మౌనం వీడితేనే మళ్ళీ వికాసం

ABN , First Publish Date - 2020-10-24T05:58:03+05:30 IST

భాగ్యసీమలో పేదవాడిగా బతకడం కంటే దౌర్భాగ్యమేముంది? ద్వితీయ ప్రపంచ సంగ్రామం అనంతరం యావత్‌ ప్రపంచమూ అపరిమితంగా...

మౌనం వీడితేనే మళ్ళీ వికాసం

కటిక పేదరికం, పెరుగుతున్న నేరాలు బిహార్ ప్రజలను నిస్తేజపరుస్తున్నాయి. బిహారీలు మూగవోయారు. వారు ఆ మౌనాన్ని విడనాడాలి. విడనాడాల్సిన సమయమాసన్నమయింది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. రాష్ట్ర పాలనా పగ్గాలను మరొక పార్టీ లేదా కూటమికి అప్పగించాలి. సమర్థ, సంక్షేమ పాలన నందించడంలో విఫలమయితే పాత పాలకుల గతే మీకు పడుతుందనే స్పష్టమైన హెచ్చరికతో అధికారాన్ని కొత్తవారికి ఇవ్వాలి. కొత్త ప్రజాస్వామిక చైతన్యానికి బిహార్ ఓటర్లు పథ నిర్దేశకులు అవుతారా?


భాగ్యసీమలో పేదవాడిగా బతకడం కంటే దౌర్భాగ్యమేముంది? ద్వితీయ ప్రపంచ సంగ్రామం అనంతరం యావత్‌ ప్రపంచమూ అపరిమితంగా సంపద్వంతమయింది. మరి జీవనానందానికి అన్ని అవకాశాలున్నా వాటిని పొందలేని పేదవాడిగా మిగలడం దురదృష్టం కాక మరేమవుతుంది? ఒక పేదదేశంలో పేదవాడిగా ఉండడమంటే అది నిస్సందేహంగా ప్రజాస్వామ్య వైఫల్యమే. ఒక పేదదేశంలోని ఒక పేద రాష్ట్రంలో పేదవాడిగా ఉండడం రాజకీయ శాపమే. దురదృష్టం, ప్రజాస్వామ్య వైఫల్యం, రాజకీయ శాపం– ఈ మూడింటి బాధితుడు బిహార్ సగటు పౌరుడు. ఇటువంటి శాపగ్రస్థులు ఆ రాష్ట్రంలో ఎందరో! అయితే ఇప్పుడు మెరుగైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు వారికి మరో అవకాశం వచ్చింది. బిహార్ శాసనసభకు మరి కొద్దిరోజుల్లో జరగనున్న ఎన్నికలలో తమ ఓటుహక్కును వివేకవంతంగా ఉపయోగించుకుంటే ఆ దురదృష్టవంతుల ముంగిటకు మంచికాలం తప్పకుండా వస్తుంది. 


సరే, ఎవరికి ఓటు వేయాలి అని అంటే వారి ముందు వివిధ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవి: ఎన్‌డిఏ (జెడియు, బీజేపీ, హెచ్‌ఏఎమ్), మహాఘట్‌బంధన్ (ఆర్‌జెడి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐ–ఎంఎల్, ఎల్‌జెపి– పాశ్వాన్), ఇంకా వివిధ చిన్న పార్టీలతో కూడిన మరో కూటమి. బిహారీలలో అత్యధికులు పేదవాళ్లు. 2019-–20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ నికర తలసరి ఆదాయం రూ.1,34,226. అదే సంవత్సరంలో బిహార్ నికర తలసరి ఆదాయం రూ.46,664. అది దేశ తలసరి ఆదాయంలో మూడోవంతు మాత్రమే. మిగతా అన్ని రాష్ట్రాల కంటే బిహార్ నికర తలసరి ఆదాయమే అతి తక్కువ. రూ.3,888 సగటు నెలసరి ఆదాయంతో సగటు బిహారీ పౌరుడు కూడు, గూడు, బట్టను సమకూర్చుకోగలగడం అసాధ్యం. 


రైతుల స్థితిగతులు మహా అధ్వాన్నం. వ్యవసాయరంగానికి దేశంలోని రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపుల సగటు 7.1శాతం కాగా, బిహార్ 3.5శాతం మాత్రమే కేటాయిస్తోంది. మొత్తం రైతు కుటుంబాలలో 42.5 శాతం రుణగ్రస్థమై ఉన్నాయి. సన్నకారు చిన్నకారు రైతు కుటుంబాలలో 86.7శాతం అప్పులఊబిలో కూరుకుపోయి బతుకుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను బిహార్ రద్దు చేసింది. పంటబీమా పథకం (పిఎం ఎఫ్‌బివై) నుంచి స్వచ్ఛందంగా వైదొలిగింది. కొవిడ్ మహమ్మారి విజృంభించక ముందు నుంచి, మరింత స్పష్టంగా చెప్పాలంటే 2019 ఫిబ్రవరి నుంచి దేశంలో నిరుద్యోగం రేటు 10శాతం కాగా, బిహార్లో అది 55శాతంగా ఉంది. అక్కడ ఉద్యోగం సద్యోగం చేస్తున్న వారిలో 87శాతం మందికి నియత, క్రమబద్ధమైన వేతనాలు లభించే ఉద్యోగాలు లేవు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రెండు కోట్ల కుటుంబాలు నమోదయిఉండగా కేవలం 36.5 శాతం కుటుంబాలకే పనులు చూపగలుగుతున్నారు.


బిహార్‌లో ఈ దుస్థితి ఎప్పటి నుంచి? స్వాతంత్ర్యం తొలినాళ్ళలో ఆ రాష్ట్రంలో ఒక దృఢమైన పాలనావ్యవస్థ ఉండేది. నాయకులు నిజాయితీపరులు, ప్రగతిశీలురు. విద్యుక్తధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వహించే సివిల్ సర్వీస్ ఉండేది. గంగావాహినితో పావనమయ్యే దక్షిణ బిహార్ దేశంలోనే అత్యంత సుభిక్షప్రాంతంగా విలసిల్లేది. ఆ తొలినాటి బిహార్ సాధించిన మరో ప్రసిద్ధ ప్రగతి భూసంస్కరణలు. జమిందారీ వ్యవస్థను రద్దు చేసి భూవసతి లేని నిరుపేద కుటుంబాలకు సాగుభూములు పంపిణీ చేసిన ప్రగతిశీల రాష్ట్రం ఆనాటి బిహార్. భూసంస్కరణల విషయంలో దానికంటే మంచి ఫలితాలను సాధించిన ఏకైక రాష్ట్రం జమ్మూ-కశ్మీర్ మాత్రమే. బిహార్‌లో ఉత్తమ, ప్రశస్త విద్యావ్యవస్థను నిర్మించిన వారు క్రైస్తవ మిషనరీలు. సగటు బిహారీ కష్ట జీవి. అక్కడి శ్రామికజనులకు దేశమంతటా మంచిపేరుండేది. ఈనాటికీ దేశంలో ఎక్కడైనా సరే నిర్మాణరంగ ఆసామీలు వలస వచ్చిన బిహారీ కార్మికులకే ప్రాధాన్యమివ్వడం కద్దు.


కాలం నిర్దాక్షిణ్యమైనది. గత ముప్పై సంవత్సరాలలో బిహార్ సిరుల శోభను కోల్పోయింది-. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాలన గత పదిహేనేళ్ళు (స్వయం కృతమైన 278 రోజుల విరామంతో)గా కొనసాగుతోంది. ఆ రాష్ట్ర దురదృష్టాలన్నిటికీ మూలకారణం అధ్వాన్న పాలన. 2011–12-, 2018–19 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ఆ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి సగటు వార్షిక వృద్ధిరేటు 6.6శాతం. ఇదే కాలంలో జాతీయ జీడీపీ సగటు వృద్ధిరేటు 7.73శాతం. 2005–2019 సంవత్సరాల మధ్య బిహార్ ప్రభుత్వ రుణాలు రూ.43,183 కోట్ల నుంచి రూ.1,61,980 కోట్ల రూపాయలకు పెరిగాయి. కొత్తగా తీసుకుంటున్న రుణాలను పూర్తిగా పాత రుణాల పై వడ్డీతో పాటు అసలు చెల్లింపులకే వినియోగిస్తున్నారని కాగ్ నివేదిక వెల్లడించింది. సొంత వనరులు తక్కువ. రుణాల రూపేణా లభ్యమవుతున్న లేదా లభ్యమయినా అభివృద్ధి పనులకు మిగులుతున్న నిధులు స్వల్పం. ఇక మూలధన వ్యయాల గురించి చెప్పేదేముంది? ఇటువంటి పరిస్థితుల్లో కొత్త, నియత ఉద్యోగాల సృష్టి ఎలా జరుగుతుంది?


పేదరికం పెచ్చరిల్లిపోతోందంటే పెచ్చరిల్లిపోదూ మరి? నీతి ఆయోగ్ ఆమోదించిన అధ్యయనాల ప్రకారం 2018-–19 ఆర్థిక సంవత్సరంలో బిహార్ పేదరికం నిష్పత్తి 55శాతం. పేద బిహారీ ఏం చేస్తాడు? ఏం చేయగలుగుతాడు? తరచు కుటుంబసభ్యులతో సహా వలసపోతున్నాడు. ఈ ఏడాది వేసవికాలంలో కనీవినీ ఎరుగని విధంగా జరిగిన మానవ విషాదాన్ని మరచిపోయారా? 2020 మార్చి 24న హఠాత్తుగా విధించిన సంపూర్ణ లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది శ్రామికజనులు వందలు, వేల కిలోమీటర్లు కాలినడకన, అంతులేని ప్రయాసలకు లోనవుతూ బిహార్, ఉత్తరప్రదేశ్‌లలోని సొంత పట్టణాలు, గ్రామాలకు చేరుకోవడం విస్మరించలేని విషాద జీవన ప్రస్థానం కాదూ? గూడు కోల్పోయిన దుస్థితి, దహించివేస్తున్న ఆకలి దప్పులను తప్పించుకునేందుకే వారు ఆ విధంగా విషాద యాత్రికులయ్యారు. ‘చనిపోవలసివస్తే ఆప్తుల మధ్యే చనిపోదామనే’ హృదయావేదనే వారిని ఆ సాహసానికి పురిగొల్పింది. 


బిహార్ ప్రజలు తమ ఓటును నితీశ్ కుమార్‌కు అనుకూలంగా వేయాలి. లేదంటే వ్యతిరేకంగా వేయాలి. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవ’ ఉద్యమం నుంచి ప్రభవించిన నేత నితీశ్ కుమార్. నిబద్ధ సోషలిస్ట్. ఆయన నికార్సయిన లౌకికవాది అని, నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని సమర్థంగా ఎదుర్కోగల నేత అని పలువురు ప్రగాఢంగా విశ్వసించారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బిహార్‌లో శాంతిభద్రతల వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు అభివృద్ధి సాధనకు నితీశ్ చిత్తశుద్ధితో కృషి చేశారు. మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుల అజరామర స్ఫూర్తిని జాతి జీవనంలో నిలబెట్టగల నేత అని నితీశ్‌పై ఎంతో మంది పెట్టుకున్న ఆశలు 2017 జూలైలో పూర్తిగా ఆవిరైపోయాయి. నరేంద్ర మోదీ పట్ల ఉన్న వ్యతిరేకతను ఆయన విడనాడారు. ఆర్‌జెడితో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి బీజేపీతో చేతులు కలిపారు. ముఖ్యమంత్రిగా కొనసాగారు. -కాకపోతే ఎన్డీఏ ప్రభుత్వ అధినేతగా. ఆయన రాష్ట్ర ప్రజలతో తక్కువగాను, నరేంద్ర మోదీతో ఎక్కువగానూ ఏకమవుతున్నారు. మరి అధికారంలో కొనసాగాలి కదా. బిహార్‌కు చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధి సమకూర్చి ఉంటే ఆ రాజకీయ అనైతికత క్షమార్హమే. కానీ రాష్ట్రం ఆర్థికం మరింతగా దిగజారిపోయింది. ఈ కఠోర వాస్తవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం శాంతిభద్రతలనైనా నితీశ్ పరిరక్షించగలుగుతున్నారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే 2005–-2019 సంవత్సరాల మధ్య కేసు పెట్టదగిన నేరాలు 157శాతం పెరిగాయి. ప్రతి రోజు సగటున మహిళలకు వ్యతిరేకంగా 51, దళితులకు వ్యతిరేకంగా 18 నేరాలు జరుగుతున్నాయి. 4 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి.


కటిక పేదరికం, పెరుగుతున్న నేరాలు బిహార్ ప్రజలను నిస్తేజపరుస్తున్నాయి. వారు మూగవోయారు. అవును, వారు మౌనంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారు ఆ మౌనాన్ని విడనాడాలి. విడనాడాల్సిన సమయమాసన్నమయింది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. రాష్ట్ర పాలనా పగ్గాలను మరొక పార్టీ లేదా కూటమికి అప్పగించాలి. సమర్థ, సంక్షేమ పాలన నందించడంలో విఫలమయితే పాత పాలకుల గతే మీకు పడుతుందనే స్పష్టమైన హెచ్చరికతో అధికారాన్ని కొత్తవారికి ఇవ్వాలి. ఓటుహక్కే సామాన్య ప్రజల నిజమైన అధికారం. అసమర్థ, అవినీతి పాలకులను అధికారం నుంచి దించివేసేందుకు ఆ ప్రజాస్వామిక హక్కును వినియోగించాలి. అటువంటి మహదవకాశం మళ్ళీ వచ్చింది. కొత్త ప్రజాస్వామిక చైతన్యానికి బిహార్ ఓటర్లు పథ నిర్దేశకులు కావాలి. ఆ మహత్తర చైతన్యం 2020 సంవత్సరంలోనే ప్రభవించాలి. ప్రభవిస్తే మార్పు తథ్యం.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-10-24T05:58:03+05:30 IST