మేల్కోకుంటే.. ముప్పే..!

ABN , First Publish Date - 2020-09-17T11:00:44+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాల కేంద్రంలో సుమారు 540 మంది అభ్యర్థులు ఈనెల 20వ తేదీ నుంచి గ్రామ సచివాలయ పరీక్షలు రాయనున్నాయి. అంతమందికి ఒక్క థర్మల్‌ స్కానర్‌తో టెస్ట్‌ చేసి, పంపాలంటే..

మేల్కోకుంటే.. ముప్పే..!


20 నుంచి సచివాలయ ఉద్యోగాల పరీక్షలు

387 కేంద్రాల ఏర్పాటు..

హాజరుకానున్న 70,714 మంది..

కరోనా వేళ జాగ్రత్తలు చేపట్టకుంటే.. సమస్యలే..

అధికారులకే వైరస్‌ నివారణ సామగ్రి..

అభ్యర్థుల ఆరోగ్యం గాలికి..

నేటికీ సరఫరా కాని థర్మల్‌ గన్స్‌..

ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ..


అనంతపురం విద్య, సెప్టెంబరు 16:

జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాల కేంద్రంలో సుమారు 540 మంది అభ్యర్థులు ఈనెల 20వ తేదీ నుంచి గ్రామ సచివాలయ పరీక్షలు రాయనున్నాయి. అంతమందికి ఒక్క థర్మల్‌ స్కానర్‌తో టెస్ట్‌ చేసి, పంపాలంటే.. అర గంట నుంచి గంట సమయం పడుతుంది. థర్మల్‌ గన్‌ కూడా ఒక్కటీ సరఫరా చేయలేదు. పరీక్షల నిర్వహణపై అధికారులు చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. మరో మూడు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వేలాది మంది అభ్యర్థులు, అధికారులు హాజరుకానున్నారు. ప్రభుత్వం మాత్రం అధికారులు మినహా..


పరీక్షలకు హాజరయ్యే 70 వేల మంది అభ్యర్థుల ప్రాణాలకు హామీ ఇవ్వలేమన్నట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 20 నుంచి 26వ తేదీ వరకూ 7 రోజులపాటు సాగే పరీక్షలకు జిల్లా నలుమూలల నుంచి అభ్యర్థులు హాజరు కానున్నారు. మాస్కులు, గ్లౌజులు అధికారులకు సరిపడా మాత్రమే సరఫరా చేశారు. అభ్యర్థులను గాలికొదిలేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. థర్మల్‌ గన్స్‌ నేటికీ రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.


నిత్యం 15 వేల మంది వరకూ..

సచివాలయ పరీక్షలకు ఏకంగా 70,714 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 5488 మంది జిల్లా ప్రత్యేకాధికారులు, రూట్‌ ఆఫీసర్లు, పరీక్షాకేంద్రం ప్రత్యేకాధికారులు, ఇతర సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. వీరికితోడు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వెంట వారి తల్లిదండ్రులు, బంధువులు, సన్నిహితులు రానున్నారు. ఈ లెక్కన రోజూ 12 వేల నుంచి 15 వేల మంది వరకూ పరీక్షా కేంద్రాలకు రానున్నారు.


కరోనా వ్యాప్తి మొదలయ్యాక జిల్లాలో ఇంత భారీస్థాయిలో పరీక్షలు నిర్వహించటం ఇదే ప్రథమం. కరోనా నివారణ చర్యలు లేవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల ఆరోగ్య భద్రత గాలికేనన్న విషయం స్పష్టమవుతోంది.

థర్మల్‌ గన్స్‌ ఏవీ?


జిల్లాలో పరీక్షల సందర్భంగా పీపీఈ కిట్లు 300, సర్జికల్‌ గ్లౌజులు 2000, మాస్కులు 10 వేలు, శానిటైజర్‌ 180 ఎంఎల్‌ లేదంటే 200 ఎంఎల్‌ 250 కిట్లు మాత్రమే సరఫరా చేశారు. ఇవన్నీ పరీక్షల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి మాత్రమే సరఫరా చేసినట్లు సమాచారం. అభ్యర్థులను పూర్తిగా విస్మరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 387 కేంద్రాల వద్ద ఉదయం, మధ్యాహ్నం థర్మల్‌ గన్స్‌తో అభ్యర్థుల ఉష్ణోగ్రతలు పరీక్షించి, కేంద్రాల్లోకి పంపాలి. ఇంతవరకూ అలాంటి గన్స్‌ సరఫరా చేయలేదు.


దీనిని బట్టి చూస్తుంటే.. అభ్యర్థుల ఆరోగ్య భద్రతను ప్రభుత్వం విస్మరించిందన్న విమర్శలు వస్తున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల్లో చాలామంది స్ర్కైబ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో వారికి స్రైబ్‌ను అందుబాటులో ఉంచటం పెద్ద సమస్యగా మారింది.


ముందుచూపు లేకుంటే..

జిల్లావ్యాప్తంగా 5 క్లసర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. జడ్పీలోని డీపీఆర్సీ భవన సముదాయంలో స్ట్రాంగ్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. అందులో 146 బండిళ్ల ఓఎంఆర్‌ షీట్లు, నామినల్‌ రోల్స్‌ను భద్రపరిచారు. దానిని శాటిలైట్‌ సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టకుంటే అక్రమాలకు తెరలేస్తుందని గత అనుభవాలే చెబుతున్నాయి.


గతేడాది పరీక్షల సందర్భంగా రాయదుర్గం ప్రాంతంలో ఓ అభ్యర్థి సాక్సుల్లో సెల్‌ఫోన్‌ తీసుకొచ్చి కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. దీనిపై అప్పట్లో పెద్దదుమారం రేగింది. కేంద్రాల్లో క్లాక్‌రూమ్స్‌ ఏర్పాటు చేయకపోవటంతో అభ్యర్థులు నిరసనలు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు గుణపాఠాలు నేర్వాలనీ, అభ్యర్థుల ఆరోగ్య భద్రతను పట్టించుకోవాలని కోరుతున్నారు. పరీక్షల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే.. మరింత మూల్యం చెల్లించక తప్పదనటంలో సందేహం లేదు.


అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం:

శ్రీనివాసులు, డిప్యూటీ సీఈఓ

సచివాలయ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. ఇప్పటికే నామినల్‌ రోల్స్‌, ఓఎంఆర్‌ షీట్లు వచ్చాయి. వాటిని భద్రపరిచాం. త్వరలో ప్రశ్నపత్రాలు రానున్నాయి. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్‌ సైతం అందుబాటులో ఉంచుతున్నాం. పకడ్బందీగా పరీక్షలు సాగేలా చర్యలు చేపడతాం.


Updated Date - 2020-09-17T11:00:44+05:30 IST