గూఢచర్యం గురించి అడుగుతుంటే.. భద్రత అంటారేం?

ABN , First Publish Date - 2021-09-14T09:05:58+05:30 IST

పెగాసస్‌ స్పైవేర్‌ వినియోగం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గూఢచర్యం జరిగిందో లేదో చెప్పేందుకు కొత్తగా అఫిడవిట్‌ దాఖలు చేయడానికి కేంద్రం విముఖత వ్యక్తంచేయడంతో.

గూఢచర్యం గురించి అడుగుతుంటే.. భద్రత అంటారేం?

  • పదే పదే దేశ భద్రత ప్రస్తావన ఎందుకు?
  • కేంద్రంపై చీఫ్‌ జస్టిస్‌ రమణ ఆగ్రహం
  • ‘పెగాస్‌స’పై 2-3 రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు
  • ఆలోపు మనసు మార్చుకుంటే చెప్పండి
  • సొలిసిటర్‌ జనరల్‌ మెహతాకు సూచన
  • మధ్యంతర తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం
  • కొత్త అఫిడవిట్‌ వేయం: ఎస్‌జీ మెహతా
  • కేవలం గూఢచర్యమే కాదు.. 
  • ఇంప్లాంట్స్‌ కూడా చొప్పించవచ్చు
  • జగదీప్‌ చొక్కర్‌ తరఫు లాయర్‌ వెల్లడి
  • ప్రభుత్వ కమిటీకి ఫోన్లు ఎలా ఇస్తాం?
  • జర్నలిస్టు అబిది తరఫు న్యాయవాది ప్రశ్న


వ్యక్తులపై గూఢచర్యం గురించి మేం అడుగుతుంటే జాతీయ భద్రత గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అనవసర అంశాల ప్రస్తావనతో సమస్య పరిష్కారం కాదు. అఫిడవిట్‌ దాఖలుచేస్తే కేంద్రం వైఖరి తెలిసేది. తదుపరి కార్యాచరణ గురించి ఆలోచించేవాళ్లం. ఇక మిగిలింది మధ్యంతర ఉత్తర్వుల జారీయే.

- చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పెగాసస్‌ స్పైవేర్‌ వినియోగం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గూఢచర్యం జరిగిందో లేదో చెప్పేందుకు కొత్తగా అఫిడవిట్‌ దాఖలు చేయడానికి కేంద్రం విముఖత వ్యక్తంచేయడంతో.. రెండు మూడు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. వ్యక్తులపై గూఢచర్యం గురించి తాము అడుగుతుంటే జాతీయ భద్రత గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ టెక్నాలజీ ద్వారా 300 మంది రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులపై కేంద్రప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని.. దీనిపై కేబినెట్‌ కార్యదర్శి నుంచి అఫిడవిట్‌ కోరాలని.. విశ్రాంత న్యాయమూర్తి సారథ్యంలో స్వతంత్ర కమిటీ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ద్వారా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పలు కేసులు దాఖలైన సంగతి తెలిసిందే. కేంద్రం తరఫున పరిమిత అఫిడవిట్‌ మాత్రమే దాఖలు కావడంతో.. మనసు మార్చుకుని సవివర అఫిడవిట్‌ వేయడానికి ధర్మాసనం సమయమిచ్చింది. సోమవారం ఆ వ్యాజ్యాలు మళ్లీ విచారణకు వచ్చినప్పుడు.. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. తాము దాచడానికి ఏమీ లేదని.. అయితే దేశభద్రతకు సంబంధించిన అంశం.. కోర్టుల్లో గానీ, బహిరంగంగా గానీ చర్చనీయాంశం కారాదని.. అఫిడవిట్‌లో ఆ వివరాలు పొందుపరచరాదని పేర్కొన్నారు. గూఢచర్యంపై పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటుచేస్తామన్న ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. ‘ఉదాహరణకు నేనీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం లేదని చెప్పాననుకోండి.. అప్పుడు టెర్రర్‌ గ్రూపులు అప్రమత్తమవుతాయి. 


ఒకవేళ వినియోగిస్తున్నానని చెబితే.. ప్రతి సాఫ్ట్‌వేర్‌కు కౌంటర్‌సాఫ్ట్‌వేర్‌ ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. టెర్రర్‌ గ్రూపులు ముందస్తు చర్యలు చేపడతాయి. అందుచేత ప్రభుత్వ కమిటీని వేయనివ్వండి. అది పరిశీలించి కోర్టుకే నివేదిక సమర్పిస్తుంది’ అన్నారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ రమణ స్పందిస్తూ.. ‘భద్రత/రక్షణ అంశాలు తెలుసుకోవాలన్న ఆసక్తి మాకు లేనే లేదని మళ్లీ మళ్లీ చెబుతున్నాం. చట్టం అనుమతించిన దానికి భిన్నంగా ప్రభుత్వం గూఢచర్యానికి వేరే ఏదైనా పద్ధతి ఉపయోగించిందో తెలుసుకునేందుకు జర్నలిస్టులు, కార్యకర్తలు మా ముందుకొచ్చా రు. మేం దీనికే పరిమితం’ అని చెప్పారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ కూడా ఇదే ప్రస్తావించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రసాదించిన గోపనీయ హక్కు ఉల్లంఘన జరిగిందని పౌరులు తమను ఆశ్రయించారని, జరిగిందో లేదో స్పష్టంచేస్తూ పరిమిత అఫిడవిట్‌ వేయాలనే తామూ అడుగుతున్నామని అన్నారు. అనధికారికంగా ఫోన్లు వినడంలాంటివేమీ జరగలేదని, ఇదే విషయాన్ని తొలుత దాఖలుచేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేశామని, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంటులోనూ విస్పష్ట ప్రకటన చేశారని సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. అయితే ఈ వ్యవహారం ముఖ్యమైనందునే కమిటీ ఏర్పాటుకు సిద్ధమయ్యామన్నారు. ‘తమ ప్రైవసీకి భంగం కలిగిందని కొందరు అంటున్నారు. 


దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. లోతుగా పరిశీలించేందుకే కమిటీ వేస్తామంటోంది’ అన్నారు. అయితే కమిటీ నియామకం, దర్యాప్తు ఇక్కడ ప్రశ్న కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసి ఉంటే దాని వైఖరి తమకు తెలిసి ఉండేదని, పౌరుల ఫోన్లు వినడం వంటి వాటికి నిర్ధిష్ట ప్రక్రియ ఉందని గుర్తుచేసింది. ‘ప్రభుత్వం నుంచి అఫిడవిట్‌ కావాలని క్రితంసారి అడి గాం. అందుకే మీకు సమయం ఇచ్చాం. మీరిప్పుడు ఇలా చెబుతున్నారు. మనం మళ్లీ మళ్లీ వెనక్కి పోతున్నాం. జాతీయ భద్రత గురించి తెలుసుకోవాలని మేం అనుకోవడంలేదని పునరుద్ఘాటిస్తున్నాం. తమ ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని పౌరు లు మా ముందుకొచ్చారు. మేం ఏదో ఒకటి చేయాలి. మీరే ఇంకేదో చెప్పాల్సి ఉంది’ అని చీఫ్‌ జస్టిస్‌ స్పష్టం చేశారు. చెప్పడానికేం లేదని మెహతా పేర్కొనగా.. ప్రధాన న్యాయమూర్తి సీరియస్‌ అయ్యారు. ‘అఫిడవిట్‌ దాఖలు చేస్తే కేంద్రం వైఖరి తెలిసేది. తదుపరి కార్యాచరణ గురించి ఆలోచించేవాళ్లం. అనవసర అంశాల ప్రస్తావనతో సమస్య పరిష్కారం కాదు. ఇక మిగిలింది మధ్యంతర ఉత్తర్వుల జారీయే’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2, 3 రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని, ప్రభుత్వం పునరాలోచించుకుంటే చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌కు సూచించారు. మధ్యంతర తీర్పును రిజర్వు చేశారు.


తప్పుడు డేటాను కూడా చొప్పించవచ్చు!

పెగాసస్‌ స్పైవేర్‌ టెక్నాలజీ వైర్‌ ట్యాపింగ్‌ వంటిది కాదని సామాజిక కార్యకర్త జగ్‌దీప్‌ చొక్కర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ తెలిపారు. ఫోన్లో తప్పుడు డేటా, తప్పుడు డాక్యుమెంట్లను కూడా ఇంప్లాంట్‌ చేయగలదన్నారు. ‘ఏదైనా విదేశీ సంస్థ పెగాస్‌సను మోహరిస్తే తన పౌరులను రక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదే. భారత సర్కారే వినియోగిస్తున్నట్లయితే.. ఐటీ చట్టం ప్రకారం అలా చేయడానికి వీల్లేదు’ అని స్పష్టం చేశారు. 


తప్పుడు ఆరోపణలైతే కమిటీ ఎందుకు?

పెగాసస్‌ విషయంలో కేంద్రం పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇస్తోందని పరంజయ్‌ గుహ తకుర్తా తరఫు సీనియర్‌ న్యాయవాది దినేశ్‌ ద్వివేది ఆరోపించారు. ‘ఓ వైపు మా ఆరోపణలు నిరాధారమంటోంది. మరోవైపు ఆరోపణలు తీవ్రమైనవి కాబట్టి కమిటీ వేస్తామంటోంది. తకుర్తా ఫోన్‌పై నిఘా వేసిన విషయాన్ని ప్రభుత్వం ఖండించడం లేదు. ఆయన జర్నలిస్టు. స్నూపింగ్‌ జరిగి ఉంటే జర్నలిస్టు గోపనీయ హక్కునే కాదు.. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కునూ ఉల్లంఘించినట్లే’ అన్నారు.


విశ్వసనీయత ఏంటి?

ఆరోపణల పరిశీలనకు ప్రభుత్వ కమిటీని అనుమతించడం దాని విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని మరో జర్నలిస్టు ఎస్‌ఎన్‌ఎం అబిది తరఫు సీనియర్‌ న్యాయవాది రాజేశ్‌ ద్వివేది అన్నారు. కమిటీ ఏర్పాటుకు అనుమతిస్తే మీ ఫోన్లు పరిశీలించాలని పిటిషనర్లను అది కోరుతుందని.. ప్రభుత్వ కమిటీకి వాటిని ఇవ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సదరు స్పైవేర్‌ను పిటిషనర్లపై తాను ఉపయోగించలేదని ప్రభుత్వం ఓ ప్రకటన చేస్తే విషయం అంతటితో ముగిసేదన్నారు. ‘అందుచేత పెగాసస్‌ స్పైవేర్‌ను వినియోగించారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వ కమిటీ కాకుండా న్యాయమూర్తులే దీనిపై దర్యాప్తు జరపాలి’ అని కోర్టును అభ్యర్థించారు. జాతీ య భద్రతను దెబ్బతీయాలని తాము అనుకోవడం లేదని సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కూడా తెలిపారు. అయితే పెగాస్‌సను ఉపయోగించడం, సాధారణ పౌరులను టార్గెట్‌ చేయడం తీవ్రమైన విషయమన్నారు. సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిటాస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మీనాక్షి అరోరా వాదించారు.

Updated Date - 2021-09-14T09:05:58+05:30 IST