‘పట్టు’కుంటే సిరులే

ABN , First Publish Date - 2022-05-17T05:30:00+05:30 IST

రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. తక్కువ పెట్టుబడి.. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసి లాభాలు ఆర్జించే విధంగా రైతుల్లో చైతన్యం నింపుతున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేసినప్పటికి కోతులు, అడవి పందులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిళ్లుతున్నాయి. దీంతో కొంతమంది రైతులు పంట మార్పిడి వైపు దృష్టి సారించి మల్బరీ పంట సాగుకు పూనుకున్నారు. పట్టుగూళ్లకు విపరీతమైన ధర ఉండటంతో రైతులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి.

‘పట్టు’కుంటే సిరులే

పట్టుపురుగుల పెంపకం, మల్బరీ తోటల సాగుపై రైతుల ఆసక్తి

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు జీవనోపాధి 

పట్టు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానం


తొగుట, మే 17 : రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. తక్కువ పెట్టుబడి.. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసి లాభాలు ఆర్జించే విధంగా రైతుల్లో చైతన్యం నింపుతున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేసినప్పటికి కోతులు, అడవి పందులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిళ్లుతున్నాయి. దీంతో కొంతమంది రైతులు పంట మార్పిడి వైపు దృష్టి సారించి మల్బరీ పంట సాగుకు పూనుకున్నారు. పట్టుగూళ్లకు విపరీతమైన ధర ఉండటంతో రైతులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. 


జిల్లాలో 748 ఎకరాల్లో మల్బరీ తోటలు

తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో తక్కువ విస్తీర్ణంలోనే మల్బరీ తోటలు సాగయ్యేవి. నేడు రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. తొగుట మండలం వేములఘాట్‌ గ్రామంలో సుమారు వంద ఎకరాల్లో, పెద్దమాసాన్‌పల్లి గ్రామంలో 25 ఎకరాల్లో పంట సాగు చేసి జిల్లాలోనే అప్పట్లో రైతులు ప్రథమ స్థానంలో ఉండేవారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంతో వేములఘాట్‌ ముంపునకు గురైంది. ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో 35 ఎకరాలు, మిరుదొడ్డి మండలంలో 37, దౌల్తాబాద్‌ మండలంలో 10, దుబ్బాక మండలంలో 20 ఎకరాల్లో మల్బరీ తోటలను  రైతులు సాగుచేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం 748 ఎకరాల్లో మల్బరీ సాగవుతుండగా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోనే వంద ఎకరాల్లో పంట సాగు చేస్తూ జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 


లాభాలు ‘పట్టు’కుంటున్నారు

మల్బరీ సాగుతో రైతులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వేతనంతో సమానంగా నెలకు ఆదాయం పొందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో సుమారు 350 కుటుంబాలు మల్బరీ తోటలను సాగు చేసి నెలకు 50 వేల నుంచి లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఒక ఎకరా మల్బరీ తోటలో ఉత్పత్తి చేసే పట్టుగూళ్ల ద్వారా ఏడాదికి రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఒక ఎకరా వరి సాగు చేసే నీటితో 3 నుంచి 4 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ తోటలను సాగు చేసుకోవడానికి వీలవుతుంది. ఒకసారి మల్బరీ తోటను నాటితే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పట్టుగూళ్లను ఉత ్పత్తి చేసుకునే అవకాశముంటుంది. ఒక ఎకరానికి సుమారు 5,500 మొక్కలు అవసరపడతాయి.


నిరుద్యోగులు పట్టు పరిశ్రమ వైపు మొగ్గు

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఉద్యోగాల కోసం విసిగి వేసారి పట్టు పరిశ్రమ వైపు మొగ్గు చూపారు. మల్బరీ తోటలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. పట్టు పరిశ్రమ వల్ల ప్రతీ నెల ఆదాయం పొందే అవకాశం ఉంది. ఏడాదికి కనీసం 5 నుంచి 10 పంటలు తీసుకోవచ్చు. పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోంది. డ్రిప్‌, స్ర్పింక్లర్‌, షెడ్డు నిర్మాణానికి రాయితీపై నిధులు మంజూరు చేస్తుంది. మల్బరీ తోటల పెంకానికి ఉపాధి హామీని సైతం అనుసంధానం చేశారు.


ఉపాధి బాగుంది

 మల్బరీ తోట లాభదాయకంగా ఉంది. ఇంతకు ముందు ఏ పంట వేసిన చేతికి అందుతదో లేదో అని భయ ముండే. ఇపుడు ఆ దిగులు పోయింది. ఇటీవలనే మల్బరీ పంట సాగుచేసిన. నెలనెల ఆదాయం వస్తుంది. మా కుటుంబానికి ఉపాధి దొరికింది.

-బొగ్గుల నర్సింహులు, చంద్లాపూర్‌


రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నాం

మల్బరీ తోటలు సాగుచేసే రైతులకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తున్నాం. గతంలో కంటే ఇపుడు  జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ కు సమానంగా  రైతులకు ఆదాయం వస్తుంది. జిల్లాలో 350 కుటుంబాలు పట్టు పరిశ్రమ పై ఆధారపడి జీవిస్తున్నారు.

- నిమ్మ ఇంద్రసేనారెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ సంచాలకులు

Updated Date - 2022-05-17T05:30:00+05:30 IST