ముప్పు తప్పినట్లేనా..!

ABN , First Publish Date - 2021-12-07T06:09:17+05:30 IST

కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్‌ కొట్టుకుపోయి 41 మంది మృత్యువాతపడ్డారు.

ముప్పు తప్పినట్లేనా..!

  1. చెరువు కట్టపై ఏటా లీకేజీలు
  2. తూముల వద్ద బలహీనంగా మట్టికట్ట
  3. మూడేళ్లుగా చెరువు నిర్వహణ గాలికి 
  4. భారీ గండ్లు పడితే పరిస్థితి ఏమిటి..? 
  5. సిద్ధాపురం చెరువుకు నిధుల కరువు
  6. రివిట్‌మెంట్‌తోనే శాశ్వత పరిష్కారం


ఆత్మకూరు, డిసెంబరు 6: కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్‌ కొట్టుకుపోయి 41 మంది మృత్యువాతపడ్డారు. వేలకోట్ల ఆస్తి నష్టం సంభవించింది. దీని వెనుక మానవ తప్పిదం కూడా ఉందని కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. ఇలాంటి ప్రమాదం నుంచి ఆత్మకూరు మండల ప్రజలు తప్పించుకున్నారు. జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన సిద్ధాపురం చెరువు పెద్దతూము సమీపంలో మూడుచోట్ల పెద్దపెద్ద రంధ్రాలు పడ్డాయి. భారీ ఎత్తున లీకేజీలు ఏర్పడ్డాయి. ఇరిగేషన్‌ అధికారులు మరమ్మతు పనులు చేపట్టి గండ్లు పూడ్చేశారు. అయితే ఈ తాత్కాలిక చర్యలతో చెరువు కట్టకు ముప్పు తప్పినట్లేనా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. కట్టను పటిష్టపరచకపోతే భవిష్యత్తులో పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఇంజనీరింగ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూముల వద్ద రివిట్‌మెంట్‌ పనులను చేపట్టి కట్టను పటిష్టపరచాలని సూచిస్తున్నారు.  


ఎన్నో కారణాలు


సిద్ధాపురం చెరువుకట్టకు గండ్లు ఏర్పడటానికి నిపుణులు వివిధ కారణాలు చెబుతున్నారు. తూముల సమీపంలోనే పలుమార్లు లీకేజీలు, గండ్లు ఏర్పడటంతో అధికారులు పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. చెరువుకట్ట పొడవునా లోపలివైపు బ్రిటీష్‌కాలం నాటి రాక్‌ రివిట్‌మెంట్‌ ఉంది. కానీ తూముల ఆధునికీకరణలో ఎడమ స్లూయిస్‌ పక్కనే ఉన్న బ్రిటీష్‌ కాలం నాటి చిన్నతూమును తొలగించకుండానే మట్టికట్టను నిర్మించారు. ఆ సమయంలో కట్ట దిగువన రాతి రివిట్‌మెంట్‌ లేకుండా కేవలం మట్టితోనే కట్ట నిర్మించారు. ఈ కారణంగా ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. 

చెరువులోకి భారీగా నీరు చేరినప్పుడు, ప్రధాన తూము నుంచి నీటిని విడుదల చేసే సమయంలోనూ పాత చిన్నతూముపై ఒత్తిడి పడుతోందని నిపుణులు గుర్తించారు. ఈ తూము లీకేజీల ద్వారా మట్టికట్టలోకి నీరు చొచ్చుకుపోతోందని, చిన్నపాటి మట్టిరేణువులు నీటిలో కరిగిపోవడంతోనే కరకట్ట బలహీనపడిందని గ్రహించారు. 

కట్టలోపలి భాగంలో గొయ్యిలు ఏర్పడుతున్నాయి. మట్టికట్ట నిర్మాణ సమయంలో తూముల వద్ద కట్టను పటిష్టపరచలేదు. ఇది కూడా గండ్లకు కారణమని ఇరిగేషన్‌ అధికారులు తెలుసుకున్నారు. 

కుడి కాల్వ తూము వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే తూముల వద్ద మట్టికట్టకు 600 మి.మీ. లేక 225 మి.మీ. రాళ్లతో రివిట్‌మెంట్‌ నిర్మించాలి. కట్టను రోలర్‌ కంపాక్షన్‌(ఒత్తిడి)తో బలోపేతం చేయాలి. అప్పుడే లీకేజీలను నివారించే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

చెరువుకట్టపై దారిపొడవునా చెట్లు, పిచ్చిమొక్కలు విరివిగా పెరిగి, కట్టలోకి వేళ్లూనుకుపోయాయి. ఈ కారణంగా కూడా కట్ట పటిష్టతకు ముప్పు ఏర్పడుతోంది. చెరువుకట్టపై జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టాలని ఇరిగేషన్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలన్నీ పాటించినప్పుడే సిద్ధాపురం చెరువుకట్టకు భద్రత ఉంటుందని చెబుతున్నారు.


నిధులు ఇవ్వకుంటే ఏం చేయాలి..?


సిద్ధాపురం చెరువుకట్ట నిర్వహణనకు నిధులు లేవు. మూడేళ్లుగా ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదని తెలుస్తోంది. గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.4 కోట్లకు పైగా బిల్లులను నిలిపివేశారు. దీంతో ఆయన నిర్వహణ పనులను చేపట్టకుండా చేతులెత్తేశారు. దీంతో సిద్ధాపురం చెరువు పరిస్థితి అధ్వానంగా మారింది. చెరువుకట్టకు ఏర్పడిన గండ్ల విషయంలో అధికారుల తప్పిదాన్ని మాత్రమే ప్రశ్నించడం బాధాకరమని కొందరు ఇరిగేషన్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు ఇవ్వకుంటే పనులు ఎలా చేపట్టాలని ప్రశ్నిస్తున్నారు. చెరువుకట్టపై గండ్లను పూడ్చేందుకు ఓ కాంట్రాక్టర్‌ను బతిమాలి మట్టి ట్రిప్పర్లను, భారీ యంత్రాలను తెప్పించినట్లు సమాచారం. తనకు బిల్లులు ఇవ్వలేదని ఆ కాంట్రాక్టర్‌ తాత్కాలిక పనులు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో అధికారులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కావు. 


అలుగుకు అడ్డుకట్ట 


గండ్లను పూడ్చే సమయంలో చెరువులో నీటిసామర్థ్యాన్ని తగ్గించేందుకు అటవీ ప్రాంతంలో అలుగును కూల్చివేశారు. లీకేజీలు ఆగిపోవడంతో అలుగు నుంచి నీరు వృథా కాకుండా సోమవారం ఇరిగేషన్‌ అధికారులు అడ్డుకట్ట వేయించారు. గండ్లు పడిన సమయంలో అలుగును రెండున్న అడుగుల తొలగించి నీటిని గాలేరు వాగులోకి మళ్లించారు. ఆ ప్రాంతంలో ఇసుక సంచులను అడ్డుగా ఉంచి నీటి విడుదలను నిలిపివేశారు. గండ్లు పడిన ప్రదేశంలో చెరువుకట్టపై అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌లైన్‌ బయటపడటంతో ట్రిప్పర్లతో మట్టిని వేసి చదును చేయించారు. భవిష్యత్తులో మట్టికోసం ఇబ్బంది పడకుండా అక్కడే మట్టినిల్వలు ఏర్పాటు చేశారు. పనులను తెలుగుగంగ ఈఈ సుబ్బరాయుడు, డీఈలు ప్రసాదరావు, నగేష్‌, నర్సమ్మ, ఏఈలు శివనాయక్‌, మహేశ్వరరెడ్డి, మంజునాథ్‌, అర్జున్‌సింగ్‌ తదితరులు పర్యవేక్షించారు.


శాశ్వత పనులకు ప్రతిపాదన 


తూముల వద్ద కోర్‌వాల్‌ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాము. ఇప్పటికే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. రీటెండరింగ్‌ కారణంగా గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లింపు జాప్యమైంది. దీంతో ఆ కాంట్రాక్టర్‌ నిర్వహణ పనులు చేపట్టలేదు. త్వరలో టెండర్లను పిలిచి పెండింగ్‌ పనులతో పాటు తూముల వద్ద రివిట్‌మెంట్‌ పనులను చేయిస్తాం. ఎంపీడీవో సహకారంతో ఉపాధి నిధులతో చెరువుకట్టపై జంగిల్‌ క్లియరెన్సు పనులు చేయిస్తాం. చెరువుకట్టపై ఏర్పడిన గండ్లను పూడ్చేశాము. సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 


- సుబ్బరాయుడు, తెలుగుగంగ ఈఈ

Updated Date - 2021-12-07T06:09:17+05:30 IST