సంతకం పెట్టాలంటే.. మాకేంటి?

ABN , First Publish Date - 2022-08-06T04:43:36+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్‌ వేతనాలు తీసుకునేందుకు మామూళ్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వంపై పోరాటాలు చేసి తమ డిమాండ్‌ సాధించుకున్న వారు ఇప్పుడు పెరిగిన వేతనం తీసుకునేందుకు చేతులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంతకం పెట్టాలంటే.. మాకేంటి?

రెగ్యులర్‌ వేతనం మంజూరులో ట్రెజరీ అధికారుల చేతివాటం

 సచివాలయ  ఉద్యోగులకు చుక్కలు

ప్రాంతాలను బట్టి రేటు

ఒక్కొక్కరి నుంచి  రూ.2వేల వరకు డిమాండ్‌

డ్రాయింగ్‌ ఆఫీసర్లకు వసూలు బాధ్యతలు 

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 5 : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్‌ వేతనాలు తీసుకునేందుకు మామూళ్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వంపై పోరాటాలు చేసి తమ డిమాండ్‌ సాధించుకున్న వారు ఇప్పుడు పెరిగిన వేతనం తీసుకునేందుకు చేతులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 1నుంచి సచివాలయ ఉద్యోగులకు రెగ్యులర్‌ వేతనాలు మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే డ్రాయింగ్‌ ఆఫీసర్‌ ద్వారా కొత్త వేతనాలను మండల, సబ్‌ట్రెజరీలకు పంపాల్సి ఉంది. అయితే మండల స్థాయిలో, సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లులు మంజూరుకావాలంటే తమకు మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీచేసినట్లు సమాచారం. రెండున్నరేళ్ల అనంతరం రెగ్యులర్‌ వేతనం తీసుకుంటున్నామని ఆనందంలో ఉన్న ఉద్యోగులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో ఏడు సబ్‌ట్రెజరీ కార్యాలయాలు ఉండగా వాటి పరిధిలోని పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో ఉద్యోగి వద్ద నుంచి ఇంత వసూలు చేసి ఇవ్వాలని డ్రాయింగ్‌ ఆఫీసర్లపై అధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో డ్రాయింగ్‌ ఆఫీసర్లు చేసేదేమీ లేక ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగులకు చెప్పడంతో ఒక్కసారి ఈ అంశం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


చేసేదేమీ లేక...

నిరంతరం అధికారులకు అందుబాటులో ఉంటూ వారు చెప్పిన పనులు చేస్తూ వారి వద్దనే ఉంటున్న తమకు పెరిగిన వేతనం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్‌ చేయడంతో సచివాలయ సిబ్బంది షాక్‌కు గురవుతున్నారు. ఒక్కో సబ్‌ ట్రెజరీ పరిధిలో ఒక్కో విధంగా వేతనాలు బిల్లులు పెట్టేందుకు కొంత మొ త్తాన్ని నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగి వద్ద రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు అడుగు తున్నట్లు తెలుస్తోంది. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ డ్రాయింగ్‌ ఆఫీసర్‌ వద్దకు వెళ్లి మామూళ్లు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, బిల్లులు మీకే అప్పగిస్తాం.. అక్కడ పనిచేయించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నట్లు సమాచారం. దీంతో సచివాలయ ఉద్యోగులు చేసేదేమి లేక వారు అడిగినంత సమర్పించుకుని తమ బిల్లులు పెట్టించుకుంటున్నారు. 





Updated Date - 2022-08-06T04:43:36+05:30 IST