Abn logo
Sep 25 2021 @ 00:22AM

కోడికూరతో వెజ్‌ కూడితే!

ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్‌ పైకి మనసు లాగేస్తుంటుంది. అయితే ప్రతి వారం చికెన్‌ కర్రీ అంటే ఎవరికైనా బోర్‌ కొడుతుంది. అందుకే ఈ వారం కోడికూరతో వెజ్‌ మిక్స్‌ చేసి కొత్త రుచిని ఆస్వాదించండి. కరివేపాకు, పాలకూర, గోంగూర, బ్యాంబూ షూట్స్‌... ఇలా రకరకాల వెజ్‌ పదార్థాలను జోడించి చికెన్‌ రెసిపీలు తయారుచేసుకోవచ్చు. ఇక దాల్‌ చికెన్‌ రుచి మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది.  ఈ వంటల్ని మీరూ ట్రై చేయండి.


పాలకూర చికెన్‌ కర్రీ

కావలసినవి :

చికెన్‌ - అర కిలో, పాలకూర - ఆరు కట్టలు, నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా, పచ్చిమిర్చి - రెండు, జీలకర్రపొడి - పావు టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు.


తయారీ విధానం : 

పాలకూర, చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 

ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేసి వేగించాలి. ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. కాసేపు వేగిన తరువాత ఒక పాత్రలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

కుక్కర్‌లో పాలకూర వేసి కొన్నినీళ్లు పోసి చిన్నమంటపై నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టాలి.

ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు,  అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి వేగించాలి. 

కాసేపు వేగిన తరువాత కొన్ని నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు వేయాలి. 

కాసేపయ్యాక పాలకూర వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. 

ఈ పాలకూర చికెన్‌ను వేడి వేడి అన్నంతో లేదా చపాతీతో సర్వ్‌ చేసుకోవాలి.

కరివేపాకు చికెన్‌ 

కావలసినవి :

చికెన్‌ - అరకిలో, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - ఒక కట్ట, నూనె -  సరిపడా. 

మసాలా కోసం : కరివేపాకు - నాలుగు కట్టలు, దాల్చిన చెక్క - అంగుళం, అనాసపువ్వు - ఒకటి, యాలకులు - రెండు, సోంపు - రెండు టీస్పూన్లు, ఎండుమిర్చి - రెండు, మిరియాలు - ఒక టీస్పూన్‌. 

తయారీ విధానం :

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక కరివేపాకు, దాల్చినచెక్క, అనాస పువ్వు, యాలకులు, సోంపు, ఎండుమిర్చి, మిరియాలు వేసి డ్రై రోస్ట్‌ చేసుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు స్టవ్‌పై మందంగా ఉన్న పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత పచ్చిమిర్చి, పసుపు, చికెన్‌ వేసి కలుపుకోవాలి.

చికెన్‌ ముక్కలు కాస్త ఉడికిన తరువాత రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు మసాల, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి చికెన్‌ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. 

ఒకవేళ మసాల పాన్‌ అడుగుభాగంలో మాడిపోతున్నట్లయితే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి సర్వ్‌ చేసుకోవాలి.

అల్లం చికెన్‌ 

కావలసినవి :

బోన్‌లెస్‌ చికెన్‌ - అరకేజీ, అల్లం పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కోడిగుడ్డు - ఒకటి, కార్న్‌ఫ్లోర్‌ - మూడు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, ఎండుమిర్చి - మూడు, చికెన్‌ మసాల - రెండు టేబుల్‌స్పూన్లు, చికెన్‌ స్టాక్‌ - అరకప్పు, ఉల్లిపాయలు - రెండు.


తయారీ విధానం :

చికెన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి అల్లం పేస్టు, కొద్దిగా ఎండుమిర్చి పేస్టు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మారినేట్‌ చేసుకోవాలి.

ఒక బౌల్‌లో కోడిగుడ్డు పగలకొట్టి వేయాలి. అందులో కార్న్‌ఫ్లోర్‌ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేసి వేగించాలి. చికెన్‌ ముక్కలు బాగా వేగిన తరువాత తీసి బౌల్‌లోకి మార్చుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత దంచిన అల్లం వేయాలి. మిగిలిన ఎండుమిర్చి పేస్టు, చికెన్‌మసాల, చికెన్‌ స్టాక్‌, కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం వేసి కలుపుకోవాలి.

చివరగా వేగించిన చికెన్‌ ముక్కలు వేసి కలియబెట్టుకోవాలి. కాసేపు వేగించుకున్న తరువాత దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

బ్యాంబూ షూట్స్‌ చికెన్‌ 

కావలసినవి :

చికెన్‌ - ఒకకిలో, టొమాటోలు - రెండు, వెల్లుల్లి - ఐదు రెబ్బలు, అల్లం - రెండు అంగుళాల ముక్క, పచ్చిమిర్చి - ఎనిమిది, బ్యాంబూ షూట్స్‌ - అర కప్పు ముక్కలు, క్యాబేజీ తురుము - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం :

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వంచి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై పాత్రను పెట్టి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. 

తరువాత క్యాబేజీ తురుము, బ్యాంబూ షూట్స్‌ వేసి కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి.

క్యాబేజీ ఉడికిన తరువాత చికెన్‌ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కలియబెట్టుకోవాలి. 

కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి చిన్న మంటపై చికెన్‌ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. 

చివరగా గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు, కొన్ని బ్యూంబూ షూట్స్‌ ముక్కలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

గోంగూర చికెన్‌

కావలసినవి :

చికెన్‌ - అరకిలో, గోంగూర - రెండు కట్టలు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, టొమాటో - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, పసుపు - అర టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా, మెంతులు - పావు టీస్పూన్‌, ఽకారం - తగినంత, ధనియాలు - ఒక టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి - నాలుగు, సోంపు - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం :

స్టవ్‌పై ఒక పాన్‌పెట్టి మెంతులు, ధనియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి వేగించాలి. చల్లారిన తరువాత వీటిని మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టాలి.

కుక్కర్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి.

కాసేపయ్యాక టొమాటో ముక్కలు వేసి వేగించాలి. టొమాటో మెత్తగా ఉడికిన తరువాత చికెన్‌ వేసి, గరంమసాలా, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. 

పావు కప్పు నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

ఒక పాన్‌ తీసుకొని నూనె వేసి వెలుల్లి రెబ్బలు, గోంగూర వేసి వేగించాలి. కొంచెం ఉప్పు, గరంమసాలా వేసి కలుపుకోవాలి. నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర మెత్తగా పేస్టు మాదిరిగా అవుతుంది. 

ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్‌ వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై కాసేపు ఉడికించాలి. అంతే... గోంగూర చికెన్‌ రెడీ.