక్షల మందికిపైగా రాకపోకలు
  6.  ప్రయాణికులపై రూ.15 లక్షల బాదుడు 
  7.  పెరిగిన చార్జీలు ఈ రోజు నుంచే అమలు

ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. కనీస చార్జీ రూ.10కి పెంచారు. డీజిల్‌ సెస్సు రూపంలో మరో రూ.2 వసూలు చేస్తారు. అలాగే ఎక్స్‌ప్రెస్‌ బసెక్కే ప్రయాణికులకు రూ.5, హైటెక్‌ ఆపై సర్వీసుల్లో రూ.10 వసూలు చేస్తారు. పెరిగిన చార్జీలు గురువారం నుంచే నుంచే అమలులోకి వస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రోజుకు 2,50 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. డీజిల్‌ సెస్సు రూపంలో రోజుకు సుమారుగా రూ.15 లక్షలు, నెలకు రూ.4.50 కోట్లు.. ఏడాదికి రూ.55 కోట్లకు పైగా ప్రయాణికులపై భారం పడనుంది


(కర్నూలు-ఆంధ్రజ్యోతి): 

కర్నూలు జిల్లాలో కర్నూలు-1,2, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ఆర్టీసీ డిపోలు, నంద్యాల జిల్లాల్లో నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగానపల్లె, డోన, కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో 869 బస్సులు ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రయాణికులను వివిధ  ప్రాంతాలకు చేర్చే పల్లె వెలుగు బస్సులే 500 దాకా ఉంటే.. ఎక్స్‌ప్రెస్‌ సర్వీలు 200, హైటెక్‌, ఏసీ సర్వీసులు 169 వరకు ఉన్నాయి. ఆయా బస్సు సర్వీసులు ద్వారా ప్రతి రోజూ సగటున 2.50 లక్షల మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే చార్జీ కాదని టోల్‌గేట్‌ సర్‌చార్జి కూడా ప్రయాణికులపై వేస్తున్నారు. ఇది చాలదన్నట్లు డీజిల్‌ ధరలు పెరిగాయంటూ డీజిల్‌ సెస్సు రూపంలో భారీ బాదుడుకు తెర తీశారు. జిల్లా ప్రయాణికులపై రూ.కోట్ల భారం తప్పడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రయాణికులే లక్ష్యంగా కనీసం చార్జీలు పెంచారు. 

 నెలకు రూ.4.50 కోట్లకు పైగా భారం  

ఉమ్మడి జిల్లాలో 12 ఆర్టీసీ బస్సు డిపోలు ఉన్నాయి. రోజుకు సగటున 2.50 లక్షల మందికిపైగా ప్రయాణికులను బస్సు సర్వీసులు వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. వారిలో పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించేవారే దాదాపు 1.50 లక్షలకు పైగా ఉంటారని అంచనా. తాజాగా డీజిల్‌ సెస్సు రూపంలో పల్లె వెలుగు బస్సుకు టికెట్‌పై రూ.2లు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుకు రూ.5, హైటెక్‌, ఏసీ సర్వీసులకు రూ.10 చొప్పున డీజిల్‌ సెస్సు విధిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ లెక్కన జిల్లా ప్రయాణికులపై రోజుకు సగటున రూ.15 లక్షల చొప్పున నెలకు రూ.4.50 కోట్ల అదనపు భారం తప్పదు. ఏడాదికి రూ.54-55 కోట్ల బాదుడుకు ఆర్టీసీ సిద్ధమైంది. 

పల్లె ప్రయాణికులపై  బాదుడే.. బాదుడు

ఆర్టీసీ బస్సుల్లో అధిక శాతం ప్రయాణాలు సాగించేది గ్రామీణ ప్రయాణికులే. ఉమ్మడి జిల్లాల్లో రోజుకు 1.50 లక్షల మందికిపైగా పల్లె వెలుగు సర్వీసులు ద్వారా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం వరకు పల్లె వెలుగు బస్సుల్లో  కనీస చార్జి రూ.5 ఉండేది. ఏకంగా రూ.10 పెంచేశారు. అంతేకాదు.. మరో రూపాయి సేఫ్టీ సెస్‌ వసులు చేస్తారు. దీనిపై అదనంగా రూ.2 డీజిల్‌ సెస్సు ఉంటుంది. ఉదా: కర్నూలు నుంచి పెద్దపాడుకు వెళ్లాలంటే పల్లె వెలుగు బస్సులో కనీసం చార్జీ ఇప్పటి వరకు రూ.5లు ఉంటే నుంచి రూ.13లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన రూ.8లు బాదుడు తప్పడం లేదు. 

 డీజిల్‌ సెస్సు ఇలా :

 సర్వీసులు సెస్సు

 పల్లె వెలుగు రూ.2

ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు రూ.5

హైటెక్‌, ఏసీ సర్వీసు రూ.10

--------------------------------------

ఫ వివిధ సర్వీసుల్లో  కనీస చార్జీలు :

------------------------------------------------

సర్వీసు కనీస చార్జీ

-----------------------------------------------

పల్లె వెలుగు రూ.10

ఆలా్ట్ర పల్లె వెలుగు రూ.10

ఎక్ప్‌ప్రెస్‌ రూ.15

డీలక్స్‌ రూ.20

ఆలా్ట్ర డీలక్స్‌ రూ.20

సూపర్‌ లగ్జరీ రూ.30

ఏసీ సర్వీసులు రూ.40


 సామాన్యుల పరిస్థితి ఏంటి?

ఆర్టీసీ చార్జీలు పెంచుకుంటూ పోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. ఇప్పటికే నిత్యావసర సరుకులు, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ వంటి పెరిగిన ధరలతో అవస్థలు పడుతున్నాం. ప్రస్తుతం ఆర్టీసీ చార్జీల పేరుతో ప్రజలపై భారం వేయడం అన్యాయం. 

- మోహన, మిట్టికందాల గ్రామం, పాములపాడు

  ప్రజలకు భారం 

 పెగిరిన ఆర్టీసీ చార్జీలతో సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పవు. ప్రత్యేకించి ప్రజారవాణా వ్యవస్థపై సామాన్య ప్రజానీకం ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పల్లెవెలుగులో కనీస చార్జీ రూ.10కి పెంచడం, సర్వీసుకు రూ.2, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుకు రూ.5వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలతో ప్రధానంగా సామాన్య ప్రజలకే ఇబ్బందులు ఉన్నాయి. ఇవేమి పట్టించుకోకుండా ఆర్టీసీ చార్జీలను పెంచడం బాధాకరం. 

- రవికుమార్‌, పాములపాడు  


నేటి నుంచి ఆర్టీసీలో రెండు రీజియనలు

  1.  వేర్వేరుగా నంద్యాల, కర్నూలు
  2.  నంద్యాల తొలి ఆర్‌ఎంగా టి.శ్రీనివాసులు

కర్నూలు(రూరల్‌) ఏప్రిల్‌ 13: కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా రెండేసీ చొప్పున రీజియనల ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించింది. కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాలను జిల్లాగా చేయడంతో ఆర్టీసీ రీజియనను విభజించాల్సి వస్తోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గురువారం నుంచి కర్నూలు రీజియన, నంద్యాల రీజయన  రెండు వేర్వేరుగా పరిపాలన కొనసాగనుంది. సిబ్బందితో పాటు అన్ని రకాల శాఖలకు సంబంధించిన సేవలు నంద్యాల రీజయనలో అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కార్యలయంలో పని చేస్తున్న డిప్యూటీ సీటీఎం టి.శ్రీనివాసులును నంద్యాల రీజనల్‌ మేనేజర్‌గా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. నంద్యాల రీజియన ఏర్పడిన తర్వాత తొలి ఆర్టీసీ ఆర్‌ఎంగా ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కర్నూలు రీజియనలో డిప్యూటీ సీటీఎంగా పనిచేస్తున్న సుధాకర్‌కు పార్వతీపురం రీజినల్‌ మేనేజర్‌గా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. ఇక నుంచి డిప్యూటీ సీటీఎం పోస్టులు రీజియనలో ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. కర్నూలు రీజియనలో పని చేస్తున్న పీవో, ఏవో, సీఎంఈలు మాత్రం కొన్ని రోజులు వరకు నంద్యాల, కర్నూలు రీజియనలకు సేవలు అందించనున్నారు. పూర్తి స్థాయిలో పాలన అమల్లోకి వచ్చే వరకు ఈ రెండు శాఖలను కొనసాగించవచ్చని తెలిసింది. 


Updated Date - 2022-04-13T05:30:00+05:30 IST