రిజిస్ర్టేషన్‌ ఉంటేనే..

ABN , First Publish Date - 2021-06-13T04:43:30+05:30 IST

ఎదుగుదల లేని మొక్కలు విక్రయించినా.. కల్తీ నారు అంటగట్టినా ఇకపై కటకటాలు లెక్కించాల్సిందే. నర్సరీలను చట్టపరిధిలోకి తీసుకు వస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రిజిస్ర్టేషన్‌ ఉంటేనే..

  • నర్సరీల నిర్వహణకు అనుమతి
  • ఇక నుంచి ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ
  • నర్సరీలను చట్టపరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఎదుగుదల లేని మొక్కలు, కల్తీ నారు అమ్మితే జైలుకే..


ఎదుగుదల లేని మొక్కలు విక్రయించినా.. కల్తీ నారు అంటగట్టినా ఇకపై కటకటాలు లెక్కించాల్సిందే.  నర్సరీలను చట్టపరిధిలోకి తీసుకు వస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోరలు లేని గత చట్టానికి సవరణలు చేసి ఉద్యాన శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. నర్సరీల రిజిస్ర్టేషన్‌ సదరు శాఖ కనుసన్నల్లోనే సాగనుంది. ఇకపై రంగారెడ్డి జిల్లాలోని నర్సరీలన్నీ ఉద్యానశాఖ పరిధిలో చేర్చాల్సిందే.. ఇక రైతులు, ప్రకృతి ప్రేమికులకు నాణ్యమైన మొక్కలు, నారు విక్రయాలతోపాటు నర్సరీల నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. నష్టపరిహారం కూడా ఇచ్చే నిబంధన ఉండటంతో పారదర్శకంగా ఉండనున్నారు. 


 (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌)

అనుమతి పొందని నర్సరీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. నర్సరీ దారులు విత్తనం ఎక్కడ నుంచి సేకరించారు. బిల్లు వివరాలు, లాట్‌ నంబర్‌, బ్యాచ్‌ నంబర్‌, విత్తన పరీక్ష వివరాల పత్రాలు, విత్తనం తయారు చేసిన తేది, గడువు తేది, విత్తిన తేది, నారు మొక్కలు అమ్మిన తేది తదితర వివరాలు విధిగా నమోదు చేయాలి. నర్సరీ ప్రధాన ద్వారం వద్ద ఒక బోర్డును ఏర్పాటు చేసి అక్కడ లభించే నారు మొక్కల సంఖ్య ధరల పట్టిక తెలుగులో రాసి ఉంచాలి. నాణ్యమైన నారు మొక్కల తయారీకి సరైన భూమి ఎన్నుకోవడంతోపాటు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి. పిల్ల, తల్లి మొక్కల బ్లాక్‌లను వేరుగా ఉంచాలి. నీటితోపాటు కార్యాలయం స్టోర్‌ వసతులు ఉండాలి. మొలకలు, నర్సరీ బెడ్ల తయారీ, షెడ్‌నెట్‌హౌస్‌, నెట్‌హౌస్‌, పాలిటన్నెల్‌, మిస్తూ ఛాంబర్‌ తదితరాలు సమకూర్చుకోవడంతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. నారు వయసు, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. 


నిబంధనలు పాటించకుంటే జైలే..

నిబంధనలు పాటించని నర్సరీదారులపై చట్ట ప్రకారం రూ.5 వేల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రైతులు కూడా రిజిస్ట్రేషన్‌ ఉన్న నర్సరీ నుంచే నారు కొనుగోలు చేయాలి. బిల్లు తీసుకుని జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. నర్సరీ రిజిస్ర్టేషన్‌ చేయకుంటే సంబంధిత నర్సరీదారుడు మొక్కలు, నారు ఉత్పత్తి విక్రయించేందుకు అనర్హుడు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తప్పవు.


రిజిస్ర్టేషన్‌ కోసం ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?

నర్సరీ రిజిస్ర్టేషన్‌ చేసుకునేందుకు అవసరమైన దరఖాస్తు ఫారము స్థానిక ఉద్యాన అధికారి వద్ద అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ఫారంను నింపి అడ్రస్‌ ప్రూఫ్‌, నర్సరీ అడ్రస్‌ ఫొటో, భూమి పట్టాదారు పాసుపుస్తకం నకలు, లీజ్‌ డాక్యుమెంట్‌, నర్సరీ లేఅవుట్‌/మ్యాప్‌, ప్రభుత్వ అమోదం సర్వేర్‌, నర్సరీలో మౌలిక సదుపాయాలు, పూర్తి వివరాలు, భూమి, నీటి పరీక్షల నకలు, ప్రభుత్వేతర ఆమోదిత ల్యాబ్‌ నుంచి పొందాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాలు ఉత్పత్తి, నర్సరీల డిజిటల్‌ ఫొటో కాపీ, చలానా నకలు రశీదు సమర్పించాలి.


రిజిస్ర్టేషన్‌ రుసుము ఎంత? ఎవరికి చెల్లించాలి..

పండ్ల మొక్కల ఉత్పత్తికి రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.5వేలు, కూరగాయలు, పువ్వులు, ఔషద, సుగంధ ద్రవ్యాల నాణ్యమైన మొక్కల తయారీ 2 లక్షల నుంచి 4 లక్షల ఉత్పత్తికి రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ. వేయి, 4 లక్షలకు మించి ఉత్పత్తి ఉంటే రూ.2,500 ఫీజు ఉంటుంది. లైసైన్స్‌ ఫీజు కింద ప్రభుత్వ ఖజానా ద్వారా చలానాలు చెల్లించాల్సి ఉంటుంది. 


సంప్రదించాల్సిన అధికారుల వివరాలు

మహేశ్వరం, బాలాపూర్‌, సరూర్‌నగర్‌, కందుకూరు, అబ్ధుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల రైతులు బి.కనకలక్ష్మి ఫోన్‌ నెంబరు 7997725239లో సంప్రదించాలి. చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, షాబాద్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గండిపేట వి.అశోక్‌ 9704118520, షాద్‌నగర్‌, కేశంపేట, కొత్తూరు, నందిగామ, చౌదర్‌గూడెం, కొందుర్గు, తలకొండపల్లి, శంషాబాద్‌ రైతులు ఉషారాణి 7997725243 నంబరులో సంప్రదించాలి. 


లైసెన్స్‌ రెన్యూవల్‌ ఫీజు

ప్రతి నర్సరీదారుడు రిజిస్ర్టేషన్‌ చేసుకున్న తర్వాత పండ్ల మొక్కల నర్సరీ అయితే మూడు సంవత్సరాలకు ఒకసారి, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, ఔషదం, అలంకరణ మొక్కలకు ఏడాదికి ఒకసారి లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసుకోవాలి. 4 లక్షలు లేదా అంతకన్నా తక్కువ మొక్కల ఉత్పత్తికి రూ.500, 4 లక్షల కన్న ఎక్కువ మొక్కల ఉత్పత్తికి రూ. వేయి, పండ్ల మొక్కల నర్సరీకి రూ. 1500 ఫీజు చెల్లించాలి. 

Updated Date - 2021-06-13T04:43:30+05:30 IST