ఆ తలుపులన్నీ తెరిస్తే... ఓ అందమైన కథ పుడుతుంది

ABN , First Publish Date - 2022-05-29T07:18:29+05:30 IST

ఐదేళ్ల వయసులో నాకు నేను ‘రాంబో’లా ఫీల్‌ అయిపోయేవాడ్ని. అమ్మ చున్నీని తలకు చుట్టి, ప్లాస్టిక్‌ గన్‌ పట్టుకొని పరుగులు పెట్టేవాడ్ని.

ఆ తలుపులన్నీ తెరిస్తే... ఓ అందమైన కథ పుడుతుంది

‘క్షణం’ ‘గూఢచారి’ ‘ఎవరు’ ఈ సినిమాలు చూస్తే చాలు.. అడవి శేష్‌ అంటే ఏమిటో అర్థమైపోతుంది.నలుగురిలా ఆలోచించడం, ట్రెండ్‌ని ఫాలో అయిపోవడం ఏమాత్రం చేతకాని నటుడు అడవి శేష్‌. అందుకే తనదంటూ ఓ దారి వేసుకొన్నాడు. తనతోనే పోటీ పడుతూ పరుగులు తీస్తున్నాడు. శేష్‌ నుంచి మరో వైవిధ్యభరితమైన సినిమా వస్తోంది. అదే ‘మేజర్‌’. 26/11 ముంబయి దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కాపాడి అమరుడైన మేజర్‌  సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఇది. 3న ‘మేజర్‌’ రిలీజ్‌ అవుతున్న సందర్భంగా అడవి శేష్‌తో సంభాషించింది ‘నవ్య’. ఆ సంగతులు ఇవీ...


సినిమా అనగానే మీ కళ్ల ముందు మెదిలే దృశ్యం ఏమిటి? 

ఐదేళ్ల వయసులో నాకు నేను ‘రాంబో’లా ఫీల్‌ అయిపోయేవాడ్ని. అమ్మ చున్నీని తలకు చుట్టి,  ప్లాస్టిక్‌ గన్‌ పట్టుకొని పరుగులు పెట్టేవాడ్ని.  గన్‌లతో ఫైట్స్‌ చేస్తున్నట్టు నటించే వాడిని. సినిమా అంటే నాకు గుర్తొచ్చే విజువల్‌ అదే. అప్పటి నుంచీ నాకు సినిమా అంటే ప్యాషన్‌. అది తప్ప ఇంకేం తెలీదు.


సినిమాల్లోకి రాగానే  మీ అభిప్రాయాల్లో మార్పులు ఏమైనా వచ్చాయా?

నేనోసారి ఓ నేషనల్‌ పార్క్‌కి వెళ్లా. అక్కడో చిరుత పులి చెట్టెక్కి ప్రశాంతంగా కూర్చుని ఉంది. అప్పుడు రియలైజ్‌ అయ్యిందేమిటంటే.. ‘ఈ క్షణంలో బతకడం చాలా ముఖ్యం’ అని. అప్పటి నుంచీ.. ఇప్పటి వరకూ ఏ క్షణంతోనూ.. నాకు పోలికల్లేవు. చిన్నప్పటితో పోలిస్తే నా ఆలోచనా ధోరణి మారిందా? సినిమాపై ప్రేమ పెరిగిందా, లేదా? అనే లెక్కలేసుకోవడం లేదు. 


రచయితగా మీరో కథ రాస్తున్నప్పుడు మీరు పడే స్ట్రగుల్‌ ఎలా ఉంటుంది?

చాలా ఫ్రస్ర్టేషన్‌ ఉంటుంది. నచ్చినట్టు రాదు. అదో గోడలా ఉంటుంది. చేత్తో గుద్దుతూనే ఉంటాను. అదెందుకు బద్దలవ్వడం లేదన్న కోపం, చిరాకు, అసహనం అన్నీ ఉంటాయి. సడన్‌గా ఓ రోజు చూస్తే ఆ పక్కనే ఓ తలుపు కనిపిస్తుంది. దాంట్లోంచి హాయిగా బయటకు వచ్చేస్తే.. మరో గోడ కనిపిస్తుంది. కథ ఇంతే. లాజిక్‌ తెలియనంత వరకూ గోడలా ఉంటుంది. తెలిస్తే... కావల్సిన తలుపులన్నీ తెరచుకుంటుంటాయి. అప్పుడే ఓ అందమైన స్ర్కిప్టు వస్తుంది.


అలా బద్దలవ్వని గోడలు ఎదురైతే, కథని మధ్యలోనే వదిలేసిన సందర్భాలు ఉన్నాయా?

చాలా ఉన్నాయండీ. ఎప్పటి నుంచో.. ఓ బ్యాంక్‌ రాబరీ కథ చెప్పాలనే కోరిక ఉంది. ఎన్నిసార్లు రాసినా.. నచ్చినట్టు వచ్చేది కాదు. ఈమధ్యే దానిక్కూడా  ఓ తలుపు దొరికింది. తప్పకుండా ఆ కథ చెబుతా.


మిగిలిన హీరోలతో మీరు చాలా భిన్నంగా కనిపిస్తారు. ఇది కావాలని తీసుకొన్న నిర్ణయమా?

మిగిలిన హీరోలతో నేను పోటీ పడాలనుకోవడం లేదండీ. నా పరుగు నాతోనే. నిన్న పది కిలోమీటర్లు పరుగెడితే... ఈరోజు పదకొండు కిలో మీటర్లు నా లక్ష్యం. 


మీ కథలు మీరే రాసుకుంటుంటారు. మీలో ఓ దర్శకుడు కూడా ఉన్నాడు. కాబట్టి సెట్లో మీలో నటుడికీ, రచయితకీ, దర్శకుడికీ మధ్య సంఘర్షణ జరిగే అవకాశం ఉందా?

లేదండీ. నా వరకూ నేనో విజయవంతమైన కథానాయకుడిని. ఓ మంచి రచయితని. కానీ... ఓ విఫలమైన దర్శకుడ్ని. నా డైరెక్షన్‌ అంటే నాకే భయం.. (నవ్వుతూ). కాబట్టి నాలో దర్శకుడ్ని పూర్తిగా పక్కన పెట్టేశా. రచయితగా నా పని అయిపోయిన తరవాతే సెట్లో అడుగుపెడతా కాబట్టి.. అక్కడ నేను కేవలం నటుడ్ని మాత్రమే. 


అంటే మీలోని బలహీనతలు మీకు పూర్తిగా అర్థమయ్యాయన్నమాట..?

నూటికి నూరుశాతం. మన లోపాల్ని గుర్తించి సెట్‌ చేసుకుని ముందుకు వెళ్లడమే అసలైన విద్య, ఆస్ర్టేలియా సిరీ్‌సలో సచిన్‌ వరుసగా విఫలమవుతూ ఉన్నప్పుడు.. ఆఫ్‌ సైడ్‌ పడిన బంతుల్ని ఆడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. దాన్ని అమలు చేశాడు కూడా.  ఆ నిర్ణయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. నేనూ దర్శకత్వం వదిలేసి.. అలాంటి నిర్ణయమే తీసుకొన్నా.


మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితంలో మిమ్మల్ని అమితంగా ప్రభావితం చేసిన విషయాలేంటి?

ఒకటని కాదండీ. చాలా ఉన్నాయి. ఆయన కథంతా వింటే.. నిజంగా ఇలాక్కూడా మనుషులు ఉంటారా? ఇంత ఉన్నతంగా జీవిస్తారా? అనిపిస్తుంది. కొన్ని సంఘటనల్ని అస్సలు నమ్మలేం. అవన్నీ సినిమాల్లో చూపిస్తే.. ‘ఏదో హీరోయిజం కోసం కల్పించిన సీన్లు’ అనుకుంటారు. నిజానికి బయోపిక్‌ తీసేటప్పుడు కొన్ని సీన్లు ఎలివేషన్ల కోసం రాసుకుంటుంటారు. కానీ ‘మేజర్‌’లో ఆ అవసరమే రాలేదు. మేమే కావాలని కొన్ని సన్నివేశాలకు కత్తెర్లు వేయాల్సివచ్చింది. ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలన్నీ తీస్తే.. పది సినిమాలవుతాయి. 


పార్టీలు, పబ్‌ల కల్చర్‌కి దూరంగా ఉంటారెందుకు?

నాకు ఏ అలవాట్లూ లేవు. సిగరెట్‌ కూడా తాగను. ఇలాంటివాడ్ని పార్టీలకు ఎందుకు పిలుస్తారు? నా సినిమా హిట్టయి, సెలబ్రేషన్‌ చేసుకోవాలనుకుంటే.. ఓ చల్లని సోడాలో నిమ్మకాయ పిండుకుని, ఓ మంచి సినిమా చూస్తూ గడుపుతా.

అన్వర్‌




‘‘ఓటీటీ ఆడియన్స్‌, మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులు అనే వ్యత్యాసం ఏమీ లేదు. సినిమా బాగుంటే ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తారు. సినిమాపై నమ్మకం ఉంటే చాలు. ఆ నమ్మకంతోనే ‘మేజర్‌’ ప్రీమియర్లని పది రోజుల ముందు గానే ప్రదర్శించాం. నా ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలు మీకు నచ్చి ఉంటే, అందుకు పదిరెట్లు ‘మేజర్‌’ నచ్చుతుంది. ఇది సినిమా కాదు.. 

ఓ సెలబ్రేషన్‌’’

Updated Date - 2022-05-29T07:18:29+05:30 IST