Congress Presidential Polls: ఖర్గేతో పోటీపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-01T22:39:09+05:30 IST

కాంగ్రెస్ పార్టీ పని తీరులో మార్పు కావాలంటే పార్టీ అధ్యక్షునిగా

Congress Presidential Polls: ఖర్గేతో పోటీపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ పని తీరులో మార్పు కావాలంటే పార్టీ అధ్యక్షునిగా తనను ఎన్నుకోవాలని శశి థరూర్ కోరారు. ఆ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో శశి థరూర్, మల్లికార్జున ఖర్గే పోటీ పడుతున్నారు. ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇతర సీనియర్ నేతలు కూడా ఆయనకే మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో శశి థరూర్ శనివారం ఓ వార్తా సంస్థకు  ఇంటర్వ్యూ ఇచ్చారు. 


 కాంగ్రెస్ ప్రస్తుత పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నవారు మల్లికార్జున ఖర్గేకు ఓటు వేసుకోవచ్చునని, మార్పు కావాలంటే తనకు ఓటు వేయాలని శశి థరూర్ ఆ పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. తమ మధ్య జరుగుతున్నది యుద్ధం కాదని చెప్పారు. తమకు వేర్వేరు ఆలోచనా ధోరణులు ఉన్నాయని చెప్పారు. ఎవరిని ఎన్నుకోవాలో సభ్యులే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ‘‘పార్టీ పని తీరుతో సంతృప్తి చెందితే ఖర్గే గారికే ఓటు వేసుకోండి, మార్పు జరగాలనుకుంటే, పార్టీ విభిన్నంగా పని చేయాలని కోరుకుంటే, నన్ను ఎన్నుకోండి’’ అని చెప్పారు. తమ మధ్య సిద్ధాంతపరమైన సమస్యలేవీ లేవని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ సందేశం ఇకపై కూడా కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం మధ్య సంబంధం గురించి అడిగినపుడు థరూర్ స్పందిస్తూ, పార్టీకి గాంధీ కుటుంబం చాలా ముఖ్యమైనదని, వారికి గుడ్‌బై చెప్పే అవివేకి అయిన కాంగ్రెస్ అధ్యక్షుడెవరూ ఉండరని తెలిపారు. 


ఇదిలావుండగా, ఖర్గేకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో సుమారు 30 మంది సీనియర్ నేతలు ఆయనకే మద్దతు పలుకుతున్నారు. శశి థరూర్‌కు సీనియర్ నేతల మద్దతు కనిపించడం లేదు. 


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 17న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు ఈ నెల 19న జరుగుతుంది. 


Updated Date - 2022-10-01T22:39:09+05:30 IST