విశాఖ ప్రజలు వైసీపీని గెలిపిస్తే... ఉక్కు ప్రైవేటీకరణను ఆమోదించినట్టే

ABN , First Publish Date - 2021-03-05T06:48:54+05:30 IST

ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నది..

విశాఖ ప్రజలు వైసీపీని గెలిపిస్తే... ఉక్కు ప్రైవేటీకరణను ఆమోదించినట్టే

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నది మా నినాదం

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతాం

మొదటిసారి ప్రతిపాదన వచ్చినప్పుడే 28 మంది వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీసివుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు


విశాఖపట్నం,గాజువాక: ‘‘గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు విశాఖ నగర ప్రజలు అంగీకరించినట్టే. దాంతో ఇప్పుడు చేస్తున్న పోరాటాలన్నీ వృథా అవుతాయి. భవిష్యత్తు తరాల వారికి ఉపాధి అవకాశాలు మృగ్యమవుతాయి’’ 

- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌


ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నది టీడీపీ నినాదమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంలో గురువారం ఆయన గాజువాక నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూర్మన్నపాలెం జంక్షన్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా ఢిల్లీలో ఉద్యమిస్తామన్నారు. లాభాలబాట పట్టించాల్సిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు సిద్ధపడడం బాధాకరమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడే రాష్ట్రానికి చెందిన 28 మంది వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి వుంటే...ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. 1998లో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు అప్పటి ప్రధాని వాజపేయిని ఒప్పించి ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకున్నారని గుర్తుచేశారు. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉందన్నారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించగలిగితే లాభాలబాట పడుతుందన్నారు. అయితే కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడమే పాలసీగా పెట్టుకుందన్నారు. 


ఉక్కు నిర్వాసితులకు టీడీపీ అండ

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు ఉక్కు నిర్వాసితులకు అండగా నిలుస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ బాసటగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటైతే తమ జీవితాలు బాగుపడతాయని ఇక్కడి రైతులు ఉదారంగా భూములిస్తే, వారికి తగిన న్యాయం చేయకుండానే కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు సిద్ధపడడం దారుణమన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు లాభాలు వచ్చినప్పుడు అనుభవించారని, నష్టాలు వచ్చినప్పుడు పూడ్చకుండా ప్లాంట్‌నే అమ్మేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. రాష్ట్ర ప్రజలు 28 మంది ఎంపీలను ఎన్నుకుని ఢిల్లీకి పంపితే, వారేం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


లోకేశ్‌ హామీలు

1. మునిసిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో అన్న కేంటీన్లు పునఃప్రారంభం

2. ఇంటి పన్ను సగం తగ్గింపు...పాత బకాయిలు రద్దు 

3. పరిశుభ్రమైన నీరు సరఫరా

4. ఆరునెలలకొకసారి జాబ్‌మేళా నిర్వహణ

5. నగరాలు, పట్టణాల సుందరీకరణ

6. ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు

7. యూజీడీ

8. మెప్మా సభ్యులకు సమావేశ మందిరాలు, మెప్మా బజార్లు, సభ్యులకు వడ్డీ లేని రుణాలు

9. పేదలకు ఇళ్లు, ఉచిత మంచినీటి కనెక్షన్‌

10. నీటి పన్ను రద్దు 


Updated Date - 2021-03-05T06:48:54+05:30 IST