సచివాలయ ఉద్యోగి ఒక్కరుంటే ఒట్టు!

ABN , First Publish Date - 2021-06-25T06:46:07+05:30 IST

ప్రభుత్వ సేవలు గ్రామస్థాయిలోనే అందించాలన్న ఆశయానికి నిలువునా తూట్లు పొడుస్తున్న సచివాలయ సిబ్బంది తీరుకు అద్దం పడుతున్న దృశ్యాలివి.

సచివాలయ ఉద్యోగి ఒక్కరుంటే ఒట్టు!
కూడేరు ఒకటో సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలైనా ఖాళీగా ఉన్న కుర్చీలు

ఇష్టారాజ్యంగా విధులకు హాజరు...  చోద్యం చూస్తున్న పర్యవేక్షణ అధికారులు


కూడేరు, జూన 24 : ప్రభుత్వ సేవలు గ్రామస్థాయిలోనే అందించాలన్న ఆశయానికి నిలువునా తూట్లు పొడుస్తున్న సచివాలయ సిబ్బంది తీరుకు అద్దం పడుతున్న దృశ్యాలివి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి సచివాలయ సిబ్బంది విధులకు ఇష్టారాజ్యంగా హాజరవుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలైనా కూడేరు ఒకటో సచివాలయంలో ఉద్యోగుల కుర్చీలన్నీ వెలవెలబోయాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా సమయానికి విధులకు హాజరైన పాపాన పోలేదు. వివిధ పనుల నిమిత్తం ఉదయమే సచివాలయం వద్దకు చేరుకున్న గ్రామస్థులు సిబ్బంది పనితీరును చూసి నివ్వెరపోయారు. ఇక చేసేది లేక సారోళ్ల కోసం గంటల తరబడి కార్యాలయం వెలుపల కూర్చుని నిరీక్షిస్తూ కనిపించారు. ఇదిలాఉండగా అధికార పార్టీ నాయకులే సచివాలయ సిబ్బంది తీరుపట్ల పెదవి విరుస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా విధులకు హాజరవుతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయ సిబ్బంది తీరుతో వివిధ పథకాల లబ్ధి కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అన్న నినాదాన్ని సచివాలయ సిబ్బంది వెక్కిరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సిబ్బంది వేళకు విధులకు హాజరయ్యేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు. 



Updated Date - 2021-06-25T06:46:07+05:30 IST