రూ.8వేలిస్తేనే రూ.82వేలిస్తా

ABN , First Publish Date - 2022-06-29T05:15:07+05:30 IST

అదనంగా చెల్లించిన ట్యాక్స్‌ డబ్బులు ఇవ్వడానికి రూ.8వేలు డిమాండ్‌ చేశారు. వ్యాపారి నుంచి ఆ మొత్తం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.

రూ.8వేలిస్తేనే రూ.82వేలిస్తా
ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఉద్యోగి బి.లక్ష్మిపతి (వృత్తంలో)


జీఎస్టీ జూనియర్‌ అసిస్టెంట్‌ డిమాండ్‌
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో..
పలాస, జూన్‌ 28:
అదనంగా చెల్లించిన ట్యాక్స్‌ డబ్బులు ఇవ్వడానికి రూ.8వేలు డిమాండ్‌ చేశారు. వ్యాపారి నుంచి ఆ మొత్తం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. కాశీబుగ్గ జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ బి.లక్ష్మిపతి మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల మేరకు.. కవిటి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి జీఎస్టీ నిబంధనల ప్రకారం ముందస్తుగా పన్ను చెల్లించారు. ఏప్రిల్‌ నెలలో రిటర్న్స్‌ చూసుకుంటే రూ.82వేలు అధికంగా చెల్లించినట్లు గుర్తించారు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వాలని కాశీబుగ్గ జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ బి.లక్ష్మిపతిని సంప్రదించారు. తాను ఉన్నతాధికారులకు ఫైల్‌ పంపిస్తేనే డబ్బులు వస్తాయని, ఇందుకోసం తనకు రూ.10వేలు ఇవ్వాలని లక్ష్మిపతి డిమాండ్‌ చేశారు. చివరకు రూ.2వేలు తగ్గించి రూ.8వేలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ నగదు ఫోన్‌పే చేయాలని జూనియర్‌ అసిస్టెంట్‌ కోరగా వ్యాపారి సమ్మతించలేదు. ఈ నేపథ్యంలో వ్యాపారి శ్రీకాకుళం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం మధ్యాహ్నం విధుల్లో ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ చాంబర్‌లో వ్యాపారి రూ.8వేలు ఇస్తుండగా డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. లక్ష్మిపతి నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌ను విచారించి అక్కడున్న పెండింగ్‌ ఫైల్స్‌ను పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ జూనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మిపతిని అరెస్టు చేశామని, బుధవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

నెలలో ఇది రెండోసారి..
నెల క్రితం మున్సిపల్‌ కార్యాలయంలో జూనియర్‌ అకౌంట్‌ అధికారిగా పనిచేస్తున్న జానకిరావు రూ.15వేలు కాంట్రాక్టర్ల నుంచి తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ప్రస్తుతం జీఎస్టీ అసిస్టెంట్‌ కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మిపతి రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి దొరికిపోయారు.


Updated Date - 2022-06-29T05:15:07+05:30 IST