ఇలాగైతే గుండె గల్లంతే!

ABN , First Publish Date - 2022-07-05T08:27:08+05:30 IST

‘సైలెంట్‌ కిల్లర్‌’గా పేరున్న గుండె జబ్బులు ఇటీవలి కాలంలో యువతను ఎక్కువగా బలిగొంటున్నాయి.

ఇలాగైతే గుండె గల్లంతే!

‘సైలెంట్‌ కిల్లర్‌’గా పేరున్న గుండె జబ్బులు ఇటీవలి కాలంలో యువతను ఎక్కువగా బలిగొంటున్నాయి. మరీ ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వ్యక్తులు ఈ వ్యాధికి బలైపోతూ ఉండడానికి కారణాలు భిన్నంగా ఉంటున్నాయి. గుండె సమస్యలకు జీవనశైలి, ఒత్తిడి లాంటి ఎన్ని బాహ్య కారణాలు ఉన్నప్పటికీ, గుండె మెరుగ్గా ఉండాలంటే తీసుకునే ఆహారం మీద కూడా దృష్టి పెట్టక తప్పదు. కాబట్టి ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే విషయాలను గమనించుకుంటూ ఉండాలి.


మనం తినవలసిన ఉప్పు రోజుకు 5 గ్రాములకు మించకూడదు. కానీ మనం రోజుకు ఏకంగా 11 గ్రాముల ఉప్పును తింటున్నట్టు పరిశోధనల్లో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న పరిమాణానికి కట్టుబడి ఉంటే, గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ఉప్పుతో కూడిన జంక్‌ ఫుడ్‌, బిస్కెట్టు, చిప్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, నిల్వ పచ్చళ్లు సాధ్యమైనంత తగ్గించాలి.


శాచురేటెడ్‌ ఫ్యాట్‌: రోజుకు 4-5ు శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ మాత్రమే ఆరోగ్యకరం. కానీ మాంసాహారం, వేపుళ్ల ద్వారా అంతకు రెట్టింపు హానికారక కొవ్వులు మన శరీరంలో చేరుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా నూనెలో ముంచి వండే పదార్థాలు, కొవ్వు అధికంగా ఉండే మాంసాహారం వీలైనంత తగ్గించాలి.

చక్కెర: రోజుకు చక్కెర 30 గ్రాములకు మించకూడదు. రోజుకు అవసరమైన క్యాలరీల కంటే 25ు అదనపు చక్కెరను తినేవాళ్లు, అంతకంటే తక్కువ చక్కెర తినే వాళ్ల కంటే, ఎంతో ముందుగానే గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఎంతో అరుదుగా మాత్రమే తీపి పదార్థాలు తినాలి. కాఫీ, టీలలో చక్కెర వాడకం తగ్గించాలి.


ఆహారం మాత్రమే కాదు: నిద్రలేమి, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు కూడా గుండె జబ్బులకు దారి తీస్తాయి. కాబట్టి రోజుకు 6 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. అలాగే గుండె ఆరోగ్యం కోసం దురలవాట్లకు దూరంగా ఉండాలి.

Updated Date - 2022-07-05T08:27:08+05:30 IST