రోడ్లు బాగుంటే.. ఏపీ సంపన్న రాష్ట్రం

ABN , First Publish Date - 2022-09-23T08:37:54+05:30 IST

రోడ్లు బాగుంటే.. ఏపీ సంపన్న రాష్ట్రం

రోడ్లు బాగుంటే.. ఏపీ సంపన్న రాష్ట్రం

పెట్టుబడులు, పరిశ్రమలతోనే అభివృద్ధి

నీరు, విద్యుత్‌, రవాణా లేకుంటే అవి రావు

ఆంధ్రలో సహజ వనరులు అపారం

సద్వినియోగం చేసుకోవాలి

రాజమండ్రి సభలో గడ్కరీ

5 ఫ్లైఓవర్లు, 3 ఎన్‌హెచ్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపన


రాజమహేంద్రవరం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘అమెరికా ధనిక దేశం అవడం వల్ల అక్కడ రోడ్లు బాగుండడం కాదు.. అక్కడ రోడ్లు బాగుండడం వల్లే అమెరికా సంపన్న దేశమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ కెనడీ చెప్పిన ఓ సూక్తిని నేనెప్పుడూ చెబుతుంటా. ఆంధ్రలో కూడా మంచి రోడ్లు ఉంటే.. దేశంలోనే సంపన్న రాష్ట్రం అవుతుంది’ అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్స్ట్‌ కాలేజీ గ్రౌండ్‌లో గురువారం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.2,850 కోట్లతో రాజమహేంద్రవరంలోని మోరంపూడి.. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తేతలి.. ఏలూరు జిల్లా పరిధిలోని కైకరం జాతీయ రహదారులపై నిర్మించనున్న ఐదు ఫ్లైఓవర్లకు వర్చువల్‌ విధానంలో గడ్కరీ శంకుస్థాపన చేశారు. అదే విధంగా కాకినాడ జిల్లాలో వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం 516ఎఫ్‌ ఎన్‌హెచ్‌, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్‌ వయా ఫోర్‌లేన్‌ ఎన్‌హెచ్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి కొయ్యూరు వరకూ రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కాకినాడ పోర్టు ద్వారా ఖనిజాలు, జీవ ఇంధనం, గ్రానైట్‌ వంటివి సులభంగా రవాణా చేయొచ్చన్నారు. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు, పెట్టుబడి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని.. నీరు, విద్యుత్‌, రవాణా లేకపోతే ఇండస్ట్రీలు రావని స్పష్టం చేశారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని.. అవి లేకపోతే పేదరిక నిర్మూలన అసాధ్యమని అన్నారు. ‘ప్రధాని మోదీ దార్శనికతతో దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల్లో భాగంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్‌ శ్రేయస్సుకూ ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్రంలో అపా ర సహజ వనరులు ఉన్నాయి. వాటి ని సద్వినియోగం చేసుకుంటే అభివృ ద్ధి సాధ్యమవుతుంది’ అని తెలిపారు. జాతీయ రహదారులపై ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే మొక్కలు పెంచడానికి కడియం నర్సరీలో ఆరా తీస్తున్నామని గడ్కరీ తెలిపారు.  


బాబూ.. డోంట్‌ వర్రీ అన్నారు!

రాజమహేంద్రి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ప్రస్తావించారు. ‘చంద్రబాబు ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపనకు నితిన్‌ గడ్కరీ వచ్చారు. అప్పుడు చంద్రబాబూ.. డోంట్‌ వర్రీ. నేను ఉన్నాను. ఏపీని అభివృద్ధి చేస్తానని గడ్కరీ చెప్పారు. అలాగే అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడ సభలో సీఎం జగన్‌ తమకు 20 ఫ్లైఓవర్లు కావాలని అడిగితే.. 20 ఏంటి.. 30 ఇస్తున్నానని అన్నారు’ అని వీర్రాజు తెలిపారు. 

Updated Date - 2022-09-23T08:37:54+05:30 IST