రెండేళ్లుగా పట్టించుకోకుంటే ఎలా‘గండి’!

ABN , First Publish Date - 2022-08-08T06:08:13+05:30 IST

కళ్లెదుట కావలసినంత నీరున్నా.. ఆ వ్యవసాయ పొలాలకు తడులు అందడం లేదు. ఫలితంగా వరుణుడు కరుణిస్తేనే పంట పండే పరిస్థితులు నెలకొనడంతో ప్రతిసారీ అన్నదాతలు ఆకాశం వంక ఆశగా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంటోంది.

రెండేళ్లుగా పట్టించుకోకుంటే ఎలా‘గండి’!
శ్రీరాంపురం సమీపంలో రాజవరం కాలువకు గండి పడిన దృశ్యం

 2020లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రాజవరం సాగునీటి కాలువ 

 సుమారు 200 ఎకరాలకు నీరు అందని దుస్థితి

 అన్నదాతలు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునేవారు కరువు

 తాత్కాలిక పనులకూ.. ఎవరూ ముందుకు రావడం లేదన్న ఏఈ           

పాయకరావుపేట రూరల్‌, ఆగస్టు 7: కళ్లెదుట కావలసినంత నీరున్నా.. ఆ వ్యవసాయ పొలాలకు తడులు అందడం లేదు. ఫలితంగా వరుణుడు కరుణిస్తేనే పంట పండే పరిస్థితులు నెలకొనడంతో ప్రతిసారీ అన్నదాతలు ఆకాశం వంక ఆశగా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంటోంది.  మండలంలోని రాజవరం సాగునీటి కాలువ (తమ్మన్న కాలువ)కు రెండు సంవత్సరాల కిందట గండిపడింది. ఇంతవరకు ఇటు అధికారులుగానీ, అటు ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోక పోవడంతో  సుమారు రెండు వందల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ మైనా మరమ్మతులు చేపట్టేవారు కరువయ్యారు. 

ముఠా ఆనకట్ట కాలువ నుంచి రాజవరం కాలువకు నీరు ప్రవహిస్తుంది. రాజవరం కాలువ తాండవ నదిని ఆనుకుని ఎగువన ప్రవహిస్తుంది. అయితే రెండు సంవత్సరాల కిందట కురిసిన భారీ వర్షాలకు ఖరీఫ్‌ చివరిలో శ్రీరాంపురం గ్రామ సమీపంలో కాలువకు గండి పడింది. కాలువ మెరకగా ఉండడం, కాలువకు, తాండవ నదికి మధ్యన ఉన్న గట్టుకు గండిపడడంతో నీరంతా నదిలోకి చేరుతోంది. ఆ ఏడాది రైతులు నష్టపోకుండా తాత్కాలికంగా గండి పూడ్చాలని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అధికారులను ఆదేశించడంతో ఇసుక బస్తాలతో గండి పూడ్చి సాగునీరందించారు. అయితే కొద్ది రోజులకే ఇసుక బస్తాలు కొట్టుకు పోవడంతో మళ్లీ కాలువకు గండి పడింది. నాటి నుంచి గండిని పూడ్చకపోవడంతో గత ఏడాది రాజవరం రైతులు వరి నాట్లు వేయకుండా భూములను బీడుగా వదిలేశారు. ఈ ఏడాదైనా గండిని పూడ్చి, సాగునీరందించాలని రైతులు అధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. గతంలో ఈ కాలువ మెరకగా ఉండడంతో గట్టుకు గండి పడకుండా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాంక్రీటుతో గోడ నిర్మించారు. 

ఇదిలావుంటే, ఈ అంశాన్ని ఏఈ లోకేశ్‌ వద్ద ప్రస్తావించగా, కాలువకు గట్టు కట్టడానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా మండల పరిషత్‌ నిధుల నుంచి గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టామని, అయితే పనులు చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-08T06:08:13+05:30 IST